పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి

సాధారణంగా నెలకొకసారి వచ్చే పీరియడ్స్ వల్ల అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతుంటారు. బాడీ పెయిన్, స్టమక్ పెయిన్, చిరాకు, నీరసం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు.

Update: 2024-06-30 08:54 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా నెలకొకసారి వచ్చే పీరియడ్స్ వల్ల అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతుంటారు. బాడీ పెయిన్, స్టమక్ పెయిన్, చిరాకు, నీరసం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఇక కొంతమందికి వాటితో పాటు హెవీ బ్లీడింగ్ కూడా అవుతుంది. దీనివల్ల రోజూవారీ పనులు కూడా చేసుకోలేనంత అలసటగా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే రక్తహీనత, అలసట, బలహీనత, శ్వాస సమస్య, మూడ్ స్వింగ్స్, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య ఎక్కువైతే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం. కానీ కాస్త ఉపశమనం ఇచ్చే చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. ఐరన్ ఉన్న ఆహారాలు:

అధిక రుతుస్రావం వల్ల రక్తహీనత, ఐరన్ లోపం ఏర్పడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం ద్వారా అధిక రక్తస్రావాన్ని నియంత్రించవచ్చు. ఆప్రికాట్, ఎండుద్రాక్ష, గుడ్లు, బీన్స్, వండిన పాలకూర, బ్రోకలీ, గింజలు, డ్రై ఫ్రూట్స్, టోఫు మొదలైన వాటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

2. హీటింగ్ ప్యాడ్:

హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీటి వాటర్ బాటిల్స్ వల్ల పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో వచ్చే నొప్పి తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న చోట హీటింగ్ ప్యాడ్ పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది. అధిక రక్తస్రావం కాకుండా కూడా కాపాడుతుంది. గర్భాశయ కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంతో వేడి వల్ల నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

3. నిద్ర:

బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే కనుక పీరియడ్స్ సమయంలో తగినంత నిద్ర చాలా అవసరం. నిద్ర వల్ల హార్మోన్ల స్థాయి నియంత్రణలోకి వస్తాయి. క్రమంగా బ్లీడింగ్ తగ్గుతుంది. సరిగ్గా నిద్ర పోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ సమయంలో వచ్చే నొప్పి, అలసటను భరించ గలుగుతారు.

4. ఆయుర్వేద చిట్కాలు:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్ గుణాలు ఉన్నాయి. ఇది నొప్పిని తగ్గించడంలో బాగా పని చేస్తుంది. అలాగే ఈ సమయంలో రక్తం ఎక్కువగా కోల్పోకుండా చూస్తుంది.

*తాజా అల్లం ముక్కను తురిమి ఐదు నుండి పది నిమిషాలు నీటిలో ఉడికించి అల్లం టీని తయారు చేయండి. దీన్ని వడగట్టుకుని మీ పీరియడ్స్ సమయంలో రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగండి.

*దాల్చిన చెక్క, ధనియాలలో ఒక కప్పు నీటిని పోసి ఉడికించి అరకప్పు అయ్యే వరకు మరిగించాలి. కొద్దిగా పంచదార కలిపి, ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

* ఒక స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుని తీసుకోవడం కూడా మంచి మార్గం.

* చింతపండు, తేనె, నీటితో పేస్ట్ తయారు చేసి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చింతపండులోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, తీవ్రమైన రక్తస్రావాన్ని తగ్గిస్తాయి.

*ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది చాలా మంది మెచ్చే ఇంటి చికిత్స. అధిక రక్తస్రావం అవుతుంటే ఇది మంచి మందులా పనిచేస్తుంది. ఈ చిట్కాకు మీ శరీరాన్ని శుభ్రపరిచే, రక్త ప్రవాహాన్ని నియంత్రించే, అధిక రక్తస్రావాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది. అధిక రక్తస్రావంతో పాటు ఇతర రుతుస్రావ లక్షణాల వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడానికి, రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి రోజుకు రెండు నుండి మూడు సార్లు తాగాలి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News