పోరుకు సై అంటున్న.. మధ్యాహ్న భోజన కార్మికులు

దిశ, పరకాల: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు పోరు బాట పట్టనున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి సమీకరణలకు సీఐటీయూ శ్రీకారం చుడుతోంది. ఈనెల 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు, జనవరి 10, 11 తేదీలలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ తో కలిసి 48గంటల భారీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంగళవారం దిశ పత్రిక మధ్యాహ్న భోజన […]

Update: 2021-12-22 04:46 GMT

దిశ, పరకాల: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు పోరు బాట పట్టనున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి సమీకరణలకు సీఐటీయూ శ్రీకారం చుడుతోంది. ఈనెల 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు, జనవరి 10, 11 తేదీలలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ తో కలిసి 48గంటల భారీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంగళవారం దిశ పత్రిక మధ్యాహ్న భోజన కార్మికులను కదిలించగా. ప్రస్తుత సీజన్లో వంట నూనె, కూరగాయలు, పోపు దినుసులు, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరగడం మూలంగా నిర్వహణ భారంగా మారిందన్నారు.

ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు నాలుగు రూపాయల తొంభై పైసలు, ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు 7 రూపాయల 45 పైసలు మాత్రమే చెల్లిస్తుందని ఈ రూపాయల నుండి బియ్యం మినహా ప్రతిదీ మధ్యాహ్న భోజన కార్మికులే కొనుగోలు చేసి వంట చేయాల్సి వస్తుందన్నారు. ఇందులో వారానికి మూడు రోజులు కోడిగుడ్డు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్డు ధర ఆరు నుంచి ఏడు రూపాయలు ఉంది. ప్రభుత్వం చెల్లించే సొమ్ము కోడిగుడ్డుకే సరి పోతుండంతో ఉప్పులు, పప్పులు, కూరగాయలు, మాలు మసాలాలు, వంట గ్యాస్, సమకూర్చేది ఎట్లా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

మధ్యాహ్న భోజన పథకం మూలంగా అప్పులు ఆత్మహత్యలు మినహా ఒరిగేది ఏమీ లేదంటూ నిరాశ వ్యక్తపరిచారు. తాళిబొట్లు సైతం కుదువ పెట్టుకొని పిల్లల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. జైల్లో ఉండే నేరస్థుడికి సైతం పూట తిండి కోసం ప్రభుత్వం 30 రూపాయలు చెల్లిస్తుందని, అలాంటిది భావిభారత నిర్మాతలైన పిల్లల ఆకలి తీర్చడానికి కేవలం నాలుగు నుంచి ఏడు రూపాయలు కేటాయించడం ఎంతవరకు సబబో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు.

ముందుగా పెట్టుబడి పెట్టి నెలల తరబడి బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి తమదంటూ ఆవేదన వ్యక్తపరిచారు. కరోనా కష్టకాలంలో సైతం ఈ ప్రభుత్వం మాపై వివక్ష చూపిందన్నారు. ప్రైవేట్ స్కూలు ఉపాధ్యాయులకు 25 కిలోల బియ్యం రెండు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులను విస్మరించడం అన్యాయమన్నారు.

ఓ ఆర్థిక విశ్లేషకుడి అంచనా ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే నెలకి కనీసం 21 వేల రూపాయలు అవసరం ఉంటుంది. మరి ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు కేవలం తొమ్మిది వందల రూపాయలు చెల్లించడం ఏ కనీస వేతన చట్టం ప్రకారం చెందుతుందో ప్రభుత్వమే స్పష్టం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ రంగాలలో పనిచేస్తున్న అనేక మంది కార్మికులకు అంగన్వాడి, ఆశావర్కర్లు తదితరులు అందరికీ వేతనాలు పెంచి కేవలం మధ్యాహ్న భోజన కార్మికులను మాత్రమే విస్మరించారు. అంటే దీని ఉద్దేశం మధ్యాహ్న భోజన కార్మికులకు అక్షరాస్యత లేదని, వీరికి ఓటర్లను ప్రభావితం చేసే శక్తి లేకపోవడమే కారణం కాదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను గుర్తించి ముద్ర లోన్ ద్వారా బ్యాంకు రుణాలు అందించాలని, వంట పాత్రలు, గ్యాస్ పంపిణీ చేయాలని, వంట షెడ్లు నిర్మించడంతో పాటు అంగన్వాడీలకు సప్లై చేసిన విధంగానే అన్ని రకాల సరుకులు మధ్యాహ్న భోజనానికి సప్లై చేయాలన్నారు. నిత్యం వంట చేస్తూ మంటల్లో రగులుతూ, పొగలో మసలుతూ ఉండడంతో అనారోగ్యానికి గురవుతున్నామని అందుకుగాను ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నియామక పత్రాలు అందజేయడంతో పాటు ఐడి కార్డులు, యూనిఫామ్ అందజేసి ఉద్యోగులుగా గుర్తిస్తూ చట్టబద్ధ హక్కును కల్పించాలని వేడుకున్నారు.

జిల్లా కలెక్టరేట్ ముట్టడి, హైదరాబాదులో మహాధర్నాకు సన్నద్ధమవుతున్నాం:

సీఐటీయూ అనుబంధ సంఘం తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో, ఈ నెల 24న ఉదయం 10:30 గంటలకు హన్మకొండ ఏకశిలా పార్కు నుండి మొదలవనున్న జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమానికి.. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జనవరి 11, 12 తేదీలలో సుమారు 48 గంటల పాటు మహా ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలనిజిల్లా కార్యదర్శి చక్రపాణి తెలియజేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. –బొట్ల చక్రపాణి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి

 

Tags:    

Similar News