1.25 లక్షల ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరం ‘2023’
దిశ, నేషనల్ బ్యూరో : 2023 సంవత్సరం గడిచిపోయింది.. కానీ పర్యావరణ పరంగా చెరగని ముద్ర వేసింది!
దిశ, నేషనల్ బ్యూరో : 2023 సంవత్సరం గడిచిపోయింది.. కానీ పర్యావరణ పరంగా చెరగని ముద్ర వేసింది! ఎంతగా అంటే.. గత 1.25 లక్షల సంవత్సరాల్లో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిపోయేంతగా!! ఔను.. 2023 అత్యంత వేడి సంవత్సరమని యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. వాతావరణ మార్పుల పరంగా గత కాలం కంటే వచ్చే కాలమే డేంజరస్‌గా ఉండబోతోంది అనేలా ఈ నివేదిక డేంజర్ సిగ్నల్స్ పంపింది. రానున్న సంవత్సరాల్లో భారీ స్థాయుల్లో ఎండలు మోత మోగించే ముప్పు ఉందనేందుకు ఇదొక సంకేతం. ఎల్ నినో, సముద్ర జలాలు వేడెక్కుతున్న ఎఫెక్టుతో 2023 కంటే 2024 సంవత్సరం చాలా వేడిగా ఉండే అవకాశం ఉందని అమెరికాలోని వుడ్‌వెల్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగి వాటిని మానవాళి భరించలేని పరిస్థితి రావచ్చని, హిమానీనదాలు కరిగిపోయే ముప్పును ఎదుర్కొంటాయని పలు అధ్యయన నివేదికలు పేర్కొన్నాయి.