Viral: మానవాళికి ముప్పు పొంచి ఉందా?.. క్లైమేట్ చేంజ్‌పై నాసా చెప్తున్నది ఇదే..

ఇటీవల ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో క్లైమేట్ చేంజ్ ఒకటి. వాతావరణ కాలుష్యం, పారిశ్రామికీకరణ అడవుల నరికివేత, ప్రకృతి వనరుల విధ్వంసం వంటివి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Update: 2024-06-27 07:16 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో క్లైమేట్ చేంజ్ ఒకటి. వాతావరణ కాలుష్యం, పారిశ్రామికీకరణ అడవుల నరికివేత, ప్రకృతి వనరుల విధ్వంసం వంటివి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రీసెంట్‌గా ది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కూడా ఇదే స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల్లో మానవ ప్రమేయం అధికంగా ఉంటోందని, దీని కారణంగా సముద్రాలు వేడెక్కుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉన్నట్లేనని హెచ్చరిచ్చింది.

నాసా వాతావరణ విభాగానికి చెందిన నిపుణులు మానవ కార్యకలాపాలవల్ల సముద్ర ఉపరితలాలు ఎలా ప్రభావితం అవుతాయో తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఓ గ్రాఫిక్ వీడియోనూ కూడా రిలీజ్ చేశారు. ఆయా భౌగోళిక పరిసరాల్లో సముద్ర వాతావరణం ఎలా మరుతుందో ఇందులో వివరించారు. ఈ వీడియోలోని సమాచారం ప్రకారం.. సముద్ర ఉపరితలాలు బ్లూ, గ్రీన్ రంగుల్లో గమనించవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్‌లో కనిపించాయి. అంటే.. ఆయా ప్రాంతాల్లో ఉపరితల వాతావరణం చాలా వేడిగా ఉందని, భవిష్యత్తులో ప్రపంచమంతా ఇలా జరిగే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

‘మన సముద్రం మారుతోంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నాసా సైంటిస్టులు భూభాగంలో దాదాపు 70 శాతం నీరు ఆక్రమించి ఉన్నందున, భూ వాతావరణం, పర్యావరణ మార్పుల విషయంలో సముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పటికే మానవ చర్యలవల్ల రోజు రోజుకూ గ్రీన్‌హౌస్ ఉద్గారాలు పెరిగిపోతున్నందున మన కళ్లముందే సముద్రాల్లో ప్రతికూల మార్పులు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. 


Similar News