పట్టాదారుల అరిగోస.. కొత్త పాస్ పుస్తకం ఉందని మురిసిపోకండి
దిశ, తెలంగాణ బ్యూరో : చేతిలో కొత్త పాసు పుస్తకం ఉందని మురిసిపోకండి. ఓసారి ధరణి పోర్టల్లో చెక్చేయించుకోండి. మీకు వారసత్వంగా సంక్రమించినదైనా సరే. ప్రభుత్వ భూమి, భూదాన్భూమి, వక్ఫ్, దేవాలయ భూమి అంటూ నమోదు చేసి ఉండొచ్చు. గతేడాది వరకు సరిగ్గా ఉన్నా సరే.. అకస్మాత్తుగా రికార్డులు మారిపోతున్నాయి. అయ్యో.. ఏడాది కిందనే కొన్నాం అంటున్నారా? అయినా సరే.. రికార్డులు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే..లక్షల ఎకరాల పట్టా భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టారు. ఫలితంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : చేతిలో కొత్త పాసు పుస్తకం ఉందని మురిసిపోకండి. ఓసారి ధరణి పోర్టల్లో చెక్చేయించుకోండి. మీకు వారసత్వంగా సంక్రమించినదైనా సరే. ప్రభుత్వ భూమి, భూదాన్భూమి, వక్ఫ్, దేవాలయ భూమి అంటూ నమోదు చేసి ఉండొచ్చు. గతేడాది వరకు సరిగ్గా ఉన్నా సరే.. అకస్మాత్తుగా రికార్డులు మారిపోతున్నాయి. అయ్యో.. ఏడాది కిందనే కొన్నాం అంటున్నారా? అయినా సరే.. రికార్డులు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే..లక్షల ఎకరాల పట్టా భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టారు. ఫలితంగా ఎంతోమంది రైతులు అధికారుల చుట్టూ తిరగలేక గోస పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీఓబీ జాబితాలు సవరించాలంటూ దరఖాస్తు చేసుకున్న రైతుల బాధలు వర్ణనాతీతం.
18 గుంటలు ఎక్కడ?
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్ రెవెన్యూ పరిధిలో ఉన్న శ్రీ సీతారామచంద్ర ఆలయానికి నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలో పొలాలు ఉన్నాయి. కానీ అధికారులు ఈ భూములను నిషేధిత జాబితాలో పొందుపర్చకుండా ఏదులాబాద్ లోని సర్వే నం.153 లోని భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ ఆలయానికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌మండలం మక్తఅనంతారం సర్వే నం.153లో 18 గుంటలు, బీబీనగర్సర్వే నం.180లో 1.26 ఎకరాలు ఉన్నట్లుగా దేవాదాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. 18 గుంటలు కాకుండా సర్వే నం.153లోని మొత్తం భూమిని పీఓబీలో చేర్చారు. దాంతో ఆ సర్వే నంబరులోని రైతులు 13 ఏండ్లుగా సమస్య ఎదుర్కొంటున్నారు.
దేవాదాయశాఖ భూమిగా మార్పు..
తమ పట్టా భూమిని పొరపాటుగా దేవాదాయ శాఖ భూమిగా నమోదు చేశారంటూ మేడిపల్లి మండలం బోడుప్పల్‌కు చెందిన చింతకుంట్ల ఆండాలు పలుమార్లు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. రిట్పిటిషన్నం.16367/2018 లో సదరు భూములు పట్టా అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే పీఓబీ జాబితా నుంచి తొలగించాలని సూచించింది. ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ తప్పు చేసినట్లుగా గుర్తు చేశారు. కానీ స్థానిక సబ్‌రిజిస్ట్రార్, తహాసీల్దార్, ఆర్డీఓలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అవి పట్టా భూములని హైకోర్టు స్పష్టం చేసినా దేవాదాయ శాఖ నుంచి ఎన్వోసీ తేవాల్సిందేనంటున్నారు.
దానం తెచ్చిన తంటా..
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం తక్కశిలలో కే మనోహర్ రెడ్డి కుటుంబానికి సర్వే నం.355/అ2/1లో 6.08 ఎకరాలు, సర్వే నం.355/అ లో 2.39 ఎకరాల వంతున ఉన్నది. ఇదంతా భూదాన్ భూమి అంటూ రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో నమోదు చేశారు. వాస్తవానికి ఈ సర్వే నంబర్లలోని ఒక ఎకరం మాత్రం పూర్వీకులు భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేశారు. మొత్తం భూమి భూదాన్అంటూ ధరణి రికార్డుల్లో నమోదు కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. సరి చేయాలంటూ ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే.. భూదాన్యజ్ఞ బోర్డు నుంచి ఎన్వోసీ తీసుకురావాలని చెబుతున్నారు. ఇప్పుడా కార్యాలయం, సంబంధిత అధికారులు ఎవరో రాష్ట్ర ప్రజలకు కాదు.. అధికారులకే తెలియదు. తప్పు చేసింది రెవెన్యూ అధికారులైతే రైతులను ముప్పుతిప్పలు పెడుతుండటం గమనార్హం.
వక్ఫ్భూములా..
హైదరాబాద్ కు చెందిన కొందరు ఉద్యోగులు, వ్యాపారులు కలిసి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో పట్టా భూములను కొనుగోలు చేశారు. దేవరకొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మ్యుటేషన్ చేయించుకోగా వీళ్లకూ పాసు పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఆ భూములను అమ్మేందుకు పెట్టగా.. కొనేందుకు ముందుకొచ్చిన వారు ధరణి పోర్టల్లో చెక్చేస్తే అవి వక్ఫ్‌బోర్డు భూములుగా తేలింది. ధరణి పోర్టల్ లో పొరపాటుగా వక్ఫ్‌గా నమోదు చేశారని దరఖాస్తు చేసుకుంటే.. అలా అని వక్ఫ్‌బోర్డు నుంచి ఎన్వోసీ తీసుకురావాలని అధికారులు అంటున్నారు. ఈ ఊరిలో పుట్టి పెరిగి 90 ఏండ్ల వయసున్న వారిని అడిగినా తమ దగ్గర వక్ఫ్‌భూములు లేవని చెబుతుండటం గమనార్హం. ఇలా ఆ మండలంలోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాలను వక్ఫ్‌భూమిగా నమోదు చేసి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
క్లియర్ చెయ్యడమంటే రిజెక్ట్ చెయ్యడమేనా?
ధరణి పోర్టల్ మాడ్యూల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను రెండు రోజుల్లో పరిష్కరించాలని సీఎస్ కలెక్టర్లను అదేశించారు. జిల్లా కలెక్టర్లు ఆదరాబాదరగా అర్జీదారులకు సరైన కారణం చెప్పకుండానే వారి దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్నారు. కొంతమంది రైతులు తమ భూములు పట్టా భూములని ఇంతకుముందే న్యాయస్థానం తీర్పు చెప్పిందని ఆ తీర్పుల ప్రతులను జిల్లా కలెక్టర్లకు సమర్పించినా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన అన్నదాతలు జిల్లా కలెక్టర్లు పరిష్కారం పేరుతో తమ దరఖాస్తులను రిజెక్ట్ చేస్తుండడంతో విస్మయానికి గురవుతున్నారు.
మన్నె నర్సింహారెడ్డి, కన్వీనర్, ధరణి భూ సమస్యల వేదిక