Howrah-Mumbai Express: రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా-ముంబై ఎక్స్ ప్రెస్ (Howrah-Mumbai Express) రైలు పట్టాలు తప్పింది.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా-ముంబై ఎక్స్ ప్రెస్ (Howrah-Mumbai Express) రైలు పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయయి. చక్రధర్‌పూర్ (Chakradharpur) డివిజన్ సమీపంలో, రాజ్‌ఖర్స్ వాన్ వెస్ట్ ఔటర్, బాబాబాంబూ మధ్య ఈ ఘటన జరిగింది. గాయపడిన ప్రయాణికులందరికీ ప్రథమ చికిత్స అందించామని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ప్రమాదంలో రైలులోని 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి. వాటిలో 16 ప్యాసింజర్ కోచ్ లు కాగా.. మిగతావి పవర్ కార్, ప్యాంట్రీ కార్ అని రైల్వే అధికారులు(Indian Railways) తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గాయపడినవారందరికీ ప్రాథమిక చికిత్స అందించి.. ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
గూడ్స్ పట్టాలు తప్పడంతో ప్రమాదం
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎదురుగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు దాన్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాటు చేశారు. కొందర్ని బస్సులో చక్రధరపూర్ కి తరలిస్తున్నారు. ఈ నెలలోనే రైలు పట్టాలు తప్పిన ఘటనలు అనేకం జరిగాయి. జూలై 18న, ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీలు పట్టాలు తప్పడంతో నలుగురు చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఆ తర్వాత అమ్రెహా రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ-లక్నో రైలు పట్టాలు తప్పింది. అయితే, ఆ ప్రమదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఢిల్లీ-లక్నో రైలు మార్గానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.