Trump Tariff: మధ్యంపై 150 శాతం సుంకాలా?.. భారత్ పై అమెరికా విమర్శలు

భారత్, అమెరికా మధ్య టారీఫ్ వార్ నడుస్తూనే ఉంది. టారీఫ్ ల విషయంలో భారత్ ని విమర్శించడంతో పాటు, న్యాయమైన వాణిజ్య పద్ధతులపై ట్రంప్ నిబద్ధతను వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లేవిట్ హైలెట్ చేశారు.

Update: 2025-03-12 11:06 GMT
Trump Tariff: మధ్యంపై 150 శాతం సుంకాలా?.. భారత్ పై అమెరికా విమర్శలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, అమెరికా మధ్య టారీఫ్ వార్ నడుస్తూనే ఉంది. టారీఫ్ ల విషయంలో భారత్ ని విమర్శించడంతో పాటు, న్యాయమైన వాణిజ్య పద్ధతులపై ట్రంప్ నిబద్ధతను వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లేవిట్ హైలెట్ చేశారు. కెనడా యూఎస్ ని దోచుకుంటుందని విమర్శలు గుప్పించారు. టారీఫ్ ల అంశంపై మీడియాతో సమావేశంలో మాట్లాడారు. వివిధ దేశాలు అమెరికాపై విధిస్తున్న పన్నులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ విధిస్తోన్న పన్నుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. " అమెరికన్ ఛీజ్, బటర్‌పై కెనడా దాదాపు 300 శాతం పన్ను విధించింది. భారత దేశం అమెరికన్ ఆల్కహాల్ పై 150 శాతం సుంకం విధిస్తోంది. అది కెంటుకీ బోర్బన్‌ను భారతదేశానికి ఎగుమతి చేయడానికి సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారా? నేను అలా అనుకోను. భారతదేశం నుండి వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకం... జపాన్, బియ్యంపై 700 శాతం సుంకం విధిస్తోంది” లెవిట్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరస్పర వాణిజ్య విధానాలను విశ్వసిస్తారని, పరస్పరం ప్రయోజనకరంగా ఉండేలా టారిఫ్ వ్యవస్థ అవసరమని చెప్పారు. కెనడా కూడా దశాబ్దాల కాలంగా అమెరికాను దోచుకుంటోందని, దారుణమైన టారిఫ్ రేటుతో అమెరికన్లను మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు. చైనా, జపాన్ వంటి దేశాలు తమ దేశ ఉత్పత్తులపై విధించిన పన్నుల గురించి లేవిట్ సమగ్రంగా వివరించారు.

వ్యాపార వాణిజ్య సంబంధాలపై..

ఈ స్థాయిలో టారిఫ్‌ను విధించినప్పుడు అమెరికా వ్యాపార, వాణిజ్య రంగం ప్రయోజనాలు దెబ్బతింటాయని, వాటిపై ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి సారించారని అన్నారు. పరస్పర ప్రయోజనకారిగా ఉండే వాణిజ్య పద్ధతులను అనుసరించాలని ట్రంప్ కోరుకుంటోన్నారని అన్నారు. భారత్‌కు ఏదైనా అమ్మడం దాదాపు అసాధ్యం అంటూ గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను లెవిట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారిందని తేల్చి చెప్పారు. ఇప్పుడు టారిఫ్‌ను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు. ఇకపోతే, భారత్ కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 118.2 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కాగా.. 2030 నాటికి దీనిని 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో భారత్‌ ముందుకు వెళ్తోంది. మోడీ అమెరికా పర్యటనలో.. 2025 చివరి నాటికి.. ఇరుదేశాల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలిదశపై చర్చలు జరపడానికి ట్రంప్‌ అంగీకరించారు. మరిన్ని వస్తువుల ఎగుమతిదిగుమతులు, సుంకాల అడ్డంకులను తొలగించేందుకు ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News