హుజురాబాద్‌కు బంపర్ బొనాంజ.. మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ రూపంలో ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి రూపంలో ఎమ్మెల్సీ.. అంటూ డబుల్ ధమాకాగా అభివర్ణించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. బుధవారం మంత్రి హరీష్ సమక్షంలో సీపీఐ నేతలు కాయిత లింగారెడ్డి, అప్పాల మధు, ఏఐటీయూసీ నేత దర్ముల రామ్మూర్తిలతో పాటు పలువురు.. పత్తి మార్కెట్ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, […]

Update: 2021-09-01 07:37 GMT

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ రూపంలో ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి రూపంలో ఎమ్మెల్సీ.. అంటూ డబుల్ ధమాకాగా అభివర్ణించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. బుధవారం మంత్రి హరీష్ సమక్షంలో సీపీఐ నేతలు కాయిత లింగారెడ్డి, అప్పాల మధు, ఏఐటీయూసీ నేత దర్ముల రామ్మూర్తిలతో పాటు పలువురు.. పత్తి మార్కెట్ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే పోటీ నెలకొందని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదని కొట్టిపారేశారు. హుజురాబాద్‌లో రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ జరుగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం జలాలు, ఉచిత కరెంటు ఇస్తున్నాడని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మార్కెట్ యార్డులను రద్దు చేస్తూ, డీజిల్ ధరలను పెంచుతూ రైతులపై పెను భారం మోపుతోందని చెప్పుకొచ్చారు.

బీజేపీ సర్కార్ కార్మికులు 12 గంటలపాటు పనిచేసేలా చట్టాలను తీసుకు వస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం 8 గంటల పని విధానం, అంతకు మించి పని చేస్తే ఓవర్ టైం ఇస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రుల నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ 4 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తే, ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.

7 ఏళ్ళు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కూడా కట్టని ఈటల రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధిస్తాడని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో ఏ అభివృద్ధి జరగాలన్న టీఆర్ఎస్‌తోనే సాధ్యమని, వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా..? ప్రజల ప్రయోజనం ముఖ్యమా? అనే విషయం ఆలోచించాలని, బీజేపీ గెలిస్తే ఈటల ఒక్కడికే ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కార్మిక, రైతు వ్యతిరేక బీజేపీని ఓడించాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, అప్పటిదాకా అందరూ కష్టపడాలని సూచించారు.

Tags:    

Similar News