GST : బీమా ప్రీమియంల జీఎస్టీ వసూళ్లలో 74 శాతం రాష్ట్రాలకే : నిర్మలా సీతారామన్

దిశ, నేషనల్ బ్యూరో : జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో స్పందించారు.

Update: 2024-08-07 14:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో స్పందించారు. జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు కూడా అన్ని రకాల బీమాల ప్రీమియంలపై పన్ను విధించే వారని ఆమె గుర్తు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా పన్నులు విధించే ప్రక్రియ అమలైందన్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని తాము కొనసాగించామని నిర్మల తెలిపారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై వసూలవుతున్న జీఎస్టీలో 74 శాతం రాష్ట్రాలకే వెళ్తోందన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో ఆందోళన చేస్తున్న వారు ఎప్పుడైనా తమ రాష్ట్రాల్లో దీనిపై చర్చించారా అని ఆర్థికమంత్రి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘ఒకరు(గడ్కరీ) లేవనెత్తిన అంశంపై ఏకంగా 200 మంది ఎంపీలు పార్లమెంట్‌ వేదికగా అదే పల్లవి అందుకున్నారు’’ అని నిర్మల ఎద్దేవా చేశారు. బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తేయాలంటూ ఆర్థికమంత్రికి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే లేఖ రాశారు. దీంతో అదే అంశాన్ని విపక్ష ఇండియా కూటమి సభ్యులు లోక్‌సభ‌లో లేవనెత్తారు. ఈ క్రమంలోనే బుధవారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల వివరణ ఇచ్చారు.

ఎల్‌టీసీజీ నిబంధనలలో సవరణలు

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన ‘ఫైనాన్స్‌ బిల్లు- 2024’కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి బడ్జెట్‌లో ప్రతిపాదించిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) నిబంధనలను ఈ బిల్లులో సవరించారు. పాత, కొత్త పన్ను విధానాలలో ఏది ప్రయోజనకరంగా ఉంటే దాన్ని ఎంచుకునే వెసులుబాటును రియల్ ఎస్టేట్ రంగ సంస్థలకు కల్పించారు. 2024-25 బడ్జెట్‌లో 20 శాతంగా ఉన్న ఎల్‌టీసీజీని 12.5 శాతానికి తగ్గించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఫైనాన్స్‌ బిల్లులో కేంద్ర సర్కారు ఈ సవరణలు చేసింది. మొత్తం 45 సవరణలతో కూడిన బిల్లును మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. తదుపరిగా ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించనున్నారు. ఫైనాన్స్‌ బిల్లులను తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు. అంటే అక్కడ కూడా దానికి ఆమోదం లభించడం లాంఛనమే.

Tags:    

Similar News