ITIR ప్రాజెక్టుపై బీజేపీ తప్పుడు ప్రచారం

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీఐఆర్ ప్రాజెక్టుపై లోకల్ బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణకు తీసుకు రావాలనే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుంచే తమ ప్రభుత్వానికి ఉందని, ఈ మేరకు రాష్ట్రం అవతరించిన వెంటనే 2014 జూన్ నెలలోనే ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఒక లేఖను సైతం రాశారని గుర్తు చేశారు. కనీసం 10 సార్లు కేంద్రానికి వివిధ సందర్భాల్లో లేఖల […]

Update: 2021-02-11 09:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీఐఆర్ ప్రాజెక్టుపై లోకల్ బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణకు తీసుకు రావాలనే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుంచే తమ ప్రభుత్వానికి ఉందని, ఈ మేరకు రాష్ట్రం అవతరించిన వెంటనే 2014 జూన్ నెలలోనే ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఒక లేఖను సైతం రాశారని గుర్తు చేశారు. కనీసం 10 సార్లు కేంద్రానికి వివిధ సందర్భాల్లో లేఖల ద్వారా, ప్రత్యక్షంగా కలిసి ఐటీఐఆర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ మినిస్టర్ ఫర్ స్టేట్ సంజయ్ దోత్రే ఇచ్చిన సమాధానం పట్ల మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐటీఐఆర్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, ఐతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొనడం, లోక్‌సభను తప్పుదోవ పట్టించడమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం కేంద్రం అడిగిన పూర్తి సమాచారంతో పాటు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను సైతం గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందని, ఆ తర్వాత ఐటీఐఆర్ కు సంబంధించి అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్లిన విషయాన్ని సైతం కేంద్ర మంత్రి దాచిపెట్టారన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం ఐటీఐఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం సమర్పించలేదన్న మాట చెప్పినప్పుడు, 2016లో తాను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి వెళ్ళిన ప్రతి సమాచారాన్ని అందించి వచ్చానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన డీపీఆర్‌ను సైతం అందించానని, కనీసం ఇప్పుడైనా ఐటీఐఆర్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని బండారు దత్తాత్రేయను కోరిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

అసత్యాలతో ప్రచారం..

స్థానిక బీజేపీ నాయకులతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. 2014 జూన్ నెల నుంచి 2021 జనవరి వరకు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఐటీఐఆర్ పైన సత్వర నిర్ణయం తీసుకొని హైదరాబాద్ ఐటీ పరిశ్రమకి మరింత ఊతం అందించాలని పదేపదే విజ్ఞప్తి చేశామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి పంపిన ప్రతి లేఖ, విజ్ఞప్తి ప్రజల దృష్టిలో ఉన్నదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు చేసిన కేంద్రం పూర్తిగా ఐటీఐఆర్‌ను రద్దు చేసిందన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానంలోనూ ఐటీఐఆర్ను రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉన్న విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు గుర్తించాలన్నారు. కేవలం అసత్యాలు, దుష్ప్రచారంతో ప్రజలను ఎల్లకాలం మభ్య పెట్టాలనే, బీజేపీ వైఖరిని ప్రజలు గుర్తిస్తున్నారని అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Tags:    

Similar News