తిరుపతిలో ఆంక్షలు మరింత కఠినం
దిశ, న్యూస్‌బ్యూరో: తిరుపతి పట్టణంలో, శివారు ప్రాంతాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో మంగళవారం నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం కానున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు ఐదున్నర వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయిని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఆంక్షలు విధించక తప్పడంలేదని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పష్టం చేశారు. తిరుపతి పట్టణంలో వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి తదితరాలపై తిరుపతి మున్సిపల్ కమిషనర్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: తిరుపతి పట్టణంలో, శివారు ప్రాంతాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో మంగళవారం నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం కానున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు ఐదున్నర వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయిని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఆంక్షలు విధించక తప్పడంలేదని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పష్టం చేశారు. తిరుపతి పట్టణంలో వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి తదితరాలపై తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరిషా, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, పలువురు అధికారులతో తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చర్చించిన అనంతరం పై నిర్ణయాన్ని ప్రకటించారు.
కఠిన ఆంక్షల్లో భాగంగా కూరగాయలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి 11.00 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని, ఆ తర్వాత మూసివేయక తప్పదని స్పష్టం చేశారు. మందుల షాపులు మాత్రం 24 గంటలూ ఉంటాయన్నారు. రోడ్ల మీద వాహనాల రాకపోకలన్నీ ఉదయం 11గంటల తర్వాత బంద్ అవుతాయన్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు ఈ ఆంక్షలను కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. తిరుపతి పట్టణంలో వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ ఆంక్షలకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. జిల్లా మొత్తంమీద నమోదైన కేసుల్లో సుమారు మూడవ వంతు కేవలం తిరుపతి పట్టణంలోనే ఉన్నాయని, భద్రతా విధుల్లో ఉన్న పోలీసు శాఖలోనూ చాలా పాజిటివ్ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటికే ఇద్దరు పోలీసులు కూడా కరోనా కారణంగా మృతి చెందారని తెలిపారు.
ఇదిలా ఉండగా తిరుచానూరు ఆలయంలో పనిచేస్తున్న అర్చకులకు పాజిటివ్ రావడంతో తాత్కాలికంగా భక్తులకు దర్శనం బందయ్యింది. ఆలయాన్ని మూసివేశారు. తిరుమల మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు కరోనా కారణంగా మృతి చెందారు. తిరుమల ఆలయంలో పనిచేస్తున్న పదిహేను మంది అర్చకులకు పాజిటివ్ సోకింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో మంగళవారం నుంచి ఆంక్షలు మొదలుకానున్నాయి.