భూమి మీద ఎక్కడ మందులున్నా తీసుకొస్తాం

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా చికిత్సకు వాడుతున్న మందులు బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఔషధ ఉత్పత్తి పరిశ్రమల ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. అనంతరం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. “ప్రజలను బ్రతికించడానికి భూమి మీద ఎక్కడ మందులు ఉన్నా తీసుకొని రమ్మని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు మందుల కొరత లేకుండా చూస్తాం. ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదు. సీఎం ఆదేశాలను […]

Update: 2020-07-18 10:00 GMT
భూమి మీద ఎక్కడ మందులున్నా తీసుకొస్తాం
  • whatsapp icon

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా చికిత్సకు వాడుతున్న మందులు బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఔషధ ఉత్పత్తి పరిశ్రమల ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. అనంతరం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. “ప్రజలను బ్రతికించడానికి భూమి మీద ఎక్కడ మందులు ఉన్నా తీసుకొని రమ్మని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు మందుల కొరత లేకుండా చూస్తాం. ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదు. సీఎం ఆదేశాలను అమలుచేస్తాం” అని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

కరోనాను పూర్తిగా నియంత్రించే వరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రాథమిక దశలోనే వైరస్‌ను గుర్తించి వైద్యం అందించేందుకు గ్రామస్థాయిలోనే అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని తెలిపారు. జ్వరం వచ్చినవారిని సబ్ సెంటర్‌ల స్థాయిలోనే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తామని, అక్కడే వైద్యపరీక్షలు, కరోనా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అయిన తర్వాత హోమ్ ఐసొలేషన్ లేదా ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపారు.

ఎట్టిపరిస్థితుల్లో కరోనా చికిత్సకు అవసరమైన మందులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులతో పాటు రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ విభాగం అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గ్రామస్థాయి నుంచి ప్రతి మందులషాపులో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రికి విధిగా కరోనా మందులను సరఫరా చేయాలని ఆదేశించారు. ఎక్కువ ఖరీదు ఉన్న మందులు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం కరోనా చికిత్సలో వివిధ రకాల అనారోగ్య లక్షణాలకు అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, అమాక్సిసిలిన్, సిఫెక్సిమ్, సెఫటాక్సిమ్, సెట్రిజిన్, పారాసిటమాల్, డెక్సామిథసోన్, మిథైల్ ప్రిడ్నిసొలోన్, మల్టీ విటమిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, బెనడ్రిల్, డెక్సా మిథసోన్ లాంటి మందులు వాడుతున్నారని, వాటన్నింటినీ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా మందుల షాపుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

రెమ్‌డెసివిర్‌ లభ్యతపై సీఎం దృష్టి

వైరస్ లోడ్‌ను తగ్గించడానికి వినియోగిస్తున్న రేమ్‌డెసివిర్ మందును తయారుచేస్తున్న హెటిరో డ్రగ్ కంపెనీ యాజమాన్యంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మాట్లాడారని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మందులను సరఫరా చేయాల్సిందిగా సూచించారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలోనే ఆ మందు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు.

సిబ్బంది నియామక బాధ్యతలు సూపరింటెండెంట్లదే

ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వ టెరిటరీ కేర్ ఆసుపత్రులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని పేర్కన్న మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్‌లో ఉన్న అన్ని ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల వారీగా ఉన్న సమస్యలు తెలుసుకొని తగిన పరిష్కారమార్గాలు సూచించారు. ఆయా ఆసుపత్రులకు అవసరమైన సిబ్బందిని నియమించుకునే అధికారాన్ని సూపరింటెండెంట్లకే అప్పగించారు. సిబ్బంది, పరికరాలు అడిగిన 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వైద్య సిబ్బంది అంతా సమిష్టి కృషితో పనిచేసి ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రికి వచ్చిన ఏ ఒక్క పేషంట్‌నూ కూడా వెనక్కి పంపించకూడదని, ప్రాథమిక చికిత్స అందించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన ఆసుపత్రికి పంపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రులు చుట్టూ పేషెంట్లు తిరుగుతున్నారంటూ వస్తున్న వార్తలు ఇకపైన రాకూడదన్నారు.

Tags:    

Similar News