Toursim : వెళ్లొద్దామా.. వింటర్ టూర్

Update: 2024-11-17 05:30 GMT

ఆహ్వానిస్తున్న ప్రకృతి అందాలు

కొండప్రాంతాలకే పర్యాటకుల ఓటు

మంచు పర్వతాల సందర్శనకు క్యూ

ప్రకృతి ప్రేమికులకు పర్యాటకం మించిన సంతోషం ఉండదు. ప్రకృతి అందాలను చూసేందుకు ఒళ్లంతా వెయ్యి కళ్లు చేసుకున్నా చాలవు. ప్రకృతిని ఆస్వాదిస్తుంటే మనసు గాలిలో తేలిపోతుంది. అన్ని టెన్షన్లు దూదిపింజాల్లా గాలిలో కొట్టుకుపోతాయి. అలా ప్రకృతి అందాలకు నెలవైన ప్రదేశాలు మనదేశంలో కోకొల్లలు. ఎండాకాలం కొన్ని ప్రదేశాలు మధురానుభూతులను కలిగిస్తే.. శీతాకాలం మరికొన్ని మరచిపోలేని గుర్తులను మిగిల్చుతాయి. అయితే, వేసవిలో ఎండనుంచి తప్పించుకునేందుకు ఊటీ, కశ్మీర్ లాంటి ప్రదేశాలకు వెళ్తారు.. మరి శీతాకాలం చలినుంచి తప్పించుకునేందుకు రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాలకు వెళ్తారా? అంటే కానే కాదు. అప్పుడు కూడా మంచు దట్టంగా ఉండే ప్రదేశాలనే చాలామంది పర్యాటకులు ఎంచుకుంటారు. ఫలితంగా వేసవితోపాటు శీతాకాలం కూడా పర్యాటకులతో ఈ ప్రదేశాలు సందడి చేస్తుంటాయి. దేశంలోని బెస్ట్ వింటర్ టూరిస్ట్ స్పాట్స్ ఏమిటో తెలుసుకుందాం.

గుల్మార్గ్ (జమ్ము కశ్మీర్)

భూతల స్వర్గంగా పేరొందిన జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులను అలరించే అనేక ప్రదేశాలు ఉన్నాయి. కానీ, వీటిలో గుల్మార్గ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా ప్రసిద్ధికెక్కింది. హిమాలయాల్లోని పీర్ పంజాల్ పర్వతసాణువుల్లో మంచుతో కప్పబడే కొండలు, చెట్లు సైతం మంచుతో నిండి ఉండే ఈ ప్రదేశం పర్యాటకులను చూపు తిప్పుకోనివ్వదు. మంచు వర్షానికి ఇళ్ల పైకప్పులు మంచుతో కప్పబడి ఉంటాయి.. మైదానాల్లో మూడు, నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో పర్యాటకులకు ఆటలతో సేద తీరుతారు. కాగా, గుల్మార్గ్ అనేది ఓ అడవిపువ్వు. పచ్చికబయళ్లలో ఎక్కువగా పూచే ఈ పూలు.. ఇక్కడ అనేక రకాలు ఉన్నాయి. అందుకే మొఘల్ రాజులు ఇక్కడినుంచి ఎర్రకోటకు దాదాపు 21 రకాల గుల్మార్గ్ పూల జాతులను తీసుకెళ్లారట. అందుకే ఈ ప్రాంతానికి గుల్మార్గ్ అని పేరువచ్చింది. ఇక ఇక్కడ అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్క్, ఫిరోజ పూర్ నాలా, తంగ్ మార్గ్ తదితర ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. వింటర్ లో జరిగే మంచు ఉత్సవాలు గుల్మార్గ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

శ్రీనగర్ నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, హైదరాబాద్ నుంచి గుల్మార్గ్ 2,369కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీనగర్ కు విమానంలో వెళ్లవచ్చు. లేకపోతే జమ్ము తావి ఎక్స్ ప్రెస్ రైలులో హైదరాబాద్ నుంచి శ్రీనగర్ నేరుగా చేరుకోవచ్చు.

షిమ్లా (హిమాచల్ ప్రదేశ్)

బ్రిటిషర్లకు వేసవి విడిదిగా షిమ్లా ఉండేది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని నగరమైన షిమ్లా ఏడు కొండల సమాహారం. ఇప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువే విస్తరించి ఉండటం గమనార్హం. ఇక్కడ వాతావరణం వేసవిలో 19 డిగ్రీ సెల్సియస్ కాగా, శీతాకాలంలో -1 డిగ్రీ సెల్సియస్ కు కూడా పడిపోతుంది. షిమ్లాలో చూడదగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఇందులో బ్రిటిషర్ల కాలంలో కట్టిన నిర్మాణాలే అధికంగా ఉంటాయి. చారిత్రక కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ కల్కా-షిమ్లా రైల్వే మార్గం.. ఇది 860కి పైగా వంతెనలు, 103 సొరంగాల గుండా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలతో పర్యాటకులు పరవశించేలా చేస్తుంది. ప్రతి ఏటా క్రిస్మస్ డిసెంబర్ 25 నుంచి జనవరి 1 వరకు శీతాకాల సంబరాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జనవరిలో నిర్వహించే మంచు స్కేటింగ్ పోటీలకు వివిద దేశాలనుంచి క్రీడాకారులు, పర్యాటకులు హాజరవుతారు.

హైదరాబాద్ నుంచి షిమ్లాకు దూరం 1650కిలోమీటర్లు. ఢిల్లీ మీదుగా విమానంలో షిమ్లాకు ఐదు గంటల్లో చేరుకోవచ్చు. రైలులో అయితే 14గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి.. క్రైస్ట్ చర్చ్, వైస్ రీగల్ లాడ్జ్, కాళీబరి ఆలయం, రిడ్జ్ రోడ్, జాకూ హిల్స్, వ్యాక్స్ మ్యూజియం, అన్నాడేల్.

ముస్సోరీ (ఉత్తరాఖండ్)

పర్వతాల మహారాణిగా పేరొందిన ముస్సోరీ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో ఉన్నది. హిమాలయ పర్వత సావుణుల్లో మంచుకురిసే ప్రాంతాల్లో ముస్సోరీ ఉండటంలో శీతాకాలంలో ఇక్కడ హిమపాతం ఎక్కువే. వేసవితోపాటు శీతాకాలంలో కూడా టూరిస్టులు భారీగా ఇక్కడి వస్తారు. ఇక్కడ భరద్వాజ ఆలయం, ధనౌల్తీ, క్యామెల్స్ బ్యాక్ రోడ్, లాల్ టిబ్బ, గన్ హిల్స్, కెంప్టీ ఫాల్స్ చూడదగిన ప్రదేశాలు. ఇక్కడ దేశవిదేశాల్లో ప్రసిద్ధికెక్కిన విద్యాలయాలు కూడా ఉన్నాయి. అవి 18వ శతాబ్దంలో ప్రారంభించినవి కావడం విశేషం. ఇందులో జీసస్ మేరీ కాన్వెంట్ (1854), సెయింట్ జార్జ్ కాలెజ్ (1853), వుడ్ స్టాక్ స్కూల్ (1854), ఓక్ గ్రూవ్ స్కూల్ (1888) ముఖ్యమైనవి. వీటితోపాటు లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కొలువై ఉన్నది. ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్ లకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. డెహ్రాడూన్ కు 35 కి.మీ., దేశ రాజధాని ఢిల్లీకి 290కి.మీ. దూరంలో ఉన్నది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడినుంచి ట్రైన్, విమాన, రోడ్డు మార్గాల గుండా ముస్సోరీ చేరుకోవచ్చు.

డార్జిలింగ్ (పశ్చిమబెంగాల్)

మనదేశంలో తేయాకు పండిన ప్రాంత ఇదే. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం కోల్ కతా కేంద్రంగా పనిచేసేది. ఆ సమయంలో వేసవి విడిదిగా డార్జిలింగ్ కు బ్రిటిష్ అధికారులు వచ్చేవారు. ఆ సమయంలో ఆ ప్రాంతం సిక్కిం రాజ్యంలో భాగంగా ఉండేది. దానిని బ్రిటిష్ అధికారులు లీజుకు తీసుకుని.. ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. అయితే, తేయాకు తోటల ఉత్పత్తికి డార్జిలింగ్ అనుకూలంగా ఉంటుందని భావించిన బ్రిటిష్ అధికారులు ఇక్కడి పర్వతవాలులో సాగు చేశారు. తేయాకు తోటల ప్రయోగం విజయవంతం కావడంతో అడవులను నరికివేసేందుకు, తేయాకు తోటల్లో పనిచేసేందుకు వేలాదిమంది కార్మికులను అక్కడికి తరలించారు. వీరిలో ఎక్కువశాతంమంది నేపాలీలు ఉన్నారు. అదేసమయంలో బ్రిటీష్ అధికారుల అవసరాల కోసం రైల్వే లైన్లు, విహారయాత్రలకు అనుగుణంగా అభివృద్ధి జరిగింది. 1881లో ఇక్కడ ఏర్పాటైన టాయ్ ట్రైన్ నేటికీ అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ చూడదగిన ప్రదేశాల్లో పద్మజ నాయుడు జూపార్క్, బటాసియా లూప్, జపనీస్ పీస్ పగోడ, టైగర్ హిల్ ముఖ్యమైనవి. ప్రధానంగా ఇక్కడ విస్తారంగా ఉండే టీ తోటలను చూస్తే మనోహరంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి 1700కి.మీ. దూరం ఉంటుంది. ఇక్కడికి నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. రైలు, రోడ్డు మార్గం నుంచి అయితే, కోల్ కతా మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు.

గ్యాంగ్ టక్ (సిక్కిం)

హిమాలయాల సౌందర్యం, బౌద్ధారామల ఆధ్యాత్మికత కలబోసిన ప్రాంతం గ్యాంగ్ టక్. ఇక్కడ అడుగడుగునా బౌద్ధ మత ఆరాధ కనిపిస్తుంది. మంచు సరస్సులు, దట్టమైన అడవులు ఇక్కడి ప్రత్యేకత. మౌంటేన్ ట్రెక్కింగ్ ఇక్కడ ప్రత్యేకత. శీతాకాలంలో మంచు కురుస్తుండగా చేసే ఈ ట్రెక్కింగ్ దాదాపు వారం నుంచి పదిరోజులు సమయం తీసుకుంటుంది. 7 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయస్సు వారు ఈ ట్రెక్కింగ్ లో పాల్గొనవచ్చు. ఉద్యోగాల్లో ఒత్తిడి ఎదుర్కొనేవారు ఈ ట్రెక్కింగ్ ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు. పవిత్ర హిమాలయ పర్వతాల అందాలను తిలకిస్తూ మానసిక ఒత్తిడి తగ్గించుకుంటారు. జోంగ్రి పర్వతం అంచులనుంచి సూర్యోదయం చూస్తే మనసు పులకించిపోతుంది. మంచుతోనిండిన జోంగ్రి పర్వతం సూర్యకిరణాలతో బంగారు రంగులోకి మారే దృశ్యం గుండెల్లో నిలిచిపోతుంది. స్వాతంత్ర్యానికి పూర్వం స్వతంత్ర రాజ్యంగా ఉన్న సిక్కిం.. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక విలీన ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే, విదేశీ వ్యవహారాలు, సరిహద్దు రక్షణ బాధ్యతలను భారతదేశానికి అప్పగించింది. అయితే, 1975లో సిక్కింలో అంతర్గత కలహాలు చెలరేగడంతో అక్కడి ప్రభుత్వం అస్థిరంగా మారడంతో ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ భారతదేశంలో సిక్కింని విలీనం చేయాల్సిందిగా ప్రతిపాదించారు. అసెంబ్లీలో ఆమోదంతోనే సిక్కిం భారత్ లో 22వ రాష్ట్రంగా అవతరించింది.హైదరాబాద్ నుంచి గ్యాంగ్ టక్ 2024కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ విమానాశ్రయం లేదు. 120కి.మీ. దూరంలో డార్జిలింగ్ కు సమీపంలో బాగ్డోగ్రా విమానాశ్రయం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి విమాన సౌకర్యం ఉంటుంది. ట్రైన్ అయితే కోల్ కతా మీదుగా చేరుకోవచ్చు.

మున్నార్ (కేరళ)

దక్షిణ భారతదేశపు కశ్మీర్ గా మున్నార్ కు పేరు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ గిరి నగరం కొలువై ఉన్నది. మున్నారు అంటే మలయాళంలో మూడు నదులు అని అర్థం. మున్నార్ చుట్టూ ముత్తిరపుళ, నల్లథన్ని, కుండాలి నదులు ఉండటంతో ఈ పేరు వచ్చింది. ఇక్కడ కూడా డార్జిలింగ్, ఊటీలాగే కాఫీ, టీ తోటలు ఎక్కువగా ఉంటాయి. 1879లో జాన్ డేనియల్ హెన్రీ అనే బ్రిటీష్ అధికారి ట్రావెన్ కోర్ రాజు నుంచి ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేసి కాఫీ, టీ తోటలు పెంచాడు. అప్పటినుంచి అనేకమంది ఇక్కడ టీ ఎస్టేట్లు పెట్టారు. ఇక్కడ పొత్తమేడు వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎకో పాయింట్, ఎరవికుళం నేషనల్ పార్క్, అత్తుకల్, చిన్నకానల్ వాటర్ ఫాల్స్ చూడటానికి చాలా బాగుంటాయి. లాక్ హర్ట్ గ్యాప్ లో కొండవాలులో మేఘాలు పరుచుకుని ఉండటం కనిపిస్తుంది.. ఆ దృశ్యం అనిర్వచనీయంగా ఉంటుంది.హైదరాబాద్ నుంచి 1050 కి.మీ. దూరంలో ఉంటుంది. కొచ్చికి విమానంలో వెళ్లి అక్కడినుంచి 125కి.మీ. రోడ్డు మార్గంలో మున్నార్ చేరుకోవచ్చు. రైలు మార్గంలో కొచ్చి, ఎర్నాకుళం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో బెంగళూరు మీదుగా కూడా వెళ్లవచ్చు. ఊటీకి వెళ్లే మార్గంలోనే మున్నార్ ఉంటుంది.

కూర్గ్ (కర్ణాటక)

మిరియాల తోటలు కూర్గ్ లో ప్రత్యేక ఆకర్షణ. దేశంలో పావువంతు మిరియాలు కూర్గ్ లోనే పండుతాయి. ఇక కాఫీ, రబ్బరు, యాలకుల తోటలు ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. గతంలో కూర్గ్ అని పిలిచినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణం పేరును కొడగు అని మార్చింది. స్థానికులు దీనిని కొడవనాడ్ అని పిలుచుకుంటారు. పశ్చిమకనుమల్లో ఉన్న కూర్గ్ లో టిబెటన్ల స్వర్ణ ఆలయం, హరంగి ఏనుగుల క్యాంప్, ట్రీ పార్క్, అబే ఫాల్స్, ఇరుపు ఫాల్స్, మాదికేరి ఫోర్ట్ చూడదగిన ప్రదేశాలు. హిల్ వ్యూ కోసం తాడియండమోల్, కుమార పర్వత, మండల్ పట్టి హిల్స్ చూపు తిప్పుకోనివ్వవు. మున్నార్ వెళ్తుంటేనే దట్టమైన అడవుల గుండా చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రాజా సీట్ అనే వ్యూ పాయింట్ ఉంటుంది. కూర్గ్ పాలించిన రాజు ఇక్కడే సాయంకాలం కొద్దిసేపు గడిపి ప్రకృతిని ఆస్వాదించేవాడని చెపుతారు. అక్కడ ఆయన కూర్చునేందుకు ప్రత్యేకంగా నిర్మించిన ఓ కట్టడం కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత రివర్ రాఫ్టింగ్. వేగంగా ప్రవహించే నది అందులో రాళ్లు రప్పలు దాటుతూ పడవ నడపడం మరిచిపోలేని అనుభూతిని మిగుల్చుతుంది. రోడ్డు మార్గంలో వెళ్లేవారికి రహదారి వెంబడి గజరాజులు దర్శనమివ్వడం టూర్ మొత్తానికి హైలైట్ పాయింట్ గా నిలుస్తుంది. జింకలు, ఎనుబోతులు, అప్పుడప్పుడూ పులులు సైతం కనిపిస్తుంటాయి.హైదరాబాద్ నుంచి 819కి.మీ. దూరంలో ఉంటుంది. రైలు, రోడ్డు మార్గాల గుండా అయితే బెంగళూరు మీదుగా రావాల్సి ఉంటుంది.

ఊటీ (తమిళనాడు)

కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో పశ్చిమ కనుమల్లో నెలకొన్న హిల్ స్టేషన్ ఊటీ. ఉదకమండలంగా స్థానికులు పిలుచుకునే ఈ పట్టణానికి దేశవిదేశీ పర్యాటకులు నిత్యం వస్తూనే ఉంటారు. దీనిని హిల్ స్టేషన్స్ క్వీన్ గా పిలుస్తుంటారు. మద్రాసు కేంద్రంగా పాలించిన బ్రిటీషర్లకు ఊటీ వేసవి విడిదిగా ఉండేది. ఈనాటికీ బ్రిటీషర్ల కాలంలో కట్టిన అనేక కట్టడాలు కనువిందు చేస్తాయి. ఊటీలో వేసవిలో 10 నుంచి 25 డిగ్రీ సెల్సియస్ మధ్య శీతాకాలంలో 0 నుంచి 20 డిగ్రీలమధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఊటీ ప్రయాణం రోడ్డు మార్గం గుండా చేయడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఊటీని చేరుకున్నాక కాదు.. దట్టమైన అడవిగుండా సాగే ఆ జర్నీయే స్పెషల్ గా నిలిచిపోతుంది. ముదుమలై నేషనల్ పార్క్ లో స్వేచ్ఛగా విహరించే పులులతోపాటు కొండకోనల్లో అడపాదడపా లంగూర్ అనే కోతులు కనిపిస్తాయి. ఇవి చూడటానికి కొండెంగల్లా ఉన్నా.. నల్లని శరీరంతో ఉంటాయి. ఇక ఊటీలో ఎక్కడ చూసిన స్వేచ్ఛగా తిరిగే గుర్రాలు కనిపిస్తాయి. వాటిని బంధించడం, తరలించడం ఇక్కడ నేరంగా పరిగణిస్తారు. అందుకే అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇక్కడ బొట…


Similar News