మక్కల కొనుగోలు మాయాజాలం
దిశ, తెలంగాణ బ్యూరో: కలిసి రాని కాలం.. కొనుగోలు లేని దైన్యం.. పెట్టుబడి అప్పులు ఆపుకోలేని దీనం.. దిగుబడిని దాచుకోలేని దౌర్భాగ్యం.. వెరసి మక్కరైతు ఆగమయ్యాడు.. మక్కలు కొనేది లేదని తెగేసి చెప్పిన సర్కార్ చివరి నిమిషపు నిర్ణయ మార్పుతో తీవ్రంగా నష్టపోయారు. అప్పటికే వర్ష భయంతో వచ్చిన పంటను వచ్చినట్టు ప్రైవేట్ వ్యాపారులకు అడిగిన రేట్కు రైతులు అమ్ముకోవడంతో జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరుగాలం శ్రమించి అప్పనంగా వ్యాపారులకు అప్పగించి మొండిచేతులతో మిగిలామని మక్కరైతులు ఆవేదన […]
దిశ, తెలంగాణ బ్యూరో: కలిసి రాని కాలం.. కొనుగోలు లేని దైన్యం.. పెట్టుబడి అప్పులు ఆపుకోలేని దీనం.. దిగుబడిని దాచుకోలేని దౌర్భాగ్యం.. వెరసి మక్కరైతు ఆగమయ్యాడు.. మక్కలు కొనేది లేదని తెగేసి చెప్పిన సర్కార్ చివరి నిమిషపు నిర్ణయ మార్పుతో తీవ్రంగా నష్టపోయారు. అప్పటికే వర్ష భయంతో వచ్చిన పంటను వచ్చినట్టు ప్రైవేట్ వ్యాపారులకు అడిగిన రేట్కు రైతులు అమ్ముకోవడంతో జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరుగాలం శ్రమించి అప్పనంగా వ్యాపారులకు అప్పగించి మొండిచేతులతో మిగిలామని మక్కరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే నిండా ముంచిందని మొక్కరైతులు వాపోతున్నారు. అదే సమయంలో సర్కార్ నిర్ణయం ప్రైవేట్ వ్యాపారులకు బాగా కలిసొచ్చింది.
రాష్ట్రంలో మొత్తం 2.25 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రధానంగా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సాగునీటి వసతి సరిగ్గా లేనిచోట మాత్రమే మక్కలు పండించారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో పసుపులో అంతర పంటగా సాగు చేశారు. పూర్తిస్థాయిలో సాగుచేసిన చోట ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున, అంతరపంటగా వేసిన చోట 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.
రూ. 800కు క్వింటా చొప్పున కొనుగోళ్లు..
ప్రభుత్వం మక్కల కొనుగోళ్లపై చివరి వరకూ స్పందించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు దందా మొదలుపెట్టారు. ప్రభుత్వం మక్కలు కొనదంటూ గ్రామాలపై వాలారు. ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేశారు. రైతులకు కూడా భయం పట్టుకోవడంతో క్వింటాలుకు రూ. 800 నుంచి రూ.1100 వరకు అమ్ముకున్నారు. ప్రభుత్వం తరఫున మక్కలు కొనేదిలేదని సీఎం కేసీఆర్ ప్రకటించడం దళారులకు కలిసివచ్చింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటల లిస్టులో మొక్కజొన్న కూడా ఉంది. క్వింటాలుకు రూ.1,850 గా నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోనూ పంట చేతికి వస్తున్నా రాష్ట్ర సర్కారు మాత్రం మొండిగా వెళ్లింది. గతంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేసినా ఈసారి ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా దళారులు రెచ్చిపోయారు. గ్రామాల్లో తిరుగుతూ ఈసారి ప్రభుత్వం మక్కలు కొనబోదని, తమకు అమ్మడం తప్ప వేరే మార్గం లేదని రైతులను బెదిరింపులకు గురిచేశారు. సిడికేట్గా మారిన వ్యాపారులు క్వింటాలుకు రూ. 800 నుంచి రూ.1,200 వరకు కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళనకు దిగి వచ్చిన ప్రభుత్వం ఆఖరికి మక్కలను మద్దతు ధర రూ. 1850తో కొనుగోలు చేస్తామని ప్రకటించింది.
ఇప్పుడే మాయాజాలం..
రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను ఇప్పుడు వ్యాపారులు మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. ప్రతిసారి వ్యాపారుల వంతపాడే మార్క్ ఫెడ్ ఈసారి కూడా వారికే అండగా ఉంటోంది. వ్యాపారులు రైతుల పేరిట టోకెన్లు తీసుకుని మార్క్ ఫెడ్‌కు అమ్ముతున్నారు. దీంతో రైతులకు దక్కాల్సిన మద్దతు ధర వ్యాపారులకు దక్కుతోంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో మక్కల వ్యాపారులకు భారీగా కలిసి వస్తోంది. దీనిపై వ్యాపారులను అడిగినా సమాధానం ఇవ్వడం లేదు. అంతేకాకుండా గ్రామాల్లో ముందుగా కొనుగోలు చేసిన రైతులనే మళ్లీ బెదిరిస్తూ వారి పేరు మీదనే టోకెన్లు తీసుకుంటున్నారు. ఇదంతా మార్క్ ఫెడ్ అధికారులకు తెలిసినా వ్యాపారులకే సహకరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మొత్తం వ్యాపారులే కనిపిస్తున్నా తేలిగ్గా తీసుకుంటున్నారు.