రజినీకాంత్ సినిమాలో నటించే చాన్స్ అంటూ పోస్ట్.. మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ
ఇటీవల కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌లో వచ్చేవి నమ్ముతూ కేటుగాళ్ల బారిన పడుతున్నారు. దీంతో వారు చెప్పిందల్లా చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌లో వచ్చేవి నమ్ముతూ కేటుగాళ్ల బారిన పడుతున్నారు. దీంతో వారు చెప్పిందల్లా చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కేటుగాళ్లు సెలబ్రిటీల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతూ ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా, స్టార్ హీరో రజినీకాంత్ పేరుతో మోసాలు మొదలెట్టారు కొందరు కేటుగాళ్లు. రజినీకాంత్-లోకేష్ కనకరాజ్ కాంబోలో తలైవర్-171 అనే సినిమా రాబోతున్నట్లు ఇటీవల ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేటుగాళ్లు ఇదే అదునుగా భావించి భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. తలైవర్-171 సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్నవారు కావాలంటూ బెంగళూరులో ఒక ఆడిషన్స్ జరుగుతున్నట్లు పోస్ట్ పెట్టారు.
అది కాస్త నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన రజినీకాంత్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. దీంతో వారిని నమ్మి ఆడిషన్స్‌కు కూడా వెళ్లి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత తాము మోసపోయామని తెలుసుకుని ఈ విషయం తమ కుటుంబానికి తెలిస్తే బాధపడతారని సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ మోసపోయిన వారిలో మృదుల అనే ఓ బాధితురాలు మాత్రం తన ఆవేదనను వ్యక్తం చేస్తూ అసలు నిజాలను బయటపెట్టింది. ‘‘రజనీకాంత్ సినిమాలో నటించడానికి చాన్స్ అని చెప్పి నా దగ్గర రూ.3.9 లక్షలు తీసుకున్నారు. తలైవాతో సినిమా అనేసరికి నమ్మి డబ్బు వారికి ఇచ్చాను. దానికి సురేష్ కుమార్ అనే వ్యక్తి కాస్టింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. న డబ్బులు ఎలాగైనా ఇప్పించాలని బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు కూడా పెట్టాను. వారు దీనిపై విచారణ చేపట్టారు’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More..