నన్ను కన్నవాళ్లకు లేని బాధ మీకెందుకు.. ఫ్యాన్స్‌పై తమన్న ఫైర్
డేటింగ్, పెళ్లి వార్తలతో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న తమన్నా భాటియా తాజాగా నెటిజన్ల తీరుపై ఫైర్ అయింది.
దిశ, సినిమా: డేటింగ్, పెళ్లి వార్తలతో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న తమన్నా భాటియా తాజాగా నెటిజన్ల తీరుపై ఫైర్ అయింది. తాజాగా చెన్నై వేదికగా జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న ఆమె అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ అలరించింది. ఈ క్రమంలోనే ‘నెగెటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటారు?’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘నాపై విమర్శలు వచ్చినపుడు ఎందుకిలా జరుగుతుందని ముందు ఆలోచిస్తా. అయితే దేన్నైనా కొంతమంది ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తారు. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. వ్యతిరేకతను నేను ఎక్కువగా పట్టించుకోను’ అని చెప్పింది. అలాగే ‘మీరు మ్యారేజ్ ఎప్పుడూ చేసుకుంటున్నారు? తమిళ్ అబ్బాయిలు మీకు నచ్చలేదా? అంటూ ఓ యువకుడు కాస్త వెటకారంగా అడిగాడు. దీంతో ‘నా పేరెంట్స్ ఇలా ఎన్నడూ వేధించలేదు. పెళ్లి గురించి వాళ్లకు ఎలాంటి కంగారు లేదు. అయినా మీరెందుకు ఇలా పదే పదే అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. కెరీర్, లైఫ్ హ్యాపీగా సాగుతుంది’ అంటూ ఫైర్ అయింది తమన్న.