బర్తరఫ్ సరే.. భర్తీ మరె!

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు పడింది. జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలకు కనీసం 40 రోజులు పని కల్పించనివారిని రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. మరికొందరిని డీమోట్ చేసింది. ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. అదనపు బాధ్యతలు నెత్తిపై పడటంతో కార్యదర్శులు లబోదిబోమంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) ప్రకారం జాబ్‌‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి, వ్యక్తులకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించడం ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత. […]

Update: 2020-02-20 01:31 GMT
బర్తరఫ్ సరే.. భర్తీ మరె!
  • whatsapp icon

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు పడింది. జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలకు కనీసం 40 రోజులు పని కల్పించనివారిని రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. మరికొందరిని డీమోట్ చేసింది. ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. అదనపు బాధ్యతలు నెత్తిపై పడటంతో కార్యదర్శులు లబోదిబోమంటున్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) ప్రకారం జాబ్‌‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి, వ్యక్తులకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించడం ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత. కానీ, కొంతమంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కూలీలకు ఉపాధి కల్పించడంలో విఫలమవుతున్నారు. 50 రోజుల పనిదినాలు కూడా కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కనీసం 40 రోజులు కూడా పని కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించింది. మరికొందరిని సీనియర్ మేట్లుగా డిమోట్ చేసింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదు. పాత గ్రామ పంచాయతీలకున్న 369 మంది ఫీల్డ్ అసిస్టెంట్లే మిగిలిన గ్రామాల అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 205 మందిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 111 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించింది. మరో 94 మందిని సీనియర్ మేట్లుగా డిమోట్ చేసింది. ప్రస్తుతం 164 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే విధుల్లో కొనసాగుతున్నారు. జిల్లాలో మరో 43 గ్రామ పంచాయతీలకు తొలి నుంచీ ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. తొలగించినవారి స్థానంలో కొత్త వారిని నియమించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో 248 గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకే అప్పగించారు. ఇక మీదట పంచాయతీ పాలనతోపాటు అదనంగా ఉపాధి హామీ బాధ్యతలను కూడా వారే చూడాల్సి ఉంటుంది.

కార్యదర్శులకు భారం

గ్రామపంచాయతీ పాలనాభారం మొత్తం కార్యదర్శులపైనే ఉంటుంది. ఇందుకోసం 30కిపైగా రిజిస్టర్లను నిర్వహించాలి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై మార్కుల విధానం ప్రవేశపెట్టింది. ప్రతినెలా వీటిని వెల్లడిస్తుంటుంది. ఇందుకోసం తాము చేసిన పని వివరాలను నిత్యం ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. హరితహారం బాధ్యతా కార్యదర్శులపైనే ఉంది. ఇందులో విఫలమైతే విధుల నుంచి తొలగిస్తామని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చారు కూడా. ఇటీవల పల్లె ప్రగతి పేరిట ఓ కార్యక్రమం తీసుకువచ్చారు. ఇందులో భాగంగా గ్రామాల పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్లాస్టిక్​ నిర్మూలన తదితర బాధ్యతలు కార్యదర్శలకే ఉన్నాయి. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతనూ కార్యదర్శులకే అప్పగించారు. జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలకు 100 రోజులు పని కల్పించడంతోపాటు వారికి వేతనాలు అందేలా చూడటం, ఎక్కడ పని చేపట్టాలో తదితర విధులను చూడాల్సి వస్తుంది. ఇది తమకు తలకు మించిన భారమవుతోందని కార్యదర్శులు లబోదిబోమంటున్నారు.

2019 ఉపాధి హామీ వివరాలు
21 మండలాల్లో 560 గ్రామాల్లో పనుల కల్పన
ఆమోదించిన పని రోజులు: 46.34లక్షలు
కల్పించిన పని రోజులు: 34.09 లక్షలు
చేసిన ఖర్చు: రూ.69.‌‌02 కోట్లు
పని కల్పించిన కుటుంబాలు: 68,597
100 రోజుల పని పూర్తిచేసిన కుటుంబాలు: 4,885
సరాసరి రోజు కూలీ: రూ.166.78

Tags:    

Similar News