సోషల్ మీడియాలో నోరా ఫతేహి డీప్ ఫేక్ వీడియో.. ఆమె రియాక్షన్ ఇదే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ మరోవైపు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల డీప్ ఫేక్ వీడియోలను, ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
దిశ, సినిమా : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ మరోవైపు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల డీప్ ఫేక్ వీడియోలను, ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు తమ వ్యాపార ప్రయోజనాలకు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి డీప్‌ఫేకింగ్ వైపు మొగ్గుతున్నారు.
ఇప్పటికే రశ్మికా మందన్న, రతన్ టాటా లాంటి ప్రముఖులు కూడా డీప్ ఫేకింగ్ బారినపడి, దానికి వ్యతిరేకంగా వాయిస్ పెంచారు. తాజాగా ప్రముఖ నటి, డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి బాధితురాలిగా మారింది. ఆమె అనుమతి లేకుండానే ఒక ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ కోసం ఆమె ఇమేజ్‌ను మార్ఫింగ్ చేసి ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నోరా ఫతేహి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. టెక్నికల్ అపెరల్ అండ్ అథ్లెటిక్ షూస్ వెబ్‌సైట్ లులుమెలోన్ బ్రాండ్‌ను ప్రచారం చేయడానికి తన డీప్‌ఫేక్ వీడియోను ఉపయోగించారని పేర్కొన్న నోరా, అది చూసి షాకయ్యానని తెలిపింది. తన ఇన్‌స్టా పోస్టులో “SHOCKED!!! This is not me!’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇంతకు ముందు కూడా..
నోరా ఫతేహికంటే ముందు.. ఇటీవల సచిన్ టెండూల్కర్ కూడా డీప్‌ఫేక్స్ సమస్యను ఎదుర్కొన్నాడు. ఒక మొబైల్ అప్లికేషన్‌ను తాను ప్రమోట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక డీప్ ఫేక్ వీడియో చక్కర్లు కొడుతున్నట్లు తెలిడు. అలాగే జనవరి 20న రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో నెట్టింట హల్‌చల్ చేయడంతో ఆమె స్పందించింది. ఈ విషయంలో నిందితున్ని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇక హీరోయన్స్ అలియా భట్, కాజోల్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, పారిశ్రామికవేత్త రతన్ టాటా లాంటి వారు కూడా డీప్‌ఫేక్ ముప్పును ఎదుర్కొన్నవారే. వీరికి సంబంధించి మార్ఫింగ్ చేసిన ఇమేజెస్, వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో డీప్‌ఫేక్‌లకు వ్యతిరేకంగా వారంతా వాయిస్‌ను పెంచారు.
భద్రతకు ముప్పు
డీప్ ఫేక్ వీడియోస్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో గతంలో కేంద్ర సమాచార సాంకేతికశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. దేశంలోని వివిధ సోషల్ మీడియా, ఇంటర్నెట్ఆధారిత ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా ఉండేలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ప్రభుత్వం కఠిన నిబంధనలను త్వరలో తెలియజేస్తుందని పేర్కొన్నారు. AI బేసిస్ డీప్‌ఫేక్స్, తప్పుడు సమాచారంవల్ల ఇండియన్ యూజర్ల భద్రతకు, విశ్వాసానికి ముప్పు వాటిల్లు తుందని ఆయన పేర్కొన్నారు.