ADR: మహిళలపై నేరాలకు పాల్పడిన 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు

151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక తాజాగా పేర్కొంది.

Update: 2024-08-21 11:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక తాజాగా పేర్కొంది. 2019, 2024 ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4,809 అఫిడవిట్‌లలో 4,693 పరిశీలించిన తరువాత ఈ డేటాను వెల్లడించారు. మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న మొత్తం 151 మందిలో 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ADR తెలిపింది.

వీరిలో 16 మంది భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 ప్రకారం అత్యాచారానికి సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు చేసిన నేరాన్ని బట్టి కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ADR నివేదిక బయటకు రావడం గమనార్హం.

నివేదిక ప్రకారం, మహిళలపై నేరాలకు సంబంధించి 25 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 21, ఒడిశా 17 మందితో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అభియోగాలు ఉన్న ప్రజాప్రతినిధుల్లో చాలా మందిలో ఒక్కరిపైనే ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. రాజకీయ పార్టీలలో ఎక్కువగా బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ పార్టీకి చెందిన దాదాపు 54 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ 23, తెలుగుదేశం పార్టీ 17 మందితో జాబితాలో ఉన్నాయి.

నివేదిక విడుదల సందర్భంగా, నేర చరిత్ర కలిగిన, ముఖ్యంగా మహిళలపై అత్యాచారం, ఇతర నేరాలకు పాల్పడిన అభ్యర్థులకు రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకుండా ఉండాలని ADR పిలుపునిచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను త్వరితగతిన సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరింది.

Tags:    

Similar News