Gujarat Floods : వామ్మో.. ఇంట్లోకి 15 అడుగుల భారీ మొసలి.. కప్పుపై మరొకటి
గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని నదులు, డ్యాములు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఆ నీరంతా పరివాహక ప్రాంతాల్లోకి పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే మూగజీవాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. వడోదర జిల్లాలో విశ్వామిత్ర నది నుంచి భారీగా మొసళ్లు జనావాసాల్లోకి కొట్టుకొచ్చాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా వడోదర ప్రాంతంలో 15 అడుగుల పొడవైన భారీ మొసలి వచ్చింది. ఫతేగంజ్ ప్రాంతానికి సమీపంలోని కామ్‌నాథ్ నగర్‌లో ఓ ఇంటి వద్దకు భారీ మొసలిని చూసీ అందరూ షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ క్యాంపస్‌లోని జువాలజీ విభాగానికి సమీపంలో 11 అడుగుల మొసలిని స్థానికులు గుర్తించారు. అకోటా ప్రాంతంలో కూడా ఓ మొసలి ఇంటి పైకప్పు ఎక్కడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గత ఐదు రోజుల్లో దాదాపు పది మొసళ్ళను రక్షించామని ఓ అధికారి మీడియాతో మాట్లాడారు. వడోదర జిల్లాలోని విశ్వామిత్ర నది నుంచి భారీగా మొసళ్లు జనావాసాల్లోకి వచ్చాయని అధికారి తెలిపారు. కాగా, భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 28 మందికి పైగా చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.