Disha Special Story: పాన్ ఇండియాలో సౌత్‌నే హీరో! బాలీవుడ్‌ను వెనక్కినెట్టిన టాలీవుడ్
ఇండియన్ సినిమా అనగానే మొదట గుర్తొచ్చేది బాలీవుడ్. గత కొన్ని దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాలో బాలీవుడ్ ప్రత్యేకత అలాంటిది.
ఇండియన్ సినిమా అనగానే మొదట గుర్తొచ్చేది బాలీవుడ్ (Bollywood). ఎందుకంటే గత కొన్ని దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాలో బాలీవుడ్ ప్రత్యేకత అలాంటిది. వేరే ఏ ఇతర భాషలకు అందనంత దూరంలో ఉంటేవి బాలీవుడ్ సినిమాలు. డైరెక్షన్, కథలు, స్రీన్ ప్లే, మ్యూజిక్ ఇలా అన్నింట్లోనే వాళ్లదే హవా. అప్పట్లోనే విదేశాల్లోనూ బాలీవుడ్ నటీనటులకు ఫ్యాన్ ఫాలోయింది ఉండేది. దేశంలో హిందీ మాట్లాడే భాషారాష్ట్రాలు కూడా ఎక్కువ కావడంతో బాలీవుడ్ సినిమాలకే క్రేజ్ ఉండేది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. ఓడలు బండ్లు అయితాయి.. బండ్లు ఓడలవుతాయి... ప్రస్తుతం అదే జరుగుతుంది. దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలిన బాలీవుడ్ ఇప్పుడు కథలు దొరక్క సౌత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంది.
కరోనా పుణ్యమా అని థియోటర్లకు వెళ్లకుండా బోలేడు ఓటీటీ ప్లాట్ ఫ్లామ్‌లు పుట్టుకొచ్చాయి. ఓటీటీ ద్వారా అన్ని రకాల భాషల చిత్రాలను చూసే అవకాశం దక్కింది. దీంతో ప్రేక్షకుడు భాషతో, నటులతో సంబంధం లేకుండా కేవలం కథ, డైరెక్షన్ నమ్మి మూవీస్ చూడడం మొదలు పెట్టడంతో ప్రేక్షకుడు మనసు అన్ని భాషలపై పడింది. దీనికి తోడు ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు ముందంజలో ఉన్నాయి. హిందీ చిత్రాలు మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకోడానికే నానా తంటాలు పడుతుంటే, మన సినిమాలు మాత్రం పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తున్నాయి. విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నారు. చిన్న చిన్న డైరెక్టర్లు, తక్కువ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు తీసి విజయాలు సాధిస్తుండటంతో బాలీవుడ్ చూపు సౌత్ వైపు మళ్లింది. ఎంతలా అంటే పాన్ ఇండియా మూవీ అంటే సౌత్ నుంచే అన్న రేంజ్‌లో ఎదిగిపోయింది. - గోపు రాజు
పాన్ ఇండియా అంటే..
పాన్ఇండియా సినిమా... పాన్ఇండియా సినిమా... పాన్ఇండియా సినిమా... ఇప్పుడు ఇదే చిత్రసీమలో తరుచూ వినబడుతున్న పేరు. ఇప్పుడు ఏ సినిమా తీసిన పాన్ ఇండియా లెవల్‌లోనే తీస్తున్నారు. చిన్న, పెద్ద సినిమాలేవైనా.. ఇప్పుడు పాన్ఇండియా లెవల్‌లోనే తీస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ అంటే దేశంలోని ఒక భాషలో కాకుండా వివిధ భాషల్లో సినిమాను ఏకకాలంతో రిలీజ్ చేస్తే ఆ సినిమాలను పాన్ ఇండియా సినిమా అంటారు. దీంతో ఒక భాషలో ఆడియన్స్ కనెక్ట్ కాకపోయినా మరో భాషలో అయినా కనెక్ట్ అవుతున్నారు. దీంతో మంచి స్టోరీ దొరికితే చాలు భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసి పాన్ ఇండియా లెవల్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఎప్పుడు మొదలైందంటే...
తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి:ది బిగినింగ్(2015)లో ఈ పాన్ ఇండియా క్రేజ్ మొదలైంది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఇటు ప్రభాస్‌కు, అటు రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో మొదలైన పాన్ ఇండియా క్రేజీ ఆ తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమాకు మొదటి నార్మల్ టాక్ వచ్చినా మొదటి పార్ట్‌లో బాహుబలిని కట్టప్ప చంపే సీన్ ఉంటుంది. ఈ తర్వాత ‘ Why Kattappa Killed Bahubali’ అని మొదలైన సెర్చింగ్ ప్రపంచం మొత్తం మార్మోగింది. గూగుల్ సెర్చ్‌లో కూడా అప్పుడు అత్యధికంగా వెతికిన ప్రశ్నగా ఇదే నిలవడం ఏ లెవల్‌లో ఆ సినిమాకు కనెక్ట్ అయ్యారో ఊహించవచ్చు. అలా మొదలైన సందడి ఆ తర్వాత బాహుబలి : ది కన్‌క్లూజన్‌తో టాలీవుడ్ క్రేజ్ మరింత పీక్స్‌కి వెళ్లింది. మొత్తానికి బాహుబలి సినిమా పాన్ ఇండియా సినిమాలకు టార్చ్ బేరర్‌గా నిలిచింది. అయితే అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు డబ్బింగ్ చేసి వివిధ బాషల్లో రిలీజ్ చేసినప్పటికీ దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మాత్రం బాహుబలితోనే. అప్పటి నుంచే పాన్ ఇండియా సినిమాల క్రేజ్ మొదలైంది.
1959 లోనే మొదటి పాన్ ఇండియా సినిమా..
1959 లో విడుదలైన మహిషాసుర మర్దిని (కన్నడ) సినిమా మొదటి పాన్-ఇండియన్ చిత్రం. ఈ సినిమాను ఏడు భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఆ తర్వాత నాలుగు భాషల్లో మరే సినిమా విడుదల కాలేదు. అప్పట్లో మలయాళ సినిమా మై డియర్ కుట్టిచేతన్ యావత్ భారతదేశాన్ని అలరించింది. ఈ చిత్రం 1984లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లతో విడుదలైంది.
సౌత్‌కు బాలీవుడ్ క్యూ..
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాల వైపు క్యూ కడుతోంది. ఇందులో కొందరు పూర్తి స్థాయిలో సినిమా చేస్తూ, మరి కొందరు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఈ విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో జవాన్ మూవీ రూ.300 కోట్లతో తీస్తే రూ.1000 కోట్లు క్రాస్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకు ముందు మురుగుదాస్ బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ తో ‘గజిని’ తీసి విజయవంతం అయిన సంగతి కూడా తెలిసిందే. అలాగే టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి ఒక్క సినిమాతోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారాడు. అదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' పేరిట షాహిద్ కపూర్‌తో రీమేక్ చేశాడు సందీప్ వంగా. హిందీలో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ విజయంతో సందీప్ వంగా తన రెండో హిందీ సినిమా 'యానిమల్' రణబీర్ కపూర్‌తో తీశాడు. ఆ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. యానిమల్ మూవీ కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. 'యానిమల్' హిందీ సినిమాకి సీక్వెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిన విషయమే.
దేవర సినిమాలో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ చేశాడు. రాజమౌళి మహేష్ బాబు కాంబో వస్తున్న మూవీలో కూడా బాలీవుడ్ నుంచి తీసుకోవాలని చూస్తున్నారని టాక్. మంచు విష్ణు తీస్తున్న కన్నప్ప మూవీలో శివునిగా అక్షర్ కుమార్ నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమా దర్శకుడు మురుగుదాస్‌తో, గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌తో, వంశీ పైడిపల్లి తన తదుపరి ప్రాజెక్ట్ షాహిద్ కపూర్‌తో, ప్రశాంత్ వర్మతో రణవీర్ సింగ్ సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. 'కల్కి 2898 ఏడి' సినిమాతో అమితాబ్ బచ్చన్ కూడా తెలుగులో ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు దర్శకుల హవా నడవటమే కాకుండా, తెలుగు సినిమాలో నటించడానికి హిందీ నటుల ఆసక్తి చూపుతున్నారన్న సంగతి కూడా అర్థం అవుతోంది. హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా సౌత్ బాట పట్టారు. ఇప్పటికే కృతిసనన్, కియారా అద్వాని, శ్రద్దాకపూర్, దీపిక పదుకొనే, ఆలియా భట్ లు ఇప్పటికే నటించారు. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ కూడా దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అ తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్ మూవీలో కూడా నటించబోతుంది. మంచి కథ దొరికితే టాలీవుడ్‌లో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు రెడీగా ఉన్నట్లు టాక్.
అందరినీ ఒకే చోట...
డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల కూడా తమ సినిమా లాభాల బాట పట్టాలంటే ఏం చేయాలో అదే చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ దేశంలోని అన్ని భాషలు ప్రేక్షకులు చూస్తారు కాబట్టి ఒకే సినిమాలో ఆయా ప్రాంతాల సెలబ్రిటీలను జాయిన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒక పాన్ ఇండియా మూవీ టాలీవుడ్ డైరెక్టర్ తీస్తే ఇందులో టాలీవుడ్ నటుడు హీరోగా ఉంటే బాలీవుడ్ నటుడు విలన్‌గా, కోలీవుడ్ నటుడు హీరో ఫ్రెండ్‌గా, కన్నడ, మళయాళ నటులను కూడా ఇందులో నటించే విధంగా ప్లాన్ చేసి మార్కెట్ ను మరింతగా పెంచుకుంటున్నారు. దీంతో ప్రమోషన్స్ ఎక్కడి వాళ్లతో అక్కడ చేయించుకుని లాభాల బాట పడుతున్నారు. అక్కడి ఫ్యాన్స్ కూడా ఇటు స్టోరీ అటు వాళ్ల ఇండస్ర్టీ నటులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి భారీ స్థాయిలో సపోర్టు కూడా చేస్తున్నారు. ఇలా అందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపెడుతూ పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
పాన్ ఇండియా మూవీస్‌లో ప్రభాస్ టాప్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఫ్లో ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. హిట్లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా స్టార్ డైరెక్టర్లు అందరూ ప్రభాస్‌తో సినిమాలు భారీ బడ్జెట్‌తో తీయడానికి వెనుకడట్లేదు అంటే అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ మానీయ ఎలా ఉందో. ఇండియాలోనే కాదు.. ఇప్పుడు మన సినిమాలకు చైనా, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ ఇలా చాలా దేశాల్లో ఫ్యాన్స్ పెరిగిపోయారు. సినిమా సినిమాకి అక్కడ కలెక్షన్లు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి1,2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి-1 సినిమాల్లో నటించారు. ఇవే కాక కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్-2, నాగ్ ఆశ్విన్‌తో కల్కి-2, డైరెక్టర్ మారుతితో రాజా డీలక్స్, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సీతారామం డైరెక్టర్ హను రాఘపూడి డైరెక్షన్‌లో నటించబోతున్నాడు. వీటితో కలిపి దాదాపు 12 పాన్ ఇండియా సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ప్రభాస్‌తో పాటు అల్లుఅర్జున్ పుష్ప-2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, తేజ సజ్జా జై హనుమాన్, మంచు విష్ణు కన్నప్ప, జూ.ఎన్టీఆర్ దేవర, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఒక మూవీ అప్ కమింగ్ లిస్ట్‌లో ఉన్నాయి.
టాలీవుడ్‌లో బాహుబలితో పాన్ ఇండియా మొదలైతే, ఇటీవల కాలంలో కన్నడ సినిమా ఇంతగా సక్సెస్ అవ్వడానికి పునాది వేసింది మాత్రం ప్రశాంత్ నీల్. హాలీవుడ్ రేంజ్‌లో కేజీఎఫ్ రెండు భాగాలుగా తీసి పాన్ ఇండియా లెవల్లో కన్నడ సినిమా స్థాయిని పెంచాడు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి లాంటి స్టార్లంతా తక్కువ బడ్డెట్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ శాండల్‌వుడ్‌ను ట్రాక్ ఎక్కించారు. తమిళంలో కూడా పాన్ ఇండియా లెవల్‌లో ఇండియన్ 2, రాయన్, తంగలాన్, గోట్, వెట్టయాన్, కంగువా, విదాముయార్చి, అమరన్ మూవీలతో ఆవరేజ్ ట్రాక్‌లతోనే నడుస్తోంది. ముఖ్యంగా మాలీవుడ్ చిత్ర పరిశ్రమ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌తోనే సంచలనాలు సృష్టిస్తున్నారు.