ఇంటికి పంపించండని ముంబయిలో కార్మికుల భారీ నిరసన
ముంబయి : వాళ్లంతా పొట్ట చేత పట్టుకుని ఉత్తరాది నుంచి దేశ వాణిజ్య నగరానికి వచ్చిన కూలీలు. ఫ్యాక్టరీలల్లో, కన్‌స్ట్రక్షన్ సైట్‌లలో దినసరి కూలీలుగా పనిచేసుకుని అంతో ఇంతో డబ్బును ఇంటికి పంపుతున్నారు. కానీ, కరోనా మహమ్మారి కట్టడి కోసం గతనెల లాక్‌డౌన్ విధించడంతో 21 రోజులుగా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోకి వారు జారిపోయారు. ఇళ్లు విడిచి రాష్ట్రాలు దాటి వచ్చినందుకు.. పని లేదు.. ప్రభుత్వం ఆహారమందిస్తామని హామీనిచ్చినా రోజు రెండు పూటల భోజనం దొరకడం […]
ముంబయి : వాళ్లంతా పొట్ట చేత పట్టుకుని ఉత్తరాది నుంచి దేశ వాణిజ్య నగరానికి వచ్చిన కూలీలు. ఫ్యాక్టరీలల్లో, కన్‌స్ట్రక్షన్ సైట్‌లలో దినసరి కూలీలుగా పనిచేసుకుని అంతో ఇంతో డబ్బును ఇంటికి పంపుతున్నారు. కానీ, కరోనా మహమ్మారి కట్టడి కోసం గతనెల లాక్‌డౌన్ విధించడంతో 21 రోజులుగా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోకి వారు జారిపోయారు. ఇళ్లు విడిచి రాష్ట్రాలు దాటి వచ్చినందుకు.. పని లేదు.. ప్రభుత్వం ఆహారమందిస్తామని హామీనిచ్చినా రోజు రెండు పూటల భోజనం దొరకడం లేదు. కుటుంబానికి దూరం.. పంట చేతికచ్చిన తరుణం.. కానీ, సొంతూరు చేరే దారి కనిపించడం లేదు వారికి. ఏదైతేనేం.. మంగళవారం లాక్‌డౌన్ ఎత్తేస్తే తిరిగి తమ ఊళ్లల్లకు వెళ్లిపోవచ్చని ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు ఎదురుచూశారు. కానీ, వలస కార్మికులను వారి స్వస్థలానికి చేర్చాలన్న నిబంధనలేమీ ప్రకటించకుండానే.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వరకు పొడిగించింది. దీంతో ఎదురుచూపులు చూసిన కళ్లు అగ్నికణికలయ్యాయి. దిగమింగుకున్న ఆకలి ఆక్రోషంగా మారింది. ఫలితంగా మహారాష్ట్రలోని బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర వలస కార్మికులు సుమారు వేయికిపైనే గుమిగూడి నిరసన చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు. తమను సొంతూరుకు పంపివ్వాలని వేడుకున్నారు. లాక్‌డౌన్ ఉల్లంఘించి సామాజిక దూరాన్ని పాటించట్లేదన్న కోపంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. వారందరిని చెదరగొట్టేశారు.
ఇంటికి వెళదామన్న ఆశతో బాంద్రా రైల్వే స్టేషన్ సమీపానికి చేరినవారు.. ఆ ఏరియాలోని ఇతర కార్మికులు.. ఫుడ్ డెలివరీ వ్యాన్ దగ్గర గుమిగూడటం.. అటుర్వాత ఈ నిరసనకు దిగడం వెనువెంటనే జరిగిపోయాయి. మేం ఇంటికి వెళ్లాలనుకుంటున్నాం.. అందుకు అనుతించండన్న మాటలే వారి నిరసనలో ప్రధానంగా వినిపించాయి. దేశానికి కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ముంబయిలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు ఆగ్రహించారు. అయితే, ఈ పరిణామానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని శివసేన నేత ఆదిత్యా ఠాక్రే విమర్శించారు. వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన కేంద్రం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. అయితే, శివసేన ప్రభుత్వం.. ఆహారం, నివాసం కల్పిస్తామన్న హామీనిచ్చి కార్మికులను అక్కడి నుంచి వారిని పంపించేసింది.