కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు మరో ఎదురుదెబ్బ.. కేటీఆర్‌తో సహా మంత్రులు ఫెయిల్?
దిశప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుముఖ పోటీ తప్పనిసరి అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరిని మండలికి పంపించాల్సి ఉండగా 27 మంది నామినేషన్ దాఖలు చేశారు. అందులో ముగ్గురి నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురి కాగా, 24 మంది మిగిలారు. వీరిలో 14 మంది నామినేషన్లు ఉప సంహరించుకోగా 10 మంది బరిలో నిలిచారు. మంత్రుల ‘విఫల’ యత్నం.. మంత్రులు కేటీఆర్ హైదరాబాద్ నుంచి.. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు […]
దిశప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుముఖ పోటీ తప్పనిసరి అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరిని మండలికి పంపించాల్సి ఉండగా 27 మంది నామినేషన్ దాఖలు చేశారు. అందులో ముగ్గురి నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురి కాగా, 24 మంది మిగిలారు. వీరిలో 14 మంది నామినేషన్లు ఉప సంహరించుకోగా 10 మంది బరిలో నిలిచారు.
మంత్రుల ‘విఫల’ యత్నం..
మంత్రులు కేటీఆర్ హైదరాబాద్ నుంచి.. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు కరీంనగర్‌లో పోటీలో నిలిచిన వారిని మెప్పించేందుకు రంగంలోకి దిగారు. వేములవాడ నియోజకవర్గానికి చెందిన మాదాసు వేణుతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయి ఒప్పించారు. కేటీఆర్‌తో జరిగిన చర్చల్లో పోటీ నుంచి తప్పుకోవాలన్న ప్రతిపాదన ఏదీ రాలేదని, వేములవాడ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించామని మాదాసు వేణు వర్గం చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి కేటీఆర్ వారితో మాట్లాడి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కోరడంతో వేణు పోటీ నుంచి తప్పుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న మిగతా క్యాండిడేట్స్‌తోనూ చర్చలు జరిపేందుకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు అభ్యర్థులతో వ్యక్తిగతంగా చర్చించారు. దీంతో పోటీలో ఉన్న 14 మంది మాత్రమే నామినేషన్లను ఉప సంహరించుకున్నారు.
కేటీఆర్‌తో మాట్లాడుతా..
టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మంథని నియోజకవర్గానికి చెందిన బండం వసంత రెడ్డి ఇంటికి మంత్రులు గంగుల, కొప్పుల స్వయంగా వెళ్లి మాట్లాడారు. మంథనిలో నెలకొన్న పరిణామాలు, తనతో పాటు ఉద్యమ కాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారికి జరిగిన అన్యాయం గురించి వసంత రెడ్డి మంత్రులకు వివరించారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రాధాన్యత కల్పించే విషయంలో కూడా తామే స్వయంగా పరిశీలిస్తామని మంత్రులు వసంత రెడ్డికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ, తాను మంత్రి కేటీఆర్ తోనే మాట్లాడుతానని చెప్పడంతో ఫోన్‌లో మాట్లాడించారు. ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేస్తే తమ గోడు వెల్లబోసుకుంటామని, కేటీఆర్ సమయం ఇవ్వాలని వసంత రెడ్డి కోరారు. వీలైనంత త్వరలో సమావేశం అవుదామని లోటు పాట్లను సవరించుకుందామని మంత్రులు సూచించడంతో వసంత రెడ్డి పోటీ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇదే పద్దతిన మంత్రులు మిగతా వారందరితో చర్చలు జరపడంతో 14 మందిని మెప్పించి ఒప్పించగలిగారు. అయితే, పోటీలో ఉన్న మిగతావారిని కూడా ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వారి నుండి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే మేయర్ రవిందర్ సింగ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో ఆయన పోటీ చేయడం అనివార్యమని తేలిపోయింది.
అదే అసలు సమస్య..
నామినేషన్లు వేసిన రోజునే జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంపుకు తరలించడం అక్కడ కొన్ని సమస్యలు ఏర్పడటంతో జిల్లా మంత్రులు కూడా క్యాంపుపై దృష్టి సారించాల్సి వచ్చింది. మంత్రి గంగుల కమలాకర్ బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాగానే నేరుగా క్యాంపు ఏర్పాటు చేసిన లియోనియా రిసార్ట్స్‌కు చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గాల వారిగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో గురువారం రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఒప్పించేందుకు ప్రయత్నించినా సమయం కూడా సరిపోలేదని తెలుస్తోంది. దీంతో వారందరినీ కూడా పోటీ నుంచి తప్పించే అవకాశం లేకపోయిందని సమాచారం. స్క్రూటినీ తర్వాత నుంచే నామినేషన్లు వేసిన అభ్యర్థులతో మంతనాలు జరిపినట్టయితే మరింత మంది పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉండేది. అయితే, అధిష్టానం కూడా గురువారం రాత్రి వరకు పోటీలో ఉన్న వారితో మాట్లాడి ఒప్పించాలన్న సంకేతాలను పంపించకపోవడం కూడా పార్టీకి కొంతమేర నష్టాన్ని కల్గించిందని స్పష్టం అవుతోంది.
డమ్మి అభ్యర్థులుగా..
ఉమ్మడి జిల్లా నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో వీలైనంత మందిని డమ్మి అభ్యర్థులుగా మిగిలేలా చేయాలన్న యోచనలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. వారు నామినేషన్లను ఉప సంహరించుకునేందుకు చాలినంత సమయం లేనందున పోలింగ్ నాటికల్లా వారిని పోటీ నుంచి తప్పించి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకునేందుకు వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మంది పోటీలో ఉన్నట్టయితే ఓట్లు చీలిపోయి గెలుపోటములను తారు మారు చేసే ప్రమాదం ఉన్నందున పకడ్భందీగా వ్యవహరించాలని అధిష్టానం భావిస్తోంది.