క్రీడా పాలసీకి మంత్రివర్గ ఉప సంఘం
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని రూపొందించడానికి ప్రభుత్వం నలుగురు మంత్రులతో కూడిన ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి రాష్ట్ర క్రీడా వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేటీఆర్, శ్రీనివాసగౌడ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడానికి, కొత్తగా […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని రూపొందించడానికి ప్రభుత్వం నలుగురు మంత్రులతో కూడిన ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి రాష్ట్ర క్రీడా వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేటీఆర్, శ్రీనివాసగౌడ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడానికి, కొత్తగా స్టేడియంలను నిర్మించడానికి, యువతలో క్రీడాసక్తిని కల్పించడానికి, క్రీడల్లో రాణించినవారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడానికి… ఇలా అనేక అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేసి తగిన సిఫారసులను నివేదికలో పొందుపరుస్తుంది.
ఈ కమిటీ గురించి మంత్రి శ్రీనివాసగౌడ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నూతన పాలసీని రూపొందించాలనుకుంటోందని తెలిపారు. యువతను మంచి మార్గంలో పెట్టేందుకు క్రీడలు ఉపయోగపడుతాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో క్రీడారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఒలింపిక్స్ పోటీల్లో మెడల్ గెలిచిన క్రీడాకారులకు ప్రస్తుత ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ఇస్తోందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 97 నియోజకవర్గాల్లో ఇప్పటికే 34 స్టేడియాలను ప్రభుత్వం నిర్మించిందని, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, వరంగల్‌లో ఆధునిక సింథటిక్ ట్రాక్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు.
గతంలో శామీర్‌పేట్‌లో గోల్ఫ్ కోర్ట్ పేరిట 150 ఎకరాల స్థలం ఉండేదని, అది అన్యాక్రాంతమైందని, దీన్ని కబ్జాదారుల నుంచి విడిపించి పక్కనే ఉన్న మరో 45 ఎకరాలను కలిపి మొత్తంగా క్రీడాభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు. రాబోయే స్పోర్ట్స్ పాలసీలో క్రీడలతో సంభందం ఉన్న అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, హైదరాబాద్‌లో మేజర్ టోర్నీ నిర్వహించడంపై సబ్ కమిటీలో చర్చిస్తామని అన్నారు.