చిరంజీవి మాటల వల్లే నాకు ఇంత గొప్ప అవకాశం.. స్వర వీణాపాణి

చిరంజీవి మాటల వల్లే తాను గొప్ప స్థాయికి ఎదిగానని మ్యూజిషియన్ స్వర వీణాపాణి అన్నారు.

Update: 2023-03-12 10:23 GMT

దిశ, వెబ్ డెస్క్: సరిగ్గా ఏడాదిన్నర క్రితం లండన్‌లో 64 గంటలపాటు 72 మేళకర్తరాగాలను ఆపకుండా వాయించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నారు తెలుగు సంగీత దర్శకుడు స్వర వీణాపాణి. లండన్‌లో ఆయన్ని ఇండియన్‌ మ్యాస్ట్రో అంటూ సత్కరించారు. అంత గొప్ప అవార్డు పొందిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన వీణాపాణిని ఘనంగా సత్కరించారు మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్, తనికెళ్ల భరణి. వీణాపాణిని సత్కరించిన తర్వాత మెగాస్టార్‌ మాట్లాడుతూ.. ‘‘ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందిన వీణాపాణి మన తెలుగువాడు కావటం ఎంతో ఆనందంగా ఉంది.

ఏకధాటిగా 64 గంటలపాటు ఒకేచోట కూర్చుని వాయించి ఇంతగొప్ప అవార్డును, ఖ్యాతిని భారతదేశానికి తీసుకువచ్చిన వీణాపాణి టాలెంట్‌ గురించి ఎంతచెప్పిన తక్కువే. ఇంతటి ప్రతిభాశాలి సంగీతంలో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి అన్నారని ఈ రోజు గుర్తు చేసుకున్నారు వీణాపాణి. మార్చి 15నుండి దాదాపు 4 నెలలపాటు వీణాపాణి అమెరికా, లండన్‌లలో అనేక సంగీత కచేరిలు చేయనున్నారు. ఈ సందర్భంగా వీణాపాణి మాట్లాడుతూ.. ‘‘ నేను గిన్నిస్‌బుక్‌ అవార్డు సాధించిన రోజు ఎంత గొప్పగా ఫీలయ్యానో చిరంజీవిగారు ఆప్యాయంగా పిలిచి సత్కరించిన రోజు కూడా అంతే గొప్పగా ఫీలయ్యాను. ఆయన నన్ను సత్కరించి సంగీత సరస్వతి చేతిలో ఉన్న మీలాంటివారు మరెన్నో కార్యక్రమాలు చేపట్టండి.

ఎంతోమంది రసహృదయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరిని మీ సంగీతంతో తన్మయత్వం చెందేలా చేయమని సలహా ఇచ్చారు. ఏ ముహుర్తాన ఆయన అలా అన్నారో ఈ రోజున చిరంజీవిగారి మాట నిజమైంది. అమెరికా, లండన్ లో దాదాపు 45 చోట్ల నేను నా సంగీతంతో శ్రోతలను అలరించటానికి వెళుతున్నాను. నన్ను గతంలో ప్రోత్సహించిన చిరంజీవిగారికి, ఇప్పుడు 4నెలల టూర్‌ను ప్లాన్‌ చేసి నాకు సహకరిస్తున్న సంస్థలకు వ్యక్తులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’’ అన్నారు.

Tags:    

Similar News