మహిళా ఎమ్మెల్సీకి చేదు అనుభవం.. మాట్లాడుతుండగా చెంప దెబ్బ కొట్టిన వ్యక్తి
మహారాష్ట్రకు చెందిన ఓ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీకి చేదు అనుభవం ఎదురైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రకు చెందిన ఓ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఎమ్మెల్సీని పక్కకు లాగి.. చెంపపై బలంగా కొట్టాడు. వివరాల్లోకి వెళితే.. హింగోలి జిల్లా పర్యటనలో ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రద్య్న సాతవ్పై ఈ దాడి జరిగింది. బుధవారం రాత్రి ప్రజలతో ప్రద్య్న మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన గుర్తుతెలియని 40 ఏళ్ల వ్యక్తి.. ఆమెను లాగి గట్టిగా కొట్టాడు. దీనిపై ప్రద్య్న బుధవారం ట్విట్టర్ వేదికగా తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 'కస్బే ధావాండా, కలమ్నూరి గ్రామం వద్ద నాపై దారుణంగా దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి నా వెనుక నుండి దాడి చేశాడు. నా ప్రాణాలకు ముప్పు ఉంది' అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. దీంతో ఆ వ్యక్తిపై ఎమ్మెల్సీ ప్రద్య్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులరు కోరారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ ప్రద్య్న సావత్ దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ సాతవ్ భార్య.