Assam: అసోం కోల్ మైన్స్ లో ప్రమాదం.. ముగ్గురు మృతి
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో(Assam) జరిగిన కోల్ మైన్(coal mine) ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో(Assam) జరిగిన కోల్ మైన్(coal mine) ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. గనిలోకి ఒక్కసారిగా నీరు రావడంతో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొందరు లోపలే చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అస్సాంలోని కొండ ప్రాంతాలైన దిమా హసావో జిల్లాలోని గనిలో సోమవారం దిమా హసావో జిల్లాలోని బొగ్గు గనిలోకి తొమ్మిది మంది వెళ్లారు. ఈక్రమంలోనే లోపల నీరు ఉప్పొంగింది. నీటి ప్రవాహం పెరగడంతో గని నుంచి వరద బయటకు వచ్చింది. దీంతో అందులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు సోమవారం నుంచి అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. వారిని రక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, ఇంజినీర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
ముగ్గురు మృతి
అయితే, గనిలో చిక్కుకున్న తొమ్మిది మందిలో ఇప్పటికే ముగ్గురు కార్మికులు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా మృతదేహాలను మాత్రం స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. కాగా.. 2019లో పొరుగు రాష్ట్రం మేఘాలయలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. గనిలో కొందరు అక్రమంగా పనిచేస్తున్న సమయంలో పక్కనున్న నది నుంచి భారీగా నీరు వచ్చి అందులో చేరింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది జల సమాధి అయ్యారు.