Ram Charan : ఆ డైనమిక్ ఆఫీసర్ జీవిత కథే ‘గేమ్ ఛేంజర్’ స్టోరీనా?
దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’.
దిశ, సినిమా: దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. మార్చి ఫస్ట్ వీక్ వరకు ఇక్కడే షూటింగ్ జరగనుందని సమాచారం. మెగా హీరోకు ఇది పాన్ ఇండియా చిత్రమని చెప్పుకోవచ్చు.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చరణ్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇందులో ఈ హీరో పేరు రామ్ నందన్ అట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన చరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందట.
అయితే ఈ సినిమా టి. ఎన్. శేషన్‌ను గుర్తు చేసుకునే విధంగా ఉండనుందని నెట్టింట టాక్ వినిపిస్తోంది. తమిళనాడుకు చెందిన తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్ మంచి పేరు దక్కించుకున్న ఐ.ఎ.ఎస్ అధికారి. అతను భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 10వ భారత ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా, ఐ.ఎ.ఎస్ అధికారిగా, 18వ భారత కేబినెట్ సెక్రటరీగా పనిచేసి.. ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు అందుకున్నారు.
టి. ఎన్. శేషన్ తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మొత్తం మార్చేశాయి. ఎలక్షన్స్‌లో డబ్బు ప్రవాహానికి శేషన్ చెక్ పెట్టడం, దళితులు వంటి అణగారిన వర్గాలు స్వేచ్ఛగా ఓటు వేయగలిగలిగేలా చేయడం ఇలా ఈయన పని తీరు ప్రజాస్వామికవాదులను, సాధారణ ప్రజానీకాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా టి. ఎన్. శేషన్ లైఫ్ స్టోరీనే అంటూ నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు.