"హలో మామా."
"ఊ.."
"తిన్నవా.?"
"ఉహూ.."
"నాకు వీసా వచ్చింది."
"ఓహో."
"వచ్చేనెల యూఎస్ పోవుడే ఇగ."
"ఆహా."
"నీయబ్బరే ఏదైనా మాట్లాడి సావురా. ప్రతీదానికి ఉహూ.. అహో అని సావ దొబ్బుతవెందుకూ"
"హిహిహ్హీ..!"
"ఏంటి మమ్మీ ఎవడీడూ" అనిపిస్తోందా.?
"హలో.. ఇంట్రోవర్ట్ ఇక్కడా.. ఇంతే మాట్లాడ్తం.. ఇట్లనే ఉంటం..
జనవరి 2.. వరల్డ్ ఇంట్రోవర్ట్ డే.. అంటే మారోజు. మాకిదే హ్యాపీ న్యూ ఇయర్.. ముందు ఈ స్టోరీ చదవండీ.!
"పలుకే బంగారమాయె.. పిలిచినా పలుకవేమీ" అని ఎంత గీ పెట్టినా గింజుకున్నా ఉలుకూ.. పలుకూలేని ఉషార్ మనుషులే ఇంట్రోవర్ట్‌లు. "వచ్చుండాయ్ పీలింగ్సూ" అని ఎంత ఆటపట్టించినా మాటవరసకు కూడా "రెచ్చగొడుతున్నావ్ సూరీ" అని నోరెత్తరు.
ఎప్పుడు పారిపోదామా అనీ..
ఇంట్రోవర్ట్ ఎవ్వరితోనూ ఎక్కువ కలిసిపోరు. ఎవరైనా పలకరించినా.. మాట్లాడినా ముభావంగా ఉంటారు. ముక్తసరిగా మాట్లాడతారు. ఎప్పుడెప్పుడు పారిపోదామా అని ఎదురుచూస్తుంటారు. మొఖంలో పెద్దగా ఫీలింగ్సేమీ కనిపించవన్నమాట. ఏదో దీర్ఘాలోచనలో ఉంటారు. సంతోషం కలిగినా.. బాధయినా.. ఏడుపొచ్చినా లోలోలపలే ఫీలవుతారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అవసరమైతే తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు.ఇక ఫంక్షన్లకు, పార్టీలంటారా.? వెళ్లాలా వద్దా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఎవరినీ కలవరు. బాగున్నావా అని ఎవరైనా పలకరిస్తే.. బాగున్నాను కాబట్టే ఫంక్షన్‌కు వచ్చాను కదరా నాయనా అని మనసులో అనుకుంటారు.
ఇంకేం కావాలీ.?
పరిచయమున్న వ్యక్తులతోనే సరిగా కలవరు ఇంట్రోవర్ట్‌లు. అలాంటిది ఎవరైనా కొత్తవాళ్లతో మాట్లాడాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండీ. నేల చూపులే ఇక. చూసేవారికి నవ్వొస్తుంది. అవతలి వ్యక్తికి నవ్వుతో కూడిన చిరాకొస్తుంది. ఓర్నీ మొహమాటం సల్లగుండా ఏదో ఒకటి మాట్లాడరాదు అనుకుంటారు. మాట్లాడకపోతే.. పలకరించకపోతే ఇలా అనుకుంటారని తెలిసినా పాపం.. ఇంట్రోవర్ట్స్ ఏమీ చేయలేరు. ఇంతేనా అని అడిగితే ఇంకేం కావాలీ అన్నట్లు మొఖం పెడతారు. కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు మాట్లాడాలి అనుకునేవాళ్లకు ఇక సినిమానే. అందుకే ఇంట్రోవర్ట్స్‌తో వ్యవహరించడం కొంచెం కష్టమని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే వారు తమ భావాలను ఎవరికీ చెప్పుకోరు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదనే భావనతో ఉంటారు.
మౌనంగానే ఎదగమనీ..
మనిషన్నాక కూసింత కళా పోషణ ఉండాలంటారు. అంతేగానీ మాట్లాడుతూనే ఉండాలని ఎక్కడా లేదుకదా అంటారు ఇంట్రోవర్ట్‌లు. అందరూ మాట్లాడనవసరం లేదన్నది వారి అభిప్రాయం. మౌనంగా ఉంటేనే మనుగడ సాధ్యం అనుకుంటారు. మౌనంతోనే ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు ఇంట్రోవర్ట్‌లేనటా. వీళ్లు కుదిరితే తమతో తాము మాట్లాడుకుంటారు.. లేదంటే మౌనంగానే ఉండిపోతారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంట్రోవర్ట్‌లే ఎక్కువ విజయాలు సాధిస్తారట. ప్రపంచ రూపురేఖలు మార్చినవారిలో చాలామటుకు ఇంట్రోవర్ట్‌లున్నారని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఇంట్రోవర్ట్ బుక్
మేమొక రకం.. మాదొక లోకం.. అనితర సాధ్యం మా వాలకం అంటాడు మిస్టర్ మొహమాటం పుస్తకం రాసిన యంగ్ రైటర్ మురళి సర్కార్. ఒక మొహమాటస్తుడు మొహమాటం లేకుండా తనలోని మొహమాట భావాలను పుస్తకరూపంలో పంచుకున్నాడు. ఇంట్రోవర్టుల్లా బతికేందుకు పడే కష్టం ఇంతింత కాదు.. మాట్లాడకపోతే పొగరంటారు.. నవ్వి ఊరుకుంటే యాటిట్యూడ్ అంటారు.. మమ్మల్నేం జెయ్యమంటారని కొశ్చెన్ చేస్తున్నారు మురళి. తమదైన ప్రపంచంలో బ్రతికేస్తూనే ఏదో ఓ రోజూ ప్రపంచమే గుర్తించేంతలా పనిచేసుకుంటూ పోయే క్రియేటివ్ పర్సన్సే మా ఇంట్రోవర్ట్స్. పది మందితో పడి పడి మాట్లాడ్డమే కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకునే ఈ జమానాలో, పక్కోడితే పనిపడి మాట్లాడాలంటే నరాలు నారా రాకెట్ స్పీడ్ తో కొట్టేసుకుని టెన్షన్ పడిపోయే బ్యాచ్ మా ఇంట్రోవర్ట్స్ అని నిర్మొహమాటంగా చెప్తున్నాడు.
ప్రతిభగల వారు..
ఇంట్రోవర్ట్ అని ఎవరి గురించైనా తెలిస్తే అదేదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తుంటారు జనాలు. కానీ అది తప్పు అని అంటున్నారు మానసిక నిపుణులు. ఇంట్రోవర్ట్ అనేది వ్యాధి కాదు, వారి వ్యక్తిత్వం. అందరూ ఒకేలా ఉండాలనేం లేదు కదా.? ఒక్కోసారి సౌండ్ కంటే సైలెన్స్ బాగుంటుందనే విషయం తెలుసుకోవాలంటున్నారు. ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసేయొద్దనీ.. వాళ్లలో ఎంతో ప్రతిభ దాగివుంటుందని చెప్తున్నారు. వాళ్లు తమ భావోద్వేగాలను బయటకు చెప్పకపోవచ్చుగానీ మానసికంగా బలంగా ఉంటారట. ఇంకోటి వీరికి మొండి ధైర్యం ఎక్కువ. ఇంట్రోవర్ట్‌లను పిరికివాళ్లు అనుకోవడం తెలివితక్కువ పనే అనేది నిపుణుల అభిప్రాయం. ఫైనల్‌గా ఇంట్రోవర్టులు మానసికంగా చాలా దృఢంగా ఉంటారట.
అంతా ప్రశాంతం..
పార్టీలకు వెళ్లరు.. పలకరించరు కాబట్టీ వీరికి షార్ట్ టెంపర్ అనుకోవద్దని చెప్తున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఇంట్రోవర్ట్‌లు అసలెవరినీ దూషించరట. మొదట్లో పొగరుగానే అనిపిస్తారు కానీ రానురాను వాళ్లపై గౌరవం పెరుగుతుందని చెప్తున్నారు. దేనినైనా ప్రశాంతంగా.. తెలివిగా ఆలోచించి దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారట. ఈ ప్రశాంతతే కోపాన్ని వారి దరిచేరనీయదు. రష్యన్ సైంటిస్టులు ఇంట్రోవర్ట్‌లపై జరిపిన ఒక పరిశోధనలో ఇవి వెల్లడయ్యాయనీ, సంఘటనలు, విషయాలను సుదీర్ఘకాలంపాటు గుర్తుంచుకునే లక్షణంలో వీళ్లలో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రతి ఒక్కరికీ బ్రెయిన్‌లో ఫ్రంటల్ లోబ్ ఉంటుంది. ఐతే ఇంట్రోవర్ట్‌లకు ఈ ఫ్రంటల్ లోబ్‌లో రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసి బాగా ఆలోచించేలా తోడ్పడుతుందని అంటున్నారు సైకాలజిస్టులు.
ఇలా గుర్తుపట్టండి
ఇంట్రోవర్ట్‌లు ఒంటరితనం వల్ల రీచార్జ్ అవుతుంటారు. సాధారణమైన విషయాల కన్నా అర్థవంతమైన అంశాల గురించి చర్చించడానికి ఇష్టపడతారు. ప్రతీదాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఆలోచనలను, ఫీలింగ్స్‌ను పరస్పర చర్చల ద్వారా కాకుండా రాతపూర్వకంగా వెలిబుచ్చడానికి ఇష్టపడతారు. గ్రూప్ యాక్టివిటీస్, టీమ్ యాక్టివిటీస్ కంటే చదవడం, రాయడం, డ్రాయింగ్ వంటి వాటి పట్ల ఆసక్తి కనబరుస్తారు. కాబట్టీ ఎవరికైనా
మెరుగైన సమాజం కోసమే: మురళి సర్కార్, మిస్టర్ మొహమాటం- ఇంట్రోవర్ట్ మ్యూజిక్స్ పుస్తక రచయిత
చుట్టాలు, ఫంక్షన్లు, పలకరింపులు, మీటింగులు లేని మెరుగైన సమాజం కోసం మేలుకొని కలలు కనే మాలాంటి మొహమాటస్తులందరికీ హ్యాపీ ఇంట్రోవర్ట్స్ డే. ఎవరింట్లో వాళ్లముండి, అలవాటు ప్రకారం ఏకాంతంగా గడిపేస్తూ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటారు?
అదొక జీవనశైలి: వీరేందర్ చెన్నోజు, ప్రముఖ సైకాలజిస్ట్
ఇంట్రోవర్ట్ అనేది బలమా.? బలహీనతా.? అనేది చెప్పలేం. అదొక జీవన శైలి అని చెప్పొచ్చు. అది అనుకోవడం వల్లనో.. ప్రిపేర్ అవడం వల్లనో వచ్చింది కాదు.. మనిషి పెరిగే క్రమంలో తనకు వచ్చిన అనుభవాల వల్ల.. తను చూసిన ప్రపంచం వల్ల తనకు తెలియకుండానే ఏర్పరచుకున్న ఒక కండీషన్. అంతేకాకుండా ఇంట్రోవర్ట్ ఉండటం వల్ల తనకు నిజంగానే ఏం కావాలి అనే అంశాల పట్ల స్పష్టత ఉన్నాసరే.. ఇది నాక్కావాలి అనే స్పష్టత ఉండదు. తనతో ఉన్న వ్యక్తులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇండివిజువల్ గా తన ప్రపంచంలో తాను ఉండి తను ఎలా ఉండాలో అలా ఉండే అవకాశం ఉంది.