మిల్లర్ల మాయాజాలం.. కొలతల్లో కోతలు.. నష్టాల్లో రైతులు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలల్లో మిల్లరు విచ్చలవడిగా అక్రమాలు చేస్తున్నారు. బస్తాకు మూడు కిలోల చొప్పున కోత విధిస్తూ యథేచ్చగా దందా కొనసాగిస్తు్న్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్ల(కె), సోన్ మండలంలోని బొప్పారం, పాక్పట్ల, కడ్తాల్, సాకెర, సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకు 3 కిలోలు, సోన్‌లో క్వింటాకు 4 కిలోలు కోత విధిస్తున్నారు. సోన్ మండలం […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలల్లో మిల్లరు విచ్చలవడిగా అక్రమాలు చేస్తున్నారు. బస్తాకు మూడు కిలోల చొప్పున కోత విధిస్తూ యథేచ్చగా దందా కొనసాగిస్తు్న్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్ల(కె), సోన్ మండలంలోని బొప్పారం, పాక్పట్ల, కడ్తాల్, సాకెర, సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకు 3 కిలోలు, సోన్‌లో క్వింటాకు 4 కిలోలు కోత విధిస్తున్నారు. సోన్ మండలం జాప్రాపూర్‌లో 42.200కిలోల చొప్పున బస్తాలు జోకుతున్నారు. కొన్ని చోట్ల మళ్ళీ రైస్ మిల్లుకు తీసుకెళ్లాక కూడా క్వింటాలుకు.. 2-3కిలోల చొప్పున కోత పెడుతున్నారు. ఈ లెక్కన 40 కిలోల బస్తాకు 4 కిలోల చొప్పున.. దగ్గరదగ్గర క్వింటాకు 10 కిలోలు కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల 40.500 కిలోల చొప్పున జోకి.. 38 కిలోల కాడికి డబ్బులు జమ చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇవి మచ్చుకు ఉదాహరణ మాత్రమే..
యాసంగిలో వరి సాగు చేసిన రైతులను రైస్ మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో రైతులు భారీగా వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట విక్రయిస్తుండగా.. రైతులను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి నిరీక్షిస్తుండగా.. అకాల వర్షాలు, వడగండ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లకు వారాలు పడితే.. లోడింగు కోసం నిరీక్షణ తప్పటం లేదు.. తాలు, తేమ ఉందనే కుంటిసాకులు చెప్పి రైసుమిల్లర్లు విడతల వారీగా కోతలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే 40 కిలోల బస్తాకు 2-3కిలోల వరకు అధికంగా జోకుతుండగా.. మళ్లీ రైసు మిల్లుకు వెళ్లాక 2-3కిలోలు కోస్తున్నారు. దీంతో క్వింటాలుకు 10 కిలోల చొప్పున రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా.. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, నాయకులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగిలో 2,10,215 ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 4,57,537మె.ట. దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 447కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రైతుల నుంచి 2లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ధాన్యం రైతులకు రూ.100 కోట్లకుపైగా డబ్బులు చెల్లించారు. ఇప్పటి వరకు దిగుబడి అంచనాలో 50 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మరో 10 రోజుల్లో (మే 31లోపు) ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాల్సి ఉండగా.. లక్ష్యం చేరటం కష్టంగానే ఉంది. మరోవైపు వడగండ్ల వానలు, అకాల వర్షాలు కురుస్తుండటంతో.. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిచిపోతోంది. రైతులు దీనిని మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం 18శాతం లోపు తేమ ఉండాలనే నిబంధన పెట్టారు. ధాన్యంలో మట్టిపెళ్లలు అసలే కనిపించొద్దని.. జాలి పట్టి తీసుకురావాలని రైతులకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నరు. ఇప్పటికే రైతులు వారాల తరబడి ధాన్యం కొనుగోళ్ల కోసం వేచి చూడాల్సి వస్తోంది.
తాజాగా అకాల వర్షాలు, వడగండ్లు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రైతుల అవసరం, పరిస్థితిని రైస్ మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రైసుమిల్లర్లు వివిధ రకాల సాకులు చెప్పి.. అన్నదాతను నిలువుదోపిడీ చేస్తున్నారు. క్వింటాలు వడ్లను మిల్లింగ్ చేస్తే.. 67-68 కిలోల బియ్యం రావాలి. తాలు ఎక్కువగా ఉండటంతో.. 62-65 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయనే సాకుతో.. రైతులను నిలువునా దోచుకుంటున్నారు. తాలు, తేమ శాతం ఎక్కువగా ఉందని ధాన్యం తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. 40కిలోల బస్తాకు 2-3కిలోల చొప్పున కోత పెడుతున్నారు. దీంతో కొన్ని చోట్ల 42కిలోలు, 42.500కిలోల బస్తాను తూకం వేయాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల 38కిలోల చొప్పున డబ్బులు వేస్తున్నారు. మరోవైపు రైసు మిల్లుకు వెళ్లాక బస్తాకు 2-3కిలోల చొప్పున కోత పెడుతున్నారు. లేదంటే ధాన్యం వెనక్కి పంపిస్తామంటూ.. అన్ లోడింగ్ చేసుకోవటం లేదు. దీంతో గత్యంతరం లేక రైతులు మిల్లర్లు చెప్పినట్లు ఇవ్వాల్సి వస్తోంది.