‘సాగర్’ సమరం రెడీ.. ఏ పార్టీ నుండి ఎవరు?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో ఎన్నికకు ముహూర్తం కుదిరింది. పంచ్ డైలాగులతో మైకులు మోత మోగనున్నాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగార్జున‌ సాగర్ ఉప ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. దేశంలో మొత్తం రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. […]

Update: 2021-03-16 10:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో ఎన్నికకు ముహూర్తం కుదిరింది. పంచ్ డైలాగులతో మైకులు మోత మోగనున్నాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగార్జున‌ సాగర్ ఉప ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. దేశంలో మొత్తం రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని నాగార్జున సాగర్‌ శాసనసభ, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ మంగళవారం విడుదల కాగా, ఈనెల 23 నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఏప్రిల్‌ 17న నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచే నామినేషన్లు స్వీకరించనుండగా.. 30వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరి రోజుగా ఈసీ గడువు విధించింది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3న నామినేషన్ల ఉపసంహరణ ఉండగా.. పోలింగ్​ వచ్చేనెల 17న నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్‌లో, వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతితో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

కౌంటింగ్ అప్పుడే

సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు మాత్రం చాలా సమయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో పాటు ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో ఓట్ల లెక్కింపును మే 2న చేపట్టనున్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఫిబ్రవరి 26న షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాగర్‌ ఉప ఎన్నికకు సైతం ఆరోజే షెడ్యూల్‌ ప్రకటిస్తారని భావించినా, ప్రత్యేకంగా ఈసీ మంగళవారం విడుదల చేసింది. అసోంలో 126 స్థానాలకు మూడు విడతల్లో మార్చి 27, ఏప్రిల్‌ 1,6వ తేదీల్లో, తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్‌ 6న ఒకే విడతలో, కేరళలో 140 స్థానాలకు ఒకే విడత ఏప్రిల్‌ 6న పోలింగ్‌ జరుగనుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం 294 స్థానాలకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 1, 6, 10, 17, 22, 26,29 తేదీల్లో అక్కడ పోలింగ్ చేపట్టనున్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాల్లో ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్నిచోట్లా ఓట్ల లెక్కింపును ఒకేరోజున చేసేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో సాగర్​లో ఏప్రిల్​ 17న పోలింగ్​ ముగిస్తే… ఫలితాలు మాత్రం మే 2న వెలువడనున్నాయి.

అప్పటి నుంచే మొదలు

గతేడాది డిసెంబర్​ 1న సాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతి చెందడంతో ఇక్కడ రాజకీయ పరిణామలు మొదలయ్యాయి. ఆయన దశదినకర్మ ముగిసిన రోజు నుంచే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్​ నుంచి వలసలను బీజేపీ ప్రోత్సహించింది. అయితే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్​ విడుదల చేయగా… అదే రోజున ఉప ఎన్నిక తేదీలు కూడా ప్రకటిస్తారని భావించారు. కానీ రాలేదు. ఆ తర్వాత మండలి ఎన్నికల సమయంలో వస్తుందనుకున్నారు. ఎట్టకేలకు కొంత ఆలస్యంగా సాగర్​ ఎన్నికలకు నగారా మోగింది.

సాగర్‌లో సవాల్

సాగర్ ఉప ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. టీఆర్​ఎస్​ పార్టీ మండలానికో ఇంఛార్జీని నియమించింది. సీఎం కేసీఆర్​ సాగర్​ ఉప ఎన్నికలు టార్గెట్​గా హాలియాలో సభను సైతం నిర్వహించారు. అటు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఇక బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికకు సిద్ధమవుతోంది. పార్టీలన్నీ సాగర్​ ఉప ఎన్నికను సవాల్​గా తీసుకున్నాయి. ఇక్కడ గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు నాంది పలుకాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి. ఇదే తరహాలో దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ పరాజయం పాలైంది. గతంలో ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన బీజేపీ విజయం సాధించింది. దీంతో బీజేపీలో దూకుడు పెరిగింది. ఈ పరిణామాలు అధికార పార్టీని కొంతమేరకు కుంగదీశాయి. సానుభూతితో చనిపోయిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్యకే టికెట్​ ఇచ్చారు. సంక్షేమ పథకాలు, సానుభూతి పవనాలు అనుకూలించలేదు. ఫలితంగా ఓటమిని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత జీహెచ్​ఎంసీలో కూడా అదే ఫలితం. దీంతో టీఆర్​ఎస్​ పార్టీ సాగర్​ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు అభ్యర్థుల వేటలోనే గులాబీ బాస్​ అంచనాలు వేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సాగర్​లో ఓడితే పార్టీ పట్టు తప్పుతుందనే సంకేతాలు రాష్ట్రమంతా వెళ్తాయనే భయంతో ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు నేతల పేర్లను పరిశీలనలో పెట్టింది. అయితే బీజేపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాతే టీఆర్​ఎస్​ ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు.

ఇక బీజేపీ కూడా ఆచితూచీ అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన విజయాలను తాత్కాలికం కాదని, ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నామనే సంకేతాలు ఇవ్వాలని సాగర్​ను సవాల్​గా తీసుకుంటోంది. ఇక్కడ ఓడిపోతే బీజేపీది గాలివాటం గెలుపు మాత్రమే అంటూ టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండు పార్టీలు బీజేపీని దెబ్బకొట్టుతాయని అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగా సరైన అభ్యర్థి కోసం వేట సాగిస్తున్నారు. బీసీ అభ్యర్థిని దింపేందుకు ప్రణాళిక చేస్తున్నారు. కానీ కాంగ్రెస్​ నుంచి జానారెడ్డి ప్రధాన అనుచరుడు ఇంద్రసేనారెడ్డి బీజేపీలో చేరడంతో ఆయనకు టికెట్​ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు సర్వే కూడా పూర్తి చేసుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం కూడా కన్నేసింది. గతంలో పోటీ చేసిన నివేదితారెడ్డికి టికెట్​ ఇవ్వాలని బీజేపీలోని ఒక వర్గం పట్టు పడుతోంది. కానీ ఈసారి అభ్యర్థిని మార్చాలని మరోవర్గం ప్రయత్నాలు చేస్తోంది. టికెట్​ ఎవరికి ఇవ్వాలనే అంశం తేలడం లేదు. బీజేపీలో టికెట్​ రాని నేతలను ఉన్నఫళంగా పార్టీలోకి తీసుకుని బరిలోకి దింపాలని అటు టీఆర్​ఎస్​ చూస్తోంది. దీంతో బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితులే నెలకొన్నాయి.

మరోవైపు కాంగ్రెస్‌కు సాగర్​ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. హస్తం నుంచి జానారెడ్డిని పోటీకి దింపేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే జానారెడ్డికి కిందిస్థాయి నేతల నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. కానీ ఈ స్థానం ముందు నుంచీ కాంగ్రెస్​కు కంచుకోట. 2018లో నోముల నర్సింహ్మయ్య… కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డిపై గెలిచారు. కేవలం బీసీ నినాదంతోనే ఆయన గెలిచినట్లు ప్రచారం ఉంది. కానీ ఈసారి గెలిచి దాన్ని బద్దలుకొట్టి, తమ కోటాగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాలు కలిసి వచ్చే విధంగా జానారెడ్డి అధిష్టానంనుంచి ఒత్తిడి తీసుకువస్తున్నారు. కానీ ఇటీవల జానారెడ్డి చేసిన ఓ ప్రకటనతో కాంగ్రెస్​లోని కీలకమైన రేవంత్​వర్గం గుర్రుగా ఉంది.

నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక షెడ్యూల్

మార్చి 23న నోటిఫికేషన్ విడుదల
మార్చి 30 నోవరకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 31న నో నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు
ఏప్రిల్ 17న పోలింగ్
మే 2 న కౌంటింగ్
మే 4 వరకు ఎన్నికల ప్రక్రియ ముగింపు

Tags:    

Similar News