దర్శన్ కేసుపై మొదటిసారి స్పందించిన భార్య.. మన న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉందంటూ పోస్ట్
కన్నడ స్టార్ హీరో దర్శన్ భార్య పిల్లలు ఉండగా మరో నటి పవిత్ర గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు.
దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో దర్శన్ భార్య పిల్లలు ఉండగా మరో నటి పవిత్ర గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే పవిత్రని రేణుక స్వామి అనే దర్శన్ అభిమాని సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు పంపించి ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలు పాలయ్యాడు. ఈ కేసులో దర్శన్‌తో పాటు మరికొంత మంది కూడా అరెస్ట్ అయ్యారు.
ఇక ఇప్పటికే దర్శన్ అరెస్ట్ పై అతని కుమారుడు స్పందించి మా ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు, ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేయొద్దు అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి తన భర్త అరెస్ట్ పై మొదటిసారి సోషల్ మీడియాలో స్పందించింది. ఆ క్రమంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ పోస్ట్ పెట్టింది విజయలక్ష్మి.
విజయలక్ష్మి తన పోస్ట్‌లో.. రేణుక స్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని మరణాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. గత కొద్ది రోజులుగా దర్శన్, నేను, మా అబ్బాయి, దర్శన్ కుటుంబ సభ్యులు మాటల్లో వర్ణించలేని బాధను అనుభవిస్తున్నాము. గౌరవనీయుమైన న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం, మీడియా మరియు సోషల్ మీడియా, సైట్‌లో ఎలాంటి తప్పుడు వార్తలు, అనధికారిక సమాచారాన్ని ప్రచురించవద్దని నేను కోరుకుంటున్నాను. అధికారులు వెల్లడించిన సమాచారం మాత్రమే ప్రచురించాలని కోరుకుంటున్నాను. చాముండేశ్వరి అమ్మవారిపై, మన న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ పై దర్శన్ ఫ్యాన్స్ మాత్రం మీకు మేము అండగా ఉన్నాం అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో భర్త తప్పు చేసిన సపోర్ట్ చేస్తుంది అని విమర్శిస్తున్నారు.