వాసిలోనూ, రాశిలోనూ తెలుగులో బాల సాహిత్యం తక్కువేమి కాదు. పాలకోడేటి సత్యనారాయణ, మహీధర నళిని మోహన్, నండూరి రామ్మోహన్ రావు లాంటి రచయితలతో పాటు పలువురి రచనలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మంచి పుస్తకం, పీకాక్ క్లాసిక్స్ వారు పిల్లల కోసం ప్రచురించిన పుస్తకాలు ఎన్నో. విశాలాంధ్ర వారు చాలా బాల సాహిత్యం తెచ్చారు. కొత్తగా చందమామ కథలు కూడా సంకలనంగా వచ్చాయి. కేవలం బాల సాహిత్యం మీదనే దృష్టి పెట్టి, విభిన్న రీతిలో కృషి చేస్తున్న సంస్థలలో మంచి పుస్తకం ప్రచురణ సంస్థ అత్యంత ప్రధానమైంది. దీనికి ఇప్పుడు 20 ఏళ్లు. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో వారు సాధించిన విజయాలు ఎన్నో..
మంచి పుస్తకం 2003 హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పాల్గొని తన తొలి అడుగు వేసింది. 2004 ఏప్రియల్‌లో పబ్లిక్ ట్రస్ట్‌గా నమోదయినా, దీని పునాదులు మాత్రం 1989లో ప్రారంభమై పదేళ్ల పాటు కొనసాగిన ‘బాల సాహితి’ ట్రస్టులో ఉన్నాయి. ఆ పదేళ్ల కాలంలో బాల సాహితి 40కి పైగా పుస్తకాలు ప్రచురించింది. పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమను కలిగించటం, తెలుగులో పఠనా సామర్థ్యాన్ని పెంచడం ప్రధాన ఉద్దేశాలుగా మంచి పుస్తకం పని చేస్తోంది. తెలుగులో అందుబాటులో ఉన్న అన్ని పిల్లల పుస్తకాలను తెచ్చి పాఠకులకు పరిచయం చేసేవారు. తల్లిదండ్రులు, టీచర్లతో పుస్తకాల గురించి, వాటి ఎంపిక గురించి మాట్లాడటం వీరి ప్రధాన కార్యక్రమం. దీంట్లో సి. ఎ. ప్రసాద్, రఘుబాబు, భాగ్యలక్ష్మి, శ్రీ కుమార్‌లతోపాటు ఎంతో మంది వీరికి స్వచ్ఛందంగా సహకరించారు. ఇప్పుడు మంచి పుస్తకం తన ప్రచురణలే కాకుండా సి.బి.టి., విజ్ఞాన ప్రచురణలు, పీకాక్ క్లాసిక్స్, కావ్య పబ్లిషింగ్ హౌస్, హెచ్.బి.టి. వంటి ఎంపిక చేసిన సంస్ధల ప్రచురణలను కూడా అందుబాటులో ఉంచుతోంది. వెరసి 400కి పైగా టైటిల్స్ నుంచి ఎంచుకునే అవకాశం పాఠకులకు ఉంది.
20 ఏళ్లలో 470 పుస్తకాలు
ఇరవై ఏళ్ల పైబడిన ఈ కాలంలో మంచి పుస్తకం తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు, హిందీ భాషలలో 470 పైగా పుస్తకాలను ప్రచురించింది. వీటిలో బొమ్మల కథలు, కథలు, నవల, జీవిత చరిత్ర, లైఫ్ స్కిల్స్, యాక్టివిటీ, విజ్ఞాన శాస్త్రం తదితర పలు అంశాల్లో పుస్తకాలు ఉండటం గమనార్హం. పిల్లల కోసం వయస్సును బట్టి పుస్తకాలను 5-8, 8-12, 12-14, 14+ విభజించారు. ఇవి కాక తల్లిదండ్రులు, టీచర్ల కోసం విద్య, పిల్లల పెంపకం, బోధనకి సంబంధించి పుస్తకాలను తీసుకువచ్చారు. ‘పర్మనెంట్ గ్రీన్’ అన్న ఇంప్రింట్ సిరీస్ ద్వారా ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలను తెలుగు, ఇంగ్లీషు భాషలలో ప్రచురిస్తూ కృషి చేస్తూ వచ్చారు. పెద్దవాళ్ల కోసం కొన్ని నవలలు, ఫిలాసఫి, ఒక హోమియో పుస్తకం కూడా తీసుకు రావటం జరిగింది. మరీ ముఖ్యంగా వారి ఉద్దేశాలతో కలిసి వచ్చే సంస్థలతో కలిసి పని చెయ్యటానికి మంచి పుస్తకం మొదటి నుంచి ప్రాధాన్యతను ఇచ్చింది. వీటిల్లో విజ్ఞాన ప్రచురణలు (మొదట్లో జన విజ్ఞాన వేదిక) ఒకటి.
ఉమ్మడి ప్రచురణలతో అద్భుతం
విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవే కాకుండా ఇంకా ఎన్నో పుస్తకాలు ఈ రెండు సంస్థల ఉమ్మడి ప్రచురణలుగా ఉన్నాయి. వికాస విద్యా వనం, జాబిల్లి ట్రస్ట్, దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, వాహిని, శాంతి వనం, అలరు వంటి సంస్థలతో ఉమ్మడి ప్రచరుణలు చేపట్టారు. సి.బి.టి. పుస్తకాల తెలుగు అనువాదాలు తగ్గిపోతున్న సమయంలో ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ‘సోల్ డిస్ట్రిబ్యుషన్’ ప్రాతిపదికన 10 పుస్తకాలను మంచి పుస్తకం ప్రచురించారు. తొలి రోజుల్లో ఎక్కువగా అనువాద పుస్తకాలు ప్రచురించిన మంచి పుస్తకం క్రమేపి తెలుగులో మూల రచనలను ప్రచురించటం మొదలు పెట్టింది. ఇందులో చెప్పుకోదగినది ‘తానా’తో భాగస్వామ్యం. 2017 నుంచి మొదలు పెట్టి పదేళ్ల లోపు పిల్లల కోసం 28 బొమ్మల కథల పుస్తకాలు, పదేళ్లు పైబడిన పిల్లల కోసం 21 నవలలు తీసుకు వచ్చి కొత్త ప్రయోగం చేశారు. ఒక సమయంలో పిల్లల పుస్తకాలు అంటే సోవియట్ బాల సాహిత్యంగా ఉండేది. ఇందులోంచి 50కి పైగా పుస్తకాలను మంచి పుస్తకం తిరిగి ముద్రించింది. సుతయేవ్ రాసిన పడవ ప్రయాణం, బాల సాహితి మొదట ప్రచురించిన టాల్‌స్టాయ్ బాలల కథలు వంటి పుస్తకాలు ఇన్నేళ్లుగా పునః ముద్రణ అవుతూ పిల్లలను అలరిస్తున్నాయి.
గ్రేడెడ్ పఠన సామగ్రి
మంచి పుస్తకం చేసిన మరో చెప్పుకోదగిన ప్రయత్నం తక్కువ ఖర్చుతో ‘పుస్తకాలతో స్నేహం’ అన్న పేరుతో గ్రేడెడ్ పఠన సామగ్రిని అందించటం. నలుపు-తెలుపులో 16 పేజీల చొప్పున పది పుస్తకాల సెట్‌లను ప్రచురించటం మొదలు పెట్టింది. ఇదే సిరీస్‌లో 32 పేజీల చొప్పున 5 పుస్తకాలతో రెండు సెట్లు, 64 పేజీల చొప్పున 5 పుస్తకాలతో ఒక సెట్ ప్రచురించారు. అంటే మొత్తం పది సెట్లలో 1760 పేజీల గ్రేడెడ్ రీడింగ్ మెటీరియల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. వీరి విజ్ఞాన శాస్త్ర పుస్తకాలలో ఐజాక్ అసిమోవ్ రాసిన ‘ఎలా తెలుసుకున్నాం’ సిరీస్‌లోని 33 పుస్తకాలు బాగా ఆదరణ పొందాయి.
నిర్వాహకుల నిబద్ధ కృషి
మంచి పుస్తకం వ్యవస్థాపక ట్రస్టీలుగా కె. సురేష్, ఎ. రవీంద్ర బాబు ఉన్నారు. 2010 నుంచి ట్రస్టీగా కొనసాగుతున్న ఎస్.ఎస్. లక్ష్మి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2007 నుంచి తన పూర్తి సమయాన్ని ఇస్తున్న పి. భాగ్యలక్ష్మి పుస్తకాలను పిల్లలకు చేరువ చేయడంలో చేస్తున్న కృషి ఎనలేనిది. మంచి పుస్తకం పుస్తకాల ద్వారా పిల్లలు తెలుగు నేర్చుకోవడం, వాళ్లల్లో పుస్తకాల పట్ల ప్రేమ కలగటం (అది ఎంత తక్కువ సంఖ్య అయినప్పటికీ) మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చే విషయమంటారు సురేష్.
మనసా వాచా కర్మణా...
బాలబాలికల కుతూహలాన్ని తీర్చగల సాహిత్యం విరివిగా రావాలి. కుతూహలాన్ని సకాలంలో సక్రమంగా తీర్చకపోతే, అది అసలే అణగారిపోతుంది. కుతూహలం లేని బాలబాలికలు బాధ్యతాయుతులైన పౌరులుగా వికసించలేరు అన్న పెద్దల మాటలను మననం చేసుకుంటూ సురేష్ నిర్వహణలో గత 20 సంవత్సరాలుగా మనసా వాచా కర్మణా తన పరిధిలో కాలానికి దీటుగా, పిల్లల అభిరుచులకు తగ్గట్లు మంచి పుస్తకం అహరహం శ్రమిస్తూ, సాగుతూ ఉంది. ఇలానే మరో 20 ఏళ్లు మంచి పుస్తకం బాల రంజకంగా జనరంజకంగా కొనసాగాలని కోరుకుందాం.
ప్రచురణలకు
కె. సురేష్
73822 97430
సమీక్షకులు
వలేటి గోపీచంద్
94412 76770