ఉరుకు పటేలా.!

(జీతమా.. జీవితమా?)

Update: 2025-01-01 11:48 GMT

ఇది పోటీ ప్రపంచం.

ఉరుకుల పరుగుల జీవితం.

జీవితపు పరుగుపందెంలో ఎవరు ముందు వెళితే వారే విజేత.

ఏమరపాటుగా ఉన్నవాళ్లు వెనకబడిపోతారు.

అలసిపోయినవాళ్లు ఆగిపోతారు.

ఆగిపోతే కుందేలు తాబేలు కథలా మారిపోతుంది జీవితం.

కానీ ఈ పరుగు ఎక్కడిదాకా.?

ఎప్పటివరకు ఈ గజిబిజీ గందరగోళం.?

లెట్స్ ఫాలో దిస్ స్టోరీ.!

- దాయి శ్రీశైలం

ఎలుక నడుస్తుంటే చూశారా.? ఏమో అదెప్పుడూ పరుగెడుతూనే ఉంటుంది. రాన్రాను మనిషి జీవితం కూడా ఎలుక పరుగులాగే మారిపోతోంది. నేటి ఈ ఎలుక పరుగు జీవనశైలి తరానికి నిమ్మళముంటలేదు. నిదానముంటలేదు. నిత్యం ఒక్కటే పరుగు. విరామముంటలేదు.. విశ్రాంతి ఉంటలేదు దినాం గడియారంతో పోటీనే. నువ్వా నేనా సై అని ఒకరి మీద ఒకరు పోటీలు పడి పరుగులు తీస్తున్నారు. తిండి తీరిక లేదు.. మాట తీరికలేదు. అసలు సమయమే ఉంటలేదు.. ఇక సంతోషమెక్కడిది.? ఒక్కటే టెన్షన్ టెన్షన్. జీవితపు పరుగులో ఆగిపోతే ఇంకెవరైనా ఓవర్ టేక్ చేస్తారేమోననే భయం.. భయం. 

పరుగు ఆపేయగలమా.?

పిల్లల ఫీజులు, ఈఎమ్ఐలు, కార్ లోన్, క్రెడిట్ కార్డు బిల్లులు, చిట్టీల పరిస్థితి ఏంటి.? అమ్మో.. ఊహించుకుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది. 73 ఇంచుల టీవీ లేకపోతెనేమో ఇరుగు పొరుగుకు లోకవవుతామనే బాధ. అందుకే ఈఎమ్ఐని వెతుక్కుంటూ వెళ్తాం. డబుల్ డోర్ ఫ్రిజ్ లేకపోతెనేమో చుట్టాల ముందు చులకన అవుతామని షాపింగ్ కార్డును స్వైప్ చేస్తాం. పిల్లలు లక్షణంగా చదువుకోవాలి కాబట్టీ లక్షలు ఖర్చయినా మంచి స్కూళ్లోనే చదివించాలనుకుంటాం. కలిసి వెళ్లాలి కాబట్టీ కారు అనివార్యమవుతుంది.. దానికి లోనూ కంపల్సరీ అవుతుంది. జీతం 5వ తారీఖుకు వస్తుంది కాబట్టీ అప్పట్లోగా ఈఎమ్ఐలను సర్దాలని క్రెడిట్ కార్డులు గీకుడూ తప్పదు. గీకినంక ఏముంటుందీ.. మళ్లీ వాటి బిల్లులు కట్టడానికీ వాళ్లనూ వీళ్లనూ గోకుడు షురువవుతుంది. సో.. ఎంత ఇబ్బంది అయినా.. ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా ఈ జీవితపు పరుగులను ఆపలేం. ఆపేస్తే.. ఏమవుతుందో ఇప్పటికే అర్థమైంది కదా.?

కానీ.. వరుణ్ ఆపేశాడు.!

వరుణ్ హసీజా వయసు 30 సంవత్సరాలు. బెంగళూర్లోని ఒక ఎమ్ఎంఎన్సీ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగం. ఏడాదికి రూ.కోటి ప్యాకేజీ. 20 ఏళ్ల వయసులోనే కెరీర్ మొదలుపెట్టాడు. ఇంకేంది లైఫ్ ఫుల్టూ బిందాస్ కదా.? నిజమే.. చేతినిండా డబ్బు. ఏ లోటూ లేకుండా సాగుతున్న జీవనం. ఇన్ని ఉన్నా వరుణ్ హ్యాపీగా లేడట. విలాసవంతమైన జీవితమే అయినా.. ఉద్యోగ జీవితంలో విపరీతమైన ఒత్తిడి ఫీలయ్యాడట. టార్గెట్ ల వెంట పరుగులు పెట్టలేక నిత్యం మానసిక ఒత్తిడితో సతమతం అయ్యేవాడట. అవసరానికి మించి సంపాదిస్తున్నా వరుణ్ జీవితంలో సంతృప్తి కరువైంది. మానసిక ప్రశాంతత లేక తీవ్ర ఆందోళనకు గురయ్యి ఎవరికీ చెప్పులేని బాధను అనుభవిస్తున్నాడు. విలావంతమైన జీవితం కంటే సంతోషకరమైన జీవితమే ముఖ్యం అని భావించి తన భార్యతో విషయం చెప్పుకున్నాడు. తాను చేస్తున్న ఉద్యోగం వల్ల మానసికంగా.. శారీరకంగా అనుభవిస్తున్న నరకాన్ని భార్యకు వివరించి.. ఉరుకు పరుగుల జీవితానికి బ్రేక్ ఇచ్చాడు.

ఆ ఖర్చులెందుకు?

సంతోషం, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు. వరుణ్, అతడి భార్య ఇదే ఆలోచించారు. ఉద్యోగం మానేస్తే జీవితం ఎంత దుర్భరంగా మారుతుందో వాళ్లకు తెలుసు. కానీ, బతికుంటే బలుసాకయినా తినొచ్చని ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఖర్చుల నియంత్రణ ఎలా అని ఒక ఎక్సెల్ షీట్ తయారుచేసుకొని అన్ని లెక్కలూ రాసుకున్నారు. రోజువారీ ఖర్చులెన్ని.? నెలకు మొత్తం ఎంత అవుతుంది, సేవింగ్స్, బీమా, ప్రయాణాలు.. ఇలా ప్రతీదీ ప్లాన్ వేసుకున్నారు. అనవసర ఖర్చులను వందకు వందశాతం తగ్గించేలా ప్లాన్ చేశారు.

బడ్జెట్ పద్మనాభం

వరుణ్ అత్యవసర ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ను రూపొందించారు. ఎంతైనా విలాసవంతమైన జీవితం కదా.. ఫ్యాన్సీ ట్రిప్పులు, షానింగ్ లు, వృథా ఖర్చుల మాటేమిటీ అనే ప్రస్తావన వచ్చినప్పుడు.. వాటిని మొత్తానికే ఆపెయ్యాలనుకున్నారు. ఇవన్నీ అనుకున్నట్లుగా అమలు చేస్తే భార్య సంపాదనతో అయినా ఎంతలేదన్నా ఒక ఏడాది పాటు ఏ చింతా లేకుండా బతుకొచ్చనేది వారి బడ్జెట్ ప్రణాళిక. బడ్జెట్ పద్మనాభంగా మారి పొదుపు జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి సై అన్నాడు. 

కంట్రోల్.. కంట్రోల్

విలాసవంతమైన జీవితం, విపరీతమైన ఖర్చులున్న వరుణ్ తన లైఫ్ స్టయిల్ మార్చుకొని ఎక్కడ ఖర్చు పెట్టాలో కాదో, ఎక్కడ కంట్రోల్ చేయాలో తెలుసుకున్నాడు. ఫలితంగా జీతం లేకున్నా సంవత్సరం పాటు హాయిగా ఉండొచ్చని చెప్తున్నాడు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొట్టుమిట్టాడుతున్న వారు వరుణ్ లా ఎందుకు ఆలోచించకూడదు.? అనవసర ఖర్చులతో తలపై భారం వేసుకున్న వాళ్లంతా నియంత్రణ సూత్రాన్ని ఎందుకు ఫాలో కాకూడదు.?

వద్దే వద్దు బ్రో

ఏదో అవసరానికి ఒక క్రెడిట్ కార్డ్ అంటే ఓకే. కానీ నాలుగైదు అవసరం లేదు కదా.? సంపాదనను దృష్టిలో ఉంచుకొని ఈఎంఐలు పెట్టుకోవాలి. ప్రతిష్టకుపోయి మితిమీరిన ఖర్చు పెట్టొద్దు. వాళ్లేమనుకుంటారో, వీళ్లేమనుకుంటారో అని కాకుండా మనకేం అవసరం ఉందో ఆ పరిమితిలో ఖర్చు చేయడం మంచిది. ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తే కుప్పయ్యేది మీరు.

సంపద.. సంతోషం

వరుణ్ చేసినట్లు చేయమనంటే ఉద్యోగాలు వదిలేసి ఇంట్లో కూర్చోమని కాదు. కష్టపడకుండా, రిస్క్ చేయకుండా ఏదీ సాధ్యం కాదు. తమ కోసం కాకపోయినా ఫ్యామిలీ కోసం అయినా ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి. కాకపోతే ఆడంబరాలకు వెళ్లి ఒత్తిడికి లోనయ్యి, ఉద్యోగ చట్రంలో ఇరుక్కుపోయి ప్రశాంతతను, సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. ఇక తప్పదు అనుంటే మాత్రం వరుణ్ తీసుకున్నట్లు కొంతకాలం బ్రేక్ తీసుకొని మళ్లీ ఫ్రెష్ గా ఏ స్టార్టపో ప్రారంభించడం బెటర్. లే ఆఫ్స్, పింక్ స్లిప్ ల వల్ల హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోతున్నవారిలో వరుణ్ ఒక ధైర్యాన్ని నింపాడు. ఒక్క వరుణ్ కే కాదు.. ఈ గజిబిజీ గందరగోళంలో పరుగులు పెడుతున్న ప్రతి ఒక్కరికీ మనశ్శాంతి, ప్రశాంతత, సంతోషం, కుటుంబానికి సమయం కేటాయించడం అవసరమే. జీవితంలో సంపద, సంతోషం రెండూ అవసరమే కదా బ్రో.. కులాసగా ఉరుకు.. కానీ కుదేలవ్వకు.. హ్యాపీ జర్నీ.! 

Tags:    

Similar News