కేసీఆర్ మౌనం వెనుక రహస్యం ఏంటి..?

దిశ, నల్లగొండ/మహబూబ్‌నగర్: ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ లక్ష్యంగా కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రజలకు నీటి కష్టాలు తీరడం లేదు. పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 203తో తెలంగాణలో పలు ప్రాంతాలు ఎడారిగా మారనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారనున్నాయి. మహబూబ్‌నగర్ లో సైతం పంటలకు నీరు అందే పరిస్థితి ఉండదు. పది టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా తెలంగాణ సర్కార్ ప్రకటనలకే […]

Update: 2020-05-17 03:42 GMT

దిశ, నల్లగొండ/మహబూబ్‌నగర్: ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ లక్ష్యంగా కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రజలకు నీటి కష్టాలు తీరడం లేదు. పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 203తో తెలంగాణలో పలు ప్రాంతాలు ఎడారిగా మారనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారనున్నాయి. మహబూబ్‌నగర్ లో సైతం పంటలకు నీరు అందే పరిస్థితి ఉండదు. పది టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా తెలంగాణ సర్కార్ ప్రకటనలకే పరిమితమవుతోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాది అద్వితీయమైన పాత్ర. కోటి ఆశలతో కొట్లాడి రాష్ట్రం సాధించిన్రు. కానీ, రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లయినా జిల్లా వాసులను ఫ్లోరైడ్ సమస్య పట్టి పీడిస్తోన్నది. ఇలాంటి తరుణంలో ఈ జిల్లాపై మరో పిడుగు పడింది. పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కార్ జీవో నెంబరు 203 తీసుకొచ్చింది. ఫలితంగా మనకు రావాల్సిన పది టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలిపోనున్నాయి.

పది టీఎంసీల నీళ్లు మళ్లింపు

జీవో నెంబరు 203 వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలు ఎడారిగా మారనున్నాయి. ఆ జీవో ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్‌లోని 10 టీఎంసీల నీళ్లు రాయలసీమకు మళ్లనున్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ఏడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని సంగమేశ్వర్ నుంచి మూడు టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రధాన కాల్వ ద్వారా రాయలసీమకు మళ్లించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి రూ.6,825 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలావుంటే.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 44 వేల క్యూసెక్కులుగా ఉంది. దాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నిర్ణయం వల్ల నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎడమకాల్వపై ఆధారపడిన 3.50 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారనున్నాయి.

ఆలమట్టితో ఇప్పటికే తీరని నష్టం

వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇప్పటికే ఆలమట్టి ప్రాజెక్టు నిర్మాణంతో తీరని నష్టం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన ఆలమట్టి ప్రాజెక్టు కారణంగా నీటి రాక నిలిచిపోయింది. ఫలితంగా ఎడమకాల్వ ఆయకట్టులో వరికి బదులు వారంబందీ విధానం అమలు, ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దాదాపు ఆరేళ్లు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయకట్టు పరిధిలో రైతులు బావులు, బోర్లు తవ్వుతున్నారు. నిజానికి ఆయకట్టు మొదటి జోన్‌లో నల్లగొండ, సూర్యాపేట, రెండో జోన్‌లో ఖమ్మం జిల్లా, మూడో జోన్‌లో కృష్ణా జిల్లాకు నీరు చేరుతుంది. అయితే మూడో జోన్‌లోని తిరువూరు వరకు నీరు చేరాలంటే.. 45 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు చేరాలంటే 30 టీఎంసీల నీరు సరిపోతుంది. కానీ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడం వల్ల 10 టీఎంసీల నీరు అటువైపే వెళుతుంది. దీంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని ఆయకట్టు ఎండిపోనుంది.

జాతీయ పార్టీల ద్వంద్వ విధానం సరికాదు: నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై జాతీయ పార్టీల ద్వంద్వ విధానం సరికాదు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు క‌ృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ట్రిబ్యునల్ లెక్కల ప్రకారమే నీటిని వాడుకుంటే ఏ గొడవ ఉండదు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి.

పోతిరెడ్డిపాడు‌‌పై ఏపీ ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయం: మంత్రి నిరంజన్‌రెడ్డి

శ్రీశైలం జలాశయం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు ద్వారా 14 తూముల నుంచి 55వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డి పాడు నుంచి తీసుకువెళ్లేందుకు ప్రతిపాదించగా, ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోన్నది. కృష్ణా నదీ జలాలపై నీటి వినియోగానికి సంబంధించి 75 శాతం ప్రాజెక్టులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్తిచేశాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ భూమిలో ఎలాంటి పంటలు వేయాలో ఆలోచిస్తున్నది.

జగన్‌తో కేసీఆర్ చీకటి ఒప్పందం: సంపత్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి

పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఉన్న చీకటి ఒప్పందం కారణంగానే కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి తరలించుకుపోతున్నా సీఎం కేసీఆర్ నోరు విప్పడం లేదు. ఏపీ ప్రభుత్వం 203 జీవో ద్వారా ప్రతిరోజూ లక్ష క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తరలిస్తే పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ తీసుకువస్తున్న జీవోలపై ప్రస్తుతం ఉన్న కృష్ణా ట్రిబ్యునల్ వల్ల సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం లేదు. రాష్ర్ట ప్రభుత్వ తీరులో మార్పు రాకుంటే ఉద్యమం చేపడతాం.

కేసీఆర్ నోరు ఎందుకు పెకలడం లేదు: మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పోతిరెడ్డిపాడుకు 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తే అనేక రకాలుగా విమర్శలు, ఆరోపణలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదు. ప్రస్తుతం జగన్ ఏకంగా 88 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి తరలించేందుకు జీవో తీసుకువచ్చినా సీఎం కేసీఆర్ మౌనం వెనుక రహస్యం ఏంటి? వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్ల కోసమే కేసీఆర్ మాట్లడడం లేదు. వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను సైతం తాకట్టు పెడుతున్నారు. పోతిరెడ్డి అంశం‌పై బీజేపీ తరపున విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం.

Tags:    

Similar News