నీటి అడుగున.. 3 నిమిషాల్లో 20 మ్యాజిక్ ట్రిక్స్
దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని ప్రపంచ రికార్డులను చూస్తే.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. కానీ ఆ రికార్డ్ క్రియేట్ చేయాలంటే.. ఎంతటి నైపుణ్యం కావాలో, ఎన్ని రోజుల తరబడి ప్రాక్టీస్ చేస్తే ఆ రికార్డ్ సొంతమవుతుందో చాలామందికి తెలియదు. ఇక మరికొన్ని వరల్డ్ రికార్డ్స్ చూస్తే మాత్రం.. అలా చేయడం నిజంగా సాధ్యమేనా? అని ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఇంగ్లాండ్‌కు చెందిన మెజీషియన్ మార్టిన్ రీస్ మాత్రం కష్టతరమైన […]
దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని ప్రపంచ రికార్డులను చూస్తే.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. కానీ ఆ రికార్డ్ క్రియేట్ చేయాలంటే.. ఎంతటి నైపుణ్యం కావాలో, ఎన్ని రోజుల తరబడి ప్రాక్టీస్ చేస్తే ఆ రికార్డ్ సొంతమవుతుందో చాలామందికి తెలియదు. ఇక మరికొన్ని వరల్డ్ రికార్డ్స్ చూస్తే మాత్రం.. అలా చేయడం నిజంగా సాధ్యమేనా? అని ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఇంగ్లాండ్‌కు చెందిన మెజీషియన్ మార్టిన్ రీస్ మాత్రం కష్టతరమైన రికార్డులను అలవోకగా చేసి ఔరా అనిపిస్తాడు. ఇంతకీ మార్టిన్ ఏం చేశాడంటే?
ఇంగ్లాండ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన మార్టిన్ రీస్ మ్యాజిక్ చేయడంలో నేర్పరి. అయితే అందులోనూ తనదైన స్పెషాలిటీ ఉండాలనుకున్న మార్టిన్.. జస్ట్ 3 నిమిషాల్లో 20 రకాల మ్యాజిక్ ట్రిక్స్ చేసి ఔరా అనిపించాడు. ఇది కూడా అందరూ చేస్తారని అనుకోవచ్చు గానీ, అతను చేసింది గాలిలో కాదు నీటి అడుగున. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అసలు నీటిలో మ్యాజిక్ చేయడం అంటే ఈజీ కాదు, చేతులను చకచకా కదపలేం, బాడీ మూవ్‌మెంట్ కూడా అంత స్పీడ్‌గా ఉండదు. ఏ చిన్న తేడా వచ్చినా ట్రిక్స్ ప్రదర్శించలేకపోవచ్చు. చిన్నతనంలో నీళ్లంటే భయపడ్డ మార్టిన్.. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి నీటిలోనే పలు రకాల మ్యాజిక్ ట్రిక్స్ సాధన చేస్తూ వచ్చి, ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
అతడి ప్రతి రికార్డు వెనక ఓ మంచి ప్రయత్నంతో పాటు మానవతా హృదయం కూడా దాగుంటుంది. అనారోగ్యంతో బాధపడే చిన్నారుల మోముల్లో నవ్వులు చూడాలనుకునే మార్టిన్.. కరోనాకు ముందు వివిధ హాస్పిటల్స్‌కు వెళ్లి రకరకాల మ్యాజిక్ ట్రిక్స్ చేసి పిల్లలను నవ్వించేవాడు. కరోనా వచ్చినప్పటి నుంచి వారికి వర్చువల్ విధానంలో ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నాడు. ఇక తాజాగా తను నెలకొల్పిన రికార్డును అనారోగ్య బాధిత చిన్నారులకు, వాళ్ల తల్లిదండ్రులకూ అంకితం చేశాడు. మార్టిన్‌కు ఇది ఐదో వరల్డ్ రికార్డ్ టైటిల్. మొదట.. ఒక్క నిమిషంలో 18 కార్డులను గుర్తించి రికార్డు సాధించాడు. ఆ తర్వాత ఒకే స్కైడైవ్‌లో 11 మ్యాజిక్ ట్రిక్స్ చేసి ఔరా అనిపించాడు. ఇక ముచ్చటగా మూడోసారి కళ్లు మూసుకొని 24 మ్యాజిక్ ట్రిక్స్‌ను నిమిషంలో పూర్తి చేశాడు. విండ్ టన్నెల్‌లో 3 నిమిషాల్లో 8 మ్యాజిక్ ట్రిక్స్ ప్లే చేసి మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.