Pregnancy women : ప్రెగ్నెన్సీ టైమ్‌లో తప్పక తీసుకోవాల్సిన ఆహారాలివే..
ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తర్వాత 3 నెలల వరకు గర్భిణుల్లో వికారం, వాంతులు, నీరసం, కడుపు ఉబ్బరం వంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి.
దిశ, ఫీచర్స్ : బరువు తగ్గడానికీ, సన్నబడటానికే కాదు.. గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే, పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీ డైట్ చాలా ముఖ్యం అంటున్నారు ఆహార నిపుణులు. సమతుల్య ఆహారం తీసుకోవడంవల్ల, ముఖ్యంగా నాలుగో నెల నుంచి మరిన్ని జాగ్రత్తలు, శరీరానికి కావాల్సిన పోషకాలు లభించే ఆహారాన్ని తీసుకోవడంవల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తర్వాత 3 నెలల వరకు గర్భిణుల్లో వికారం, వాంతులు, నీరసం, కడుపు ఉబ్బరం వంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మూడు నెలల వరకు దాదాపు ఏదీ సరిగ్గా తినాలనిపించదు. తిన్నా వాంతులు అవుతుంటాయి. దీంతో కొందరు ఆహారం తీసుకోవడం చాలా వరకు తగ్గిస్తుంటారు. ఈ కారణంగా తల్లీ బిడ్డలకు కావాల్సిన పోషకాలు అందవు. నాలుగో నెల పడ్డప్పటి నుంచి వాంతులు, వికారం, అనీజీ వంటి సమస్యలు తగ్గుతాయి కాబట్టి, ఆ సమయంలో గర్భిణుల్లో ఆకలి కూడా పెరుగుతుంది. ఈ సమయంలోనే తగిన పోషకాలు శరీరానికి అందితేనే తల్లీ బిడ్డల ఆరోగ్యానికి మంచిదని గైనకాలజిస్టులు చెప్తున్నారు.
హిమోగ్లోబిన్ చాలా ముఖ్యం
హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. తల్లి తీసుకునే ఆహారం ద్వారా లభించే పోషకాలు, ఐరన్ వంటివి కడుపులోని బిడ్డకు సరఫరా అవుతుంటాయి. కాబట్టి సరైన పోషకాహారం తీసుకోకపోతే హిమోగ్లోబిన్ శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుంది. బాడీలో ఐరన్ తగ్గడంవల్ల రక్తహీన ఏర్పడి, కడుపులోని పిండం సరిగ్గా ఎదగకపోవడం, కాన్పు సమయంలో సహజ ప్రసవం కాకపోవడం, నెలలు నిండకముందు ప్రసవం కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పుట్టబోయే పిల్లల్లో రక్తహీనతకు కూడా కారణం కావచ్చు. కాబట్టి ప్రగ్నెన్సీ టైమ్‌లో శరీరానికి ఐరన్ లభించే ఆహారం తీసుకోవాలని, డాక్టర్ సలహాతో ఐరన్ మాత్రలు వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా రోజువారీ ఆహారంలో శరీరానికి పోషకాలు, ఐరన్ పుష్కలంగా లభించే ఆకు కూరలు, పప్పులు, రాగులు, చిక్కుళ్లు, ఖర్జూరం, బీన్స్, చేపలు, మాసం, గుడ్లు, పాలు ఆహారంలో భాగంగా తప్పక తీసుకోవాలి.
ప్రొటీన్స్, కాల్షియం
గర్భిణి ఆరోగ్యానికే కాకుండా బిడ్డలో మెదడు, ఇతర కణజాలాల అభివృద్ధికి ప్రోటీన్‌తో కూడిన ఆహారం చాలా అవసరం. గర్భాశయ ఆరోగ్యానికి, రొమ్ముల బలానికి కూడా ఇది తోడ్పడుతుంది. రోజుకూ 44 గ్రామలు వరకు ప్రోటీన్లు లభించే ఆహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాగులు, జొన్నలు, పప్పుధాన్యాలు, నట్స్, మొలకెత్తిన గింజలు, బీన్స్, చేపలు, గుడ్డు, శనగలు వంటివి శరీరానికి ప్రోటీన్లను అందించే ఆహారంగా తోడ్పడతాయి. అలాగే కడుపులోని బిడ్డకు ఎముకలు ఏర్పడటానికి, అవి బలంగా ఉండటానికి కాల్షియం సహాయపడుతుంది. కండరాలు, నరాల కదలికలు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రక్రియలో కూడా కాల్షియం తోడ్పడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇవి కచ్చితంగా తీుకోవాలి. గుడ్లు, పాలు, ఛీజ్, వెన్న, టోఫు, వైట్ బీన్స్, బాదం, సార్డినెస్, సాల్మన్ చేపలు, ఆకు కూరలు, రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
ఫోలిక్ యాసిడ్.. విటమిన్ డి
అలాగే పుట్టబోయే బిడ్డకు మెదడులో ఎటువంటి లోపాలు రాకుండా, వెన్ను గట్టిగా ఏర్పడేందుకు డాక్టర్లు గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ మాత్రలు సజెష్ చేస్తుంటారు. వీటిని తప్పక వాడటంవల్ల బిడ్డల్లో పుట్టకతో వచ్చే వివిధ సమస్యలు, జబ్బులు రాకుండా ఉంటాయి. తృణ ధాన్యాలు, గుడ్లు, బీన్స్, సిట్రస్ పండ్లు, ఆకు కూరల్లో ఇది లభిస్తుంది. అలాగే విటమిన్ డి కూడా కడుపులోని బిడ్డలో ఎముకలు నిర్మాణానికి చాలా అవసరం. వైద్యుల సలహాతో రోజూ విటమిన్ డి లభించే ఆహారం తీసుకోవడమో, మాత్రలు వేసుకోవడమో చేయాలి. అలాగే ప్రతిరోజూ ఉదయం పూట లేత ఎండలో కాసేపు ఉంటే విటమిన్ డి సహజంగానే లభిస్తుంది. తృణధాన్యాలు, సాల్మన్ చేపలు, గుడ్ల, ఫ్యాటీ ఫిష్, చీజ్‌లలో కూడా విటమిన్ డి లభిస్తుంది.
ఒమెగా- 3, ఫ్యాటీ యాసిడ్స్
గర్భధారణ తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. తల్లీ బిడ్డల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇవి గుండె, మెదడు, కళ్ల ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థ పనితీరుకు దోహదం చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చే నీరసం, మానసిక ఆందోళన, డిప్రెషన్‌ను వంటి సమస్యలను తగ్గిస్తాయి. గుమ్మడి విత్తనాలు, చేపలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్‌నట్స్, బ్రొకోలి, కొత్తిమీర, అవిసె గింజలు, ఆలీవ్ ఆయిల్, అవకాడో, చియా గింజలు, పిస్తా, చేపలు, సాల్మన్ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
వాటర్ బాగా తాగాలి
ఆహారంతోపాటు తగినంత నీరు ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలా అవసరం. పోషకాహారం తీసుకుంటున్నప్పటికీ సరిపడా నీళ్లు తాగకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి రోజుకూ కనీసం 8 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాసెంటా నీరు, ఉమ్మనీరు ఏర్పడటానికి నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరంలో తగినంత నీటిశాతం లేకపోతే డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి న్యూరల్ ట్యూబ్ లోపాలు, నాడీ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.