మీరు లేరు
సాహిత్య సభలకు శోభ లేదు
మీ చమత్కార సంభాషణల కోసం
మేం చెవులు కోసుకునే వాళ్లం
ఇప్పుడా! చెవులు మూసుకుంటున్నాం!
కాలగతిని గుర్తు చేసే
మీ వంటి సభాధ్యక్షులు లేక
నసగాళ్లంతా పగ తీర్చుకుంటుంటే
సభలన్నీ విరిచిన కవితా పాదాలౌతున్నవి!
సభలకు వెళ్లామా వచ్చామా
దాహంతో వెళ్లిన వాళ్లం
ఖాళీ కుండలతో తిరిగొస్తున్నాం
మనసు మీ కాలాన్ని నెమరు వేస్తున్నది!
మేల్కొల్పాల్సిన కవులు సైతం
సాహిత్య సభల్లో నిద్రపోవడం
హీన ప్రబంధ కాలాన్ని గుర్తు చేస్తుంటే..
మీ'పగలే వెన్నెల' గీతాన్ని పాడలేకపోతున్నాం!
మా ఎదుట మీరు లేకున్నా
కవుల ఎదలో కొలువై
కర్పూర కవితా వసంతరాయలై
కవన సుగంధాలు వెలిగించాలి!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261