అధ్వాన్నంగా నకిరేకల్-సాగర్ రోడ్డు

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రహదారుల విస్తరణ అస్తవ్యస్తంగా తయారయింది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం.. గుత్తేదారుల చేతివాటం.. ఫలితంగా అభివృద్ధిలో కీలక పాత్ర వహించే జాతీయ రహదారులు అసంపూర్తిగా మిగులుతున్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నల్లగొండ-నకిరేకల్​ జాతీయ రహదారి 565 రహదారి విస్తరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రహదారి నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు ఆలస్యం చేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో రహదారి నిర్మాణ […]

Update: 2020-11-09 00:46 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రహదారుల విస్తరణ అస్తవ్యస్తంగా తయారయింది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం.. గుత్తేదారుల చేతివాటం.. ఫలితంగా అభివృద్ధిలో కీలక పాత్ర వహించే జాతీయ రహదారులు అసంపూర్తిగా మిగులుతున్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

నల్లగొండ-నకిరేకల్​ జాతీయ రహదారి 565 రహదారి విస్తరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రహదారి నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు ఆలస్యం చేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో రహదారి నిర్మాణ పనులు మధ్యంతరంగా ఆగిపోయాయి. ఈ దారిన గుండా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాడు పరిహారం కోసం బాధితులు కోర్టులను ఆశ్రయించడంతో విస్తరణ పనులు మధ్యలోనే ఆగిపోగా.. ఇప్పుడేమో నిధుల కొరత ఏర్పడింది. రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడం గత ఐదేండ్లుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే వారికి సమస్యలు నిత్యకృత్యంగా మారాయి.

ఐదేండ్లయినా పూర్తికాలే…

మహారాష్ట్రలోని సిరొంఛ నుంచి ఏపీలోని రేణిగుంట వరకు నిర్మితమవుతున్న 565 జాతీయ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. నకిరేకల్ నుంచి సాగర్ వరకు రూ.210 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంగా ఉన్న నల్లగొండను తాకుతూ వెళ్లేలా 86 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే నకిరేకల్ నుంచి నల్లగొండ వరకు 23 కిలో మీటర్ల మేర ద్వితీయ ప్యాకేజీ కింద 2014 మార్చిలో అధికారులు పనులు చేపట్టారు. 2016 మార్చిలోపు రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా కానీ ఇప్పటి వరకు సగం పనులు పూర్తి కాలేదు. రహదారి విస్తరణలో భాగంగా భూములు ఇచ్చిన చిన్నసూరారం, చందనపల్లి, పెద్దసూరారం గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించకుండానే పనులు మొదలు పెట్టారు. దీంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే నకిరేకల్ మండలం తాటికల్ వద్ద వంతెన నిర్మాణం కూడా మధ్యలోనే ఆగిపోయింది.

గతుకులతో ఇబ్బందులు..

నల్లగొండ జిల్లా కేంద్రానికి నకిరేకల్ దగ్గరగా ఉండటంతో రెండు పట్టణాల మధ్య నిత్యం భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. నకిరేకల్, సూర్యాపేట, నల్గొండ ప్రయాణికులు ఇదే ప్రధాన మార్గంగా ఎంచుకుంటారు. విస్తరణ పనులను ఎవరూ పట్టించుకోకపోవడంతో రహదారి మొత్తం అస్తవ్యస్తంగా మారింది. గుంతలకు తోడు, వర్షం వచ్చినపుడు ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అక్కడక్కడా చిన్నచిన్న మరమ్మతులు చేపట్టినా.. వర్షాలకు అదంతా కొట్టుకుపోయి, మళ్లీ గుంతలు కనిపిస్తున్నాయి. తాటికల్, ఆర్లగడ్డ గూడెం, చిన్నసూరారం, పెద్దసూరారం, అగ్రహారం, చందనపల్లి, పానగల్ ప్రాంతాల వాసులు కంకర రోడ్డుతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. బడ్జెట్​ ప్రవేశపెట్టినప్పుడు పరిహారం చెల్లిస్తామని అధికారులు చెబుతున్నా.. చెల్లింపులు చేసేదెప్పుడు, రహదారిని బాగు పరిచేది ఎప్పుడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News