Nandamuri Balakrishna :ఇదేంటి బాలయ్య.. టంగ్‌ స్లిప్‌పై వెల్లువెత్తుతున్న నిరసనలు

రాజకీయం, సినీ రంగం ఇంకా చెప్పాలంటే ప్రముఖులు స్టేజ్‌పై ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి

Update: 2023-01-24 13:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయం, సినీ రంగం ఇంకా చెప్పాలంటే ప్రముఖులు స్టేజ్‌పై ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక్కపదం పొరపడిన దాదాపు వారిపని అయిపోయినట్లే. అందుకే వేదికలపై సెలబ్రిటీలు చాలా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అగ్రనటుడు బాలయ్య మాత్రం అందుకు భిన్నం. స్టేజ్‌ ఎక్కి మైక్ పట్టుకున్నారంటే ఇక ప్రవాహమే. ఓ పాట పాడటమో.. ఓ స్టెప్ వేయడమో చేస్తారు. అక్కడ వరకు అయితే ఓకే. ఆ తర్వాతే ఇక మాట్లాడటం మెుదలు పెడితే అది ఎటువైపు వెళ్తుందో తెలుసో తెలియదో కానీ ఒక్కోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతాయి. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బాలయ్య అనేకసార్లు దొరికిపోయారు. గతంలో ఓ వేదికపై ఆడవాళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా వీర సింహారెడ్డి మూవీ విజయోత్సాహంలో బాలయ్య టంగ్ స్లిప్‌ అవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన సినిమా టాక్ కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్నట్లు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.

కౌంటర్ ఇచ్చిన అక్కినేని వారసులు

నందమూరి నటసింహం బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రిరిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్‌లలో బాలయ్య టంగ్ స్లిప్ అవుతున్నారు. దీంతో బాలయ్య సినిమా కంటే ఆయన చేసిన వ్యాఖ్యలే వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవలే దేవ బ్రహ్మణులు రావణుడును పూజిస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించింది. దీంతో బాలయ్య దిగివచ్చి దే వబ్రహ్మణులను క్షమాపణలు కోరారు. అనంతరం వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఆ రంగారావు ఈ రంగారావు... ఆ అక్కినేని తొక్కినేని... అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణను వివాదాల్లోకి నెట్టేశాయి. తెలుగు చిత్రసీమ దిగ్గజాలు అయిన ఎస్వీఆర్, ఏఎన్నార్‌లను ఎంతో చులకన చేసేలా బాలకృష్ణ మాట్లాడారంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని తొక్కినేని అన్న వ్యాఖ్యలకు ఇప్పటికే నాగచైతన్య, అఖిల్‌లు కౌంటర్ ఇచ్చారు. నందమూరి తారక రామరావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలని, వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం అంటూ లేఖ విడుదల చేశారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యపై ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. నీ తర్వాతి తరం వారితో కూడా చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయావా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కాపునాడు డెడ్ లైన్

సీనియర్ నటుడు ఎస్వీ రంగారావుపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాలయ్య వ్యాఖ్యలపై కాపునాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాలకృష్ణ ఈ నెల 25లోపు మీడియా ఎదుటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాల వద్ద కాపులంతా ప్లకార్డులు చేతబట్టి, మౌన ప్రదర్శన నిర్వహించాలని కాపునాడు పిలుపునిచ్చింది. అలాగే గతంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ జీవితం గురించి జనసైనికుల గురించి బాలయ్య చేసిన వ్యా్ఖ్యలను కాపునాడు ప్రత్యేకంగా ప్రస్తావించింది. 'చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యారు. రాజకీయాలు తమకే సాధ్యమంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జనసేన పార్టీలో ఉండేవాళ్లు అలగాజనం, సంకరజాతివాళ్లు' అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని వారు ఆరోపించారు. ఇకనైనా బాలయ్య తన ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. ఈనెల 25లోపు క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని కాపునాడు హెచ్చరించింది.

Tags:    

Similar News