బెంగాల్‌ని గెలుస్తా.. ఢిల్లీకొస్తా..
కోల్‌కతా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను కూడగడతానంటున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మేరకు బలమైన సంకేతాలను ఇస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ముగిసిన వెంటనే ఆమె అడుగులు ఢిల్లీ వైపునకు పడనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో సోమవారం ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను గెలుస్తానని, ఢిల్లీకి కూడా వచ్చి హస్తిన పీఠాన్ని కైవసం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. హుగ్లీలోని చుంచుర అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో […]
కోల్‌కతా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను కూడగడతానంటున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మేరకు బలమైన సంకేతాలను ఇస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ముగిసిన వెంటనే ఆమె అడుగులు ఢిల్లీ వైపునకు పడనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో సోమవారం ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను గెలుస్తానని, ఢిల్లీకి కూడా వచ్చి హస్తిన పీఠాన్ని కైవసం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. హుగ్లీలోని చుంచుర అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘ఒంటికాలితో బెంగాల్‌ను.. రెండు కాళ్లతో ఢిల్లీనీ గెలుస్తాను’ అని అన్నారు. తనను ఎన్నికల ప్రచారం చేయనీయకుండా బీజేపీ కుట్ర పన్నిందని, అయినా తాను మాత్రం ఎవరికీ వెరవకుండా పోరాడుతున్నానని తెలిపారు. నందిగ్రామ్‌లో ఎన్ని్కల ప్రచారం సందర్భంగా జరిగిన దాడి ఘటనలో ఆమె కాలికి గాయం కాగా.. వీల్ చైర్ నుంచే ప్రచారాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా, దీదీ తనను తాను రాయల్ బెంగాల్ టైగర్‌గా అభివర్ణించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది భద్రతా దళాల మృతిపై స్పందిస్తూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలి బెంగాల్ ఎన్నికల మీదే దృష్టి సారించిందని విమర్శించారు. ప్రధాని మోడీ తనను ‘దీదీ.. ఓ దీదీ’ అని సంబోధించిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను ఆయన వ్యాఖ్యలను పట్టించుకోనని స్పష్టం చేశారు.