బస్తర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. 36 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడ, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 36 మంది మావోయిస్టులు మరణించారు.

Update: 2024-10-04 16:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గడ్‌లో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న అబూజ్‌మడ్‌ రక్తసిక్తమైంది. ఈ ఏడాదిలోనే భారీ ఎన్‌కౌంటర్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో దంతేవాడ జిల్లాలో జరిగింది. ఈ కాల్పుల్లో 36 మంది మావోలు మరణించినట్టు సమాచారం. ఘటనా స్థలంలో 14 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఏకే 47, ఎస్ఎల్ఆర్ సహా ఇతర ఆయుధాలు, భారీ మందుగుండు లభించిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

ఓర్చా, బస్రూర్ పోలీసు స్టేషన్ల పరిధిలోని గోవెల్, నెందూర్, తుల్తులి గ్రామాల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్టు పోలీసులకు అందింది. ఈ రిపోర్టు ఆధారంగా గురువారం కూంబింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. నారాయణ్‌పూర్, దంతేవాడ జిల్లాల రిజర్వ్ గార్డులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లు ఈ ఆపరేషన్ చేపట్టగా శుక్రవారం మధ్యాహ్నం వారికి మావోయిస్టులు ఎధురుబడినట్టు అధికారవర్గాలు తెలిపాయి. అబూజ్‌మడ్ పరిధిలోని తుల్తులి, నెందూర్ గ్రామాల్లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం వరకూ ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్టుగానే ఆయన చెప్పారు. స్పాట్‌లో 14 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు తెలిసింది. మరికొందరు మావోయిస్టులు పోలీసులపై కాల్పులు కొనసాగిస్తూనే ఇంకా దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నట్టు సమాచారం.

ఈ ఏడాదిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఇది. ఒకే ఆపరేషన్‌లో 30 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 164కు చేరింది. కాగా, 15 మంది భద్రతా సిబ్బంది, 47 మంది సాధారణ పౌరులు కూడా మరణించారు. తాజా ఆపరేషన్‌లో జిల్లా రిజర్వ్ గార్డులు(డీఆర్‌జీ) కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. డీఆర్‌జీలో లొంగిపోయిన మావోయిస్టులు కూడా ఉంటారు. గోవా పరిమాణంలో ఉండే అబూజ్‌మడ్ మావోయిస్టులకు పెట్టని కోటగా ఉంటున్నది. భద్రతా బలగాలు సుమారు 4 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండే ఈ అబూజ్‌మడ్‌లో 50 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.

Tags:    

Similar News