ఓడినా.. నవ్వుతూనే ఉన్న ముంబై ఆటగాళ్లు
దిశ, స్పోర్ట్స్ : ఎవరైనా ఓడిపోతే బాధపడతారు.. కుమిలిపోతారు.. ఏం చేయాలో అర్దం కాక ఒక మూలన కూర్చుండి పోతారు. క్రికెట్ లాంటి ఆటలో అయితే ఒకరినొకరు ఓదార్చుకుంటారు. కానీ ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత ఏ ఒక్కరిలో కూడా కించిత్ బాధైనా కనపడలేదు. పైగా నవ్వుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి ప్రవర్తన ఇలా ఉండటానికి కారణం వారి గత రికార్డులే. ఐపీఎల్ ప్రతీ సీజన్‌లో […]
దిశ, స్పోర్ట్స్ : ఎవరైనా ఓడిపోతే బాధపడతారు.. కుమిలిపోతారు.. ఏం చేయాలో అర్దం కాక ఒక మూలన కూర్చుండి పోతారు. క్రికెట్ లాంటి ఆటలో అయితే ఒకరినొకరు ఓదార్చుకుంటారు. కానీ ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత ఏ ఒక్కరిలో కూడా కించిత్ బాధైనా కనపడలేదు. పైగా నవ్వుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి ప్రవర్తన ఇలా ఉండటానికి కారణం వారి గత రికార్డులే. ఐపీఎల్ ప్రతీ సీజన్‌లో తొలి మ్యాచ్ ఓడిపోవడం ముంబై జట్టుకు ఆనవాయితీగా మారిపోయింది. వరుసగా 9 సీజన్లలో తొలి మ్యాచ్ ఓడిపోయి రికార్డు సృష్టించింది. 2013 నుంచి 2021 వరకు ఆడిన ప్రతీ తొలి మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఇదే సమయంలో ఐదు సార్లు టైటిల్స్ గెలవడం విశేషం. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ సారైనా చెత్త రికార్డును సరిచేయాలని భావిస్తున్నామని చెప్పాడు. కానీ చివరకు మ్యాచ్ ఓడిపోయి ముంబై ఇండియన్స్ మరోసారి తమ రికార్డును సవరించుకున్నది.
ఎప్పటి నుంచి ఇలా..
ముంబై జట్టు తొలి సారిగా 2013 ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్ ఓడిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి కేవలం 154 పరుగులే చేసింది. ఈ సీజన్‌లో తొలి అర్దభాగంలో చాలా మ్యాచ్‌లు ఓడినా.. చిరవ్లో వరుసగా మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరడమే కాకుండా తొలి సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2014లో అబుదాబి వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. కేకేఆర్ జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ముంబై కేవలం 122/7 మాత్రమే చేసి ఓడిపోయింది. 2015లో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మరోసారి కేకేఆర్‌పై ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 168/3 స్కోర్ చేయగా.. కేకేఆర్ జట్టు కేవలం 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఏడాది కూడా ముంబయి టైటిల్ గెలుచుకుంది. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌పై 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2017లో మళ్లీ రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌పైనే 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ ఈ సీజన్‌లో ముంబై మరోసారి టైటిల్ గెలుచుకున్నది.
గత నాలుగు సీజన్లలో..
రెండేళ్ల నిషేధం అనంతరం చెన్నై జట్టు తిరిగి ఐపీఎల్‌లోకి 2018లో అడుగుపెట్టింది. ఆ ఏడాది తొలి మ్యాచ్ ముంబై, చెన్నై మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే చెన్నై జట్టు 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ముంబైని ఓడించింది. 2019లో ఢిల్లీతో తొలి మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 213/6 భారీ స్కోర్ చేసింది. కాగా ఛేదనకు దిగిన ముంబై జట్టు 176 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 2020లో యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ముంబై, చెన్నై మధ్య జరిగింది. అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 162/9 స్కోర్ చేసింది. అయితే చెన్నై జట్టు కేవలం ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ ఏడాది ముంబై రికార్డు స్థాయిలో 5వ సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక తాజాగా ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో కూడా ముంబై ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే బెంగళూరు జట్టు చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకొని 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత తొమ్మిది సీజన్లుగా ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లు ఓడిపోతున్నా.. ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్నది. మరి ఈ సీజన్‌లో మరో టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారో లేదో చూడాలి.