కామెడీ కింగ్.. హాస్య‘బ్రహ్మ’ పుట్టినరోజు
రోజంతా ఎంతో కష్టపడి ఇంటికొచ్చిన ఎవరైనా టీవీ ముందు కూర్చొని కాస్త రిలాక్స్ అవడం మనం చూస్తుంటాం.
దిశ, సినిమా: రోజంతా ఎంతో కష్టపడి ఇంటికొచ్చిన ఎవరైనా టీవీ ముందు కూర్చొని కాస్త రిలాక్స్ అవడం మనం చూస్తుంటాం. కొందరు తలనొప్పితో, మరికొందరు స్ట్రెస్‌తో ఇబ్బంది పడుతూ ఇంటికొచ్చిన వారికి అన్నీ మర్చిపోయి ఆనందం పంచేవారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. తెలుగులో ఆయన చేయని పాత్ర, కనిపించని అవతారం అంటూ ఏదీ లేదు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నా, బ్రహ్మానందం శైలి విభిన్నం. తన ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ చెప్పే విధానం, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఆయన సొంతం.
స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులు పూస్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన ఓ వజ్రంలాంటి వాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్క తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో నటించిన సత్తా చాటారు. దేశ వ్యాప్తంగా మొత్తం 1250కి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి ఆయన్ను గౌరవించింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు విషెస్ చెబుతున్నారు.