BSF: భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ బలగాలు
బెంగాల్‌లో ఇద్దరు, త్రిపురలో ఇద్దరు, మేఘాలయా సరిహద్దులో ఏడుగురు పట్టుబడినట్టు సమాచారం.
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తిరుగుబాటు పరిణామాల తర్వాత భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులోకి రావాల్సి ఉంది. ముఖ్యంగా మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది సరిహద్దులకు చేరుకుంటున్నారు. తాజాగా ఆదివారం పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయాలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న 11 మంది బంగ్లాదేశ్ పౌరులను పట్టుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. బెంగాల్‌లో ఇద్దరు, త్రిపురలో ఇద్దరు, మేఘాలయా సరిహద్దులో ఏడుగురు పట్టుబడినట్టు సమాచారం. వారిని విచారిస్తున్నామని, అనంతరం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తామని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు. పరస్పరం సమస్యలను పరిష్కరించేందుకు, ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని భారతీయ పౌరులు, మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులపై దాడుల నియంత్రణకు సంబంధించి బీఎస్ఎఫ్, బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన అన్నారు. సరిహద్దు బలగాలు అనేక చొరబాటు ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దులో అనేక పాయింట్ల వద్ద బీజీబీ సహాయంతో గత కొన్ని రోజులుగా వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజలను వెనక్కి పంపారు.