సత్యం X అసత్యం X అర్ధసత్యం.. జనగణమన రివ్యూ
దిశ, సినిమా: ఈ సినిమాని మీరు ఎంత త్వరగా చూస్తే అంత మంచిది. ఎందుకంటే దీన్ని నిషేధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి..Latest Telugu News
దిశ, సినిమా: ఈ సినిమాని మీరు ఎంత త్వరగా చూస్తే అంత మంచిది. ఎందుకంటే దీన్ని నిషేధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదంటే ఇందులో కొన్ని మాటలైనా, సీన్స్ అయినా తీసేయవచ్చు. ఎడ్యుకేషన్ గురించి పట్టదు గానీ, మూడొందల కోట్లు పెట్టి విగ్రహం అవసరమా అని ఒక విద్యార్థితో అనిపించడానికి ఎన్ని గుండెలు కావాలి? అదీ వెండి తెరమీద..ప్రశ్నిస్తే సంకెళ్ళు, నోరెత్తితే జైళ్లు అంటూ డైలాగులు విసిరితే విని సహించే ఓపిక ఈ రాజ్యానికి ఉందా? అసలు విద్యార్థులు.. ఉద్యమాలు..వాటికి కారణాలు..వాటి వెనకున్న పాలిటిక్స్ కథాంశంగా సినిమాలు రావడం ఇప్పుడున్న ఏకైక నెసెసిటీ. అదే పని చేశాడు ఈ నిర్మాత, దర్వకుడు. నాకు ఈ దర్శకుడు ఎవరో తెలియదు. నిర్మాత తెలియదు. ఇందులో యాక్టర్లు తెలియరు. కానీ చూసిన తర్వాత వాళ్ల పేర్లు తెలుసుకోవాలని అనిపించింది. వాళ్లకి చేతులెత్తి మొక్కాలనిపించింది. వాళ్ల ధైర్యానికి మొక్కాలనిపించింది.
మలయాళంలో దీని పేరు 'జనగణమన'. కానీ తెలుగులో 'జన 2022' పేరుతో రిలీజ్ చేశారు. అలా పెట్టడానికి వీరికి ఎక్కడ వణుకు పుట్టిందో ఊహించుకున్నాను. సరే. విషయం చాలా క్లుప్తంగా చెప్పాలి. మీడియా చెప్పేదే సత్యంగా చలామణి అవుతుంది. ఆ మీడియా రాజ్యం చేతుల్లో ఉంది. ఏది నిజం ఏది అబద్ధం పోల్చుకోవడానికి అవకాశమే లేని రోజులు. మీరు నేను అందరం కలిసి పైకి ప్రచారంలో ఉన్నదే సత్యం అని నమ్మి అర్జంటుగా 'ఆలస్యం సత్యం విషం' అన్నట్టుగా స్పందించేస్తున్నాం. ఒరే నాయనా కాస్త ఆగండి. లోతుల్లోకి చూడండి అంటున్నాడు ఈ డైరెక్టర్. లోతుల్లోకి చూడ్డానికి మనకా లోతులు చూపించేదెవరు? ఏమో, కొద్దో గొప్పో సోషల్ మీడియాలో సత్యవాదులు సత్యశోథకులు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్లు చెప్పేది వినేంత ఓపిక అలవర్చుకోవాలి. మీడియా రాజ్యాన్ని, రాజ్య మీడియాని వన్ షాట్ టూ బర్డ్స్ కింద కొట్టి పాడేశాడు ఈ డైరెక్టర్.
కథ సింపుల్. ఇవాళ యూనివర్సిటీల్లో గ్రామాల నుంచి నిరుపేద బలహీన సామాజిక వర్గాల నుంచి వస్తున్న పిల్లల పట్ల సోకాల్డ్ సోషలైజ్డ్ ప్రొఫెసర్లు చూపించే బ్రూటల్ యాటిట్యూడ్ గురించి మౌలికంగా చెప్తూ అదే యాటిట్యూడ్‌ను సమాజంలో పై పై పదవుల్లో ఉన్న సోకాల్డ్ సోషలైజ్డ్ మేధావులు చాలా ఈజీగా ఎలా డెలివర్ చేస్తారో చూపిస్తాడు. మీడియా, రాజ్యం మిలాఖత్‌లో నిర్మితమైన కంకోక్ట్ సత్యాల పట్ల మనల్ని జాగరూకతలోకి నెట్టే ప్రయత్నం చేశాడు ఈ డైరెక్టర్. పైకి యూనివర్సిటీల్లో జరిగే ఉద్యమాలు రాజకీయాలు హత్యలు..ఆత్మహత్యలు..ఇదే విషయంగా కనిపిస్తుంది కానీ దీన్ని సినిమాగా మలచడానికి ముందు ఆ కసరత్తు యుద్ధంలా జరిగి వుంటుందని నేను అర్థం చేసుకోగలిగాను.
అన్నింటి కంటే ఇతని తెలివితేటలు నాకు బాగా నచ్చాయి. వాస్తవాన్ని వాస్తవంగా 'రా' గా తీస్తే కుదిరే పని కాదు. మనం వాస్తవాలను వాస్తవంగా ఎలా చూస్తుంటామో అవి వాస్తవాలు కాదని చెప్పడానికి అదే క్రమాన్ని పాటించడం ఈ డైరెక్టర్ చూపిన మహాప్రజ్ఞ. ఒక ప్రొఫెసర్‌ను రేప్ అండ్ మర్డర్ చేసి కాల్చి బూడిద చేశారు. ఆమె ఎవరు? సత్యం వైపు నిలబడే ప్రొఫెసర్. మంచి వైపు నిలబడి పోరాడే టీచర్. అదే యూనివర్సిటీలో చెడ్డ వైపు నిలబడే వాళ్లు ఉంటారు. అసలు చెడే వుంటుంది. ఘర్షణ తప్పదు. ఆమె ఘర్షణకు దిగిన తర్వాత మరణం వైపు ప్రయాణమూ మొదలవుతుంది. ఆ తర్వాత దేశంలో ఆక్రోశం.. విద్యార్థుల్లో అలజడి.. మానవహక్కుల కార్యకర్తల్లో ఆగ్రహం అన్ని యథాతథమే. నలుగురు నిందితులు దొరుకుతారు. వారిని ఎన్ కౌంటర్ చేస్తాడు ఒక సిన్సియర్ పోలీసాఫీసర్. అతను ఆ తర్వాత అందరికీ ఆరాధ్యుడైపోతాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. 'పింక్' సినిమాలో కోర్టు సీను చూసి ఎంత ఉద్వేగానికి గురయ్యానో ఈ సినిమాలో కోర్టు సీను చూసి అంత అలజడికి లోనయ్యాను. కథ ఉల్టా అవుతుంది. హీరోలు విలన్లవుతారు. జనాగ్రహం నాణెం తిరగబడుతుంది. చూశాక అయ్య బాబోయ్ ఎంత ఉందిరా ఈ సోకాల్డ్ డెమొక్రాటిక్ సొసైటీలో అనిపించి.. ఈ సినిమా చూశాక, ఏదో పిచ్చిగా బుర్ర గోక్కుని మనసుంటే ఆ రాత్రికి నిద్రకు దూరమవుతాం.