జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. ఏ ఏడాది ప్రారంభమైందో తెలుసా

భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది జనవరి 24వ తేదీని జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం.

Update: 2024-01-24 09:04 GMT

దిశ, ఫీచర్స్ : భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది జనవరి 24వ తేదీని జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే ఈ ఏడాది కూడా జనవరి 16వ జాతీయ బాలికా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దేశంలో ఉన్న ప్రతి ఒక్క బాలికకు తన హక్కుల గురించి అవగాహన కల్పించేందుకే జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. శిక్షణ, ఆరోగ్యం, ఉపాధి పై ఈ రోజున బాలికలకు అవగాహన కల్పిస్తారు. మరి ఈ బాలికా దినోత్సవాన్ని ఏ ఏడాది నుంచి జరుపుకుంటున్నారు. ఎలా ప్రారంభించారో ఇప్పుడు తెలుసుకుందాం..

24 జనవరి 2008న భారతదేశంలో మొట్టమొదటి సారిగా జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా.. శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జనవరి 24 వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు అంటే 1966, జనవరి 24 వ తేదీన భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతూ మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఆడ పిల్లలకు హక్కుల గురించి అవగాహన కల్పించడం, పోషకాహారం ప్రాముఖ్యత పైన అవగాహన కల్పించడం, బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తి చూపేందుకు బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇక బాలికలను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22, 2015 వ తేదీన బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని అమలు చేశారు. ఈ జాతీయ కార్యక్రమాన్ని విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య..కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మహిళా.. శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ పథకం ద్వారా క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News