Kangana Ranaut: కొత్త సినిమా అనౌన్స్ చేసిన కంగనా రనౌత్.. టైటిల్ తెలిస్తే వాహ్ అనాల్సిందే..!
బాలీవుడ్ బ్యూటీ, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ప్రస్తుతం మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ప్రస్తుతం మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఇప్పటికే కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన ఎమర్జెన్సీ చిత్ర విడుదలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేసిన కంగన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫ్లోటిక్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ యూనియో ఫిల్మ్స్‌కు చెందిన ఆది శర్మతో కలిసి ఉన్న ఫోటోలను మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసిన కంగన.. తాను మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది సమరయోధుల గురించి మనకు తెలియదని, అలాంటి అన్సంగ్ హీరోస్ గురించే తన తదుపరి సినిమా ఉండబోతోందని కంగన తన పోస్ట్‌లో ప్రకటించారు. ఇక ఈ సినిమాకు ‘భారత భాగ్య విధాత’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ గురించి చిత్ర నిర్మాణ సంస్థలు కూడా ఇన్‌స్టా వేదికగా స్పందించాయి. తమ తొలి ప్రాజెక్ట్‌లోనే కంగన వంటి బెస్ట్ యాక్టర్‌తో పని చేయడం ఆనందంగా ఉందని, అందులోనూ భారతదేశ విముక్తి కోసం పోరాడి చీకట్లలో కలిసిపోయిన అన్సంగ్ హీరోస్ గురించి సినిమా నిర్మిస్తుండడం మరింత ఆనందాన్నిస్తోందని పేర్కొన్నాయి. విజనరీ డైరెక్టర్, రైటర్ మనోజ్ తపాడియా డైరెక్షన్లో రూపొందబోతున్న ఈ సినిమాని ప్రేక్షకులంతా ఆదరించాలని కోరాయి.
కాగా.. కంగన నటించిన ఎమర్జెన్సీ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) నుంచి ఇంకా రాకపోవడంతో సినిమా విడుదలను ఇటీవలే వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే 1975లో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలోనే పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఇందులో కంగన్ రనౌత్ స్వయంగా ఇందిరాగాంధీ పాత్రలో నటించారు.