కమ్మిన కారు మబ్బులు
చాటునున్న ఆకాశాన్ని
కాన రాని వాళ్లున్న చోట
చిరు జల్లులయి కురుస్తున్న
తొలకరి వాన చినుకుల్ని స్పర్శించని
మానవ జాతంటూ ఉంటుందా..!?
అమాస చిక్కటి చీకట్లను
తాకని మనిషంటూ ఉన్న చోట
నిండు పున్నముల వెలుగులే
జీవితాలన్న వేళ
అది జీవితమెట్లా అవుతుంది...?
రాహు కేతువులు కలిసి ఆడిన చోట
గ్రహణమయి కమ్మిన రోజున
ఏ వెలుగులు లేని కాడ
నిశిని ఏమని పిలవాలి
ఎలా అలుముకోవాలి...?
సంద్రంలో దుమికిన చేప
నీటినే జయిస్తుంటే
ధరణిపై అలుముకున్న
ఈ అంథకారానికి
కారకులు ఎవరని అడగాలని ఉన్నది...?
అమాసను దాటి పున్నమిని పులిమిన వాళ్లు
గ్రహణాన్ని వీడి గమ్యం చేరిన చోట
ఫినిక్స్ పక్షిలా నిలబడిన వాళ్ళు వీళ్లే కదా...
వాళ్లే ఈ లోకానికి ఆదర్శం....!!
(దివ్యాంగులకు మద్దతుగా....)
-వంగల సంతోష్
95737 86539