ప్రేమికుల పాలిట శాపం.. లాక్‌డౌన్
దూరం పెరిగితే ఎలాంటి బంధాలైనా నెమ్మదిగా దూరమవుతాయి. ఇక ప్రేమ విషయంలోనైతే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. రెండు మూడు రోజులకే ‘నిన్ను మిస్ అవుతున్నా, నిన్ను చూడాలనిపిస్తోంది’ అని మెసేజ్‌లు పంపుకునే ప్రేమికులు.. ఈ కరోనా లాక్‌డౌన్ కారణంగా తమ బంధాల మీద నమ్మకం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోంది. అలాగని అన్ని ప్రేమలు బలహీనమైనవని అనడం లేదు. కరోనా లాక్‌డౌన్ కారణంగా నిజమైన ప్రేమికులు చెప్పుకోరాని బాధలు పడుతున్నారని అనుకోవచ్చు. ఒకరికొకరు దూరంగా ఉండటమే […]
దూరం పెరిగితే ఎలాంటి బంధాలైనా నెమ్మదిగా దూరమవుతాయి. ఇక ప్రేమ విషయంలోనైతే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. రెండు మూడు రోజులకే ‘నిన్ను మిస్ అవుతున్నా, నిన్ను చూడాలనిపిస్తోంది’ అని మెసేజ్‌లు పంపుకునే ప్రేమికులు.. ఈ కరోనా లాక్‌డౌన్ కారణంగా తమ బంధాల మీద నమ్మకం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోంది. అలాగని అన్ని ప్రేమలు బలహీనమైనవని అనడం లేదు. కరోనా లాక్‌డౌన్ కారణంగా నిజమైన ప్రేమికులు చెప్పుకోరాని బాధలు పడుతున్నారని అనుకోవచ్చు. ఒకరికొకరు దూరంగా ఉండటమే కాకుండా, ఇంట్లో ఉండి స్వేచ్ఛ కోల్పోవడం, గొడవలతో విడిపోవడం, వేసుకున్న ప్రణాళికలు, పశ్చాత్తాపాలు, భయాలు, బలహీనతలతో యువ ప్రేమజంటలు పడరాని కష్టాలు పడుతున్నాయి.
ఇల్లే బందీఖానా..
ఈ మహమ్మారికి ముందు గంటల కొద్దీ, ఏది కావాలంటే అది మాట్లాడుకున్న ప్రేమికులు.. ఇప్పుడు కనీసం అరగంట కూడా మాట్లాడుకోలేకపోతున్నారు. ఎవరింట్లో వాళ్లుండటం, ఇంట్లో తల్లిదండ్రులు ఉండటంతో వారికి చాలా ఇబ్బంది కలుగుతోంది. ఆడపిల్లల పరిస్థితి మరీ కష్టం. వారికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు ఇంట్లో తెలియకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ కనీసం పది నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఒకవేళ మాట్లాడినా ఏదో ఒక ఆఫీసు డౌట్ అని చెప్తూనో లేదా స్నేహితురాలు అని చెప్పో కవర్ చేస్తున్నారు. దరిద్రం దాపురించి అరగంట కంటే ఎక్కువసేపు మాట్లాడితే మాత్రం ఇంట్లో వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నరకం చూస్తున్నారు. ఆడియో కాల్స్ సంగతే ఇలా ఉంటే, ఇక వీడియో కాల్ పరిస్థితి దారుణం. దీంతో ఒకరినొకరు చూసుకోలేక విరహాన్ని భరించలేకపోతున్నారు.
పశ్చాత్తాపాలు, ప్రణాళికలు..
ప్రేమలో గొడవలు పడటం సహజం. నిజానికి గొడవలు పడితేనే ఆ ప్రేమ నిజమైనది అంటారు. కానీ ఆ గొడవ పడిన ఎంతసేపటికి తిరిగి కలిశారనే విషయం మీదే ప్రేమ బలం తెలుస్తుంది. సాధారణంగా ప్రేమికులు గొడవ పెట్టుకున్న రెండు మూడు రోజుల్లో ఎవరో ఒకరు క్షమాపణలు చెప్పి సర్దుకుపోతారు. కానీ మార్చి రెండో వారంలో గొడవైన ప్రేమికుల పరిస్థితి ఇప్పుడు బ్రేకప్ స్థాయికి చేరుకుంది. లాక్‌డౌన్ కారణంగా వారు ఒకరినొకరు కలిసి క్షమాపణలు చెప్పుకునే అవకాశమే రాలేదు. గొడవ పెట్టుకున్న కోపంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ బ్లాక్ చేసుకున్నారు. ఒకవేళ ఫోన్లో మాట్లాడుకున్నా.. ఆ గొడవ పెరుగుతోందే తప్ప తరగడం లేదు. దీంతో ఒకరి భావాలను మరొకరు పంచుకోలేక విడిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇక ఇంట్లో తెలియకుండా వేరువేరుగా ఉంటున్నామని చెప్పి కలిసి సహజీవనం చేస్తున్న ప్రేమికుల పరిస్థితి ఈ లాక్‌డౌన్ కారణంగా అగమ్యగోచరంగా మారింది. పెళ్లికాకున్నా నిజమైన భార్యాభర్తల్లాగే ఇంతకాలం బతికున్న వీరి మధ్య ఇప్పుడు ఒక్కసారిగా అగాథం ఏర్పడినట్లయింది. ఇంట్లో ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా శ్రావణ మాసంలో లేచిపోయి పెళ్లిచేసుకోవాలని ప్రణాళికలు వేసుకుని, అన్ని సిద్ధం చేసుకున్న ప్రేమికులకు ఇప్పుడు ఆ శ్రావణమాసం ప్రవేశించి తీరని వేదన మిగుల్చుతోంది. బెంగళూరుకి చెందిన శ్రావణి, హైద్రాబాద్‌కు చెందిన అశోక్‌ను ప్రేమించింది. కులాలు వేరైన కారణంగా శ్రావణి ఇంట్లో వాళ్లు వారి ప్రేమను అంగీకరించలేదు. ఈలోగా శ్రావణికి ఆస్ట్రేలియాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అక్కడికెళ్లిన ఆమె, అశోక్‌కు కూడా తన కంపెనీలో జాబ్ చూసింది. అశోక్ అక్కడికి వచ్చాక పెళ్లి చేసుకుందామని అనుకుంది. మార్చిలో అశోక్‌కు వీసా కూడా వచ్చింది. కానీ లాక్‌డౌన్ కారణంగా శ్రావణి ఆస్ట్రేలియాలో, అశోక్ హైద్రాబాద్‌లో మిగిలిపోయారు. ఇలాంటి కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నింటికి కారణం కొవిడ్ 19.
భయాలు, బలహీనతలు
ఇప్పుడిప్పుడే పుట్టిన లేత ప్రేమలు.. అంటే ఆన్‌లైన్ చాటింగ్‌లో, డేటింగ్ యాప్‌లో కలిసిన వాళ్లు, ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి ప్రేమలో పడినవాళ్ల పరిస్థితి ఇంకా భిన్నంగా ఉంది. అటో ఇటో కష్టపడి ఇంటి నుంచి బయటికి రాగలిగినా, కలవడానికి థియేటర్లు, రెస్టారెంట్లు, పార్కులు, కాఫీ షాపులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఒకటో రెండో ఉన్నా సామాజిక దూరం పేరుతో ఎడంగా ఉండాల్సి వస్తోంది. నేరుగా ముఖం చూసి, ప్రేమగా మాట్లాడుకుందామంటే ముప్పావు శాతం మూసేసిన మాస్కు కనిపిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా తమ ప్రియురాలు లేదా ప్రియుడు ఎక్కడ తిరిగి ఏ వైరస్ అంటించుకున్నాడోనన్న భయం ఒక తెలియని అభద్రతాభావాన్ని కల్పిస్తోంది.
ఇలా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లందరూ అందరితో పాటు కరోనా సమస్యలను అనుభవిస్తూనే ఇలా బయటికి చెప్పుకోలేని విరహ భావాన్ని విధిలేక భరిస్తున్నారు. ఏదేమైనా నిజమైన ప్రేమ అనేది ఈ దూరాలకు, వైరస్‌లకు అతీతంగా ఉంటుందనే సత్యాన్ని వారు విశ్వసించి, తమ బంధాన్ని గట్టిగా కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఆశించడం తప్ప ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.